111 జీవో పరి«ధిలోని నిర్మాణాలను కూల్చివేస్తున్న ప్రభుత్వ సిబ్బంది
ఏళ్లుగా హామీ: ‘అధికారంలోకి వస్తే 111 జీవోను రద్దు చేసి మీ స్థలాలకు ఢోకా లేకుండా చూస్తాం’ అంటే పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీని నమ్మి సామన్యులు ఈ జీవో పరిధిలోని గ్రామాల్లో వెలసిన వెంచర్లలో కొన్నేళ్లుగా ప్లాట్లు, స్థలాలు కొనుగోలు చేస్తున్నారు.
ప్రస్తుతం: ఈ జీవో రద్దు మాట దేవుడెరుగు... జీవో పరిధిలోకి వచ్చే గ్రామాల్లో లేఅవుట్లకు అనుమతి లేదంటూ పంచాయతీరాజ్‌శాఖ వేల ఎకరాల్లో వేసిన లేఅవుట్లను నేలమట్టం చేస్తోంది.
పర్యవసానం: అధికారులు ఆయా లేఅవుట్లను కూల్చేస్తుండటంతో వారి సొంత గూటి ఆశ ఆదిలోనే ఆవిరవుతోంది. 111 జీవో సడలింపు ఆశజూపి లేఅవుట్లు వేసిన డెవలపర్లు జేబులు నింపుకోగా ఆ జీవో పరిధిలో ప్లాట్లు కొనుక్కున్న వారు ఆర్థికంగా నష్టపోతున్నారు.
హైదరాబాద్ శివార్లలోని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల పరిరక్షణ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జారీ అయిన 111 జీవో... జంట జలాశయాల పరిధిలోని ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యుల పుట్టి ముంచుతోంది. జలాశయాలకు 10 కి.మీ. పరిధిలోకి వచ్చే 7 మండలాల్లోని 84 గ్రామాల్లో 90 శాతం భూమిని వ్యవసాయ అవసరాలకే వినియోగించాలని, కేవలం 10 శాతం భూమినే నిర్మాణాలకు వాడుకోవచ్చని, పరిశ్రమల స్థాపనకు ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశం లేదనేది ఆ జీవో సారాంశం. అయితే పార్టీల హామీతో ఆయా గ్రామాల్లో రియల్టర్లు వెంచర్లు వేసి ప్లాట్లుగా అమ్ముకునప్పుడు చోద్యం చూసిన పంచాయతీరాజ్ అధికారులు ఇప్పుడు జీవో పేరు చెప్పి లేఅవుట్లను కూల్చేస్తున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇప్పటివరకు అధికారులు కూల్చిన లేఅవుట్లలో మధ్యతరగతి ప్రజలు నష్టపోయిన మొత్తం రూ. 16 వేల కోట్లపైనే.
ఓ లేఅవుట్‌లో ధ్వంసం చేసిన రోడ్డు
కనిష్టంగా గజానికి రూ. 20 వేలు..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, శంషాబాద్, షాబాద్, కొత్తూర్, శంకర్‌పల్లి, చేవెళ్ల, పూర్వ రాజేంద్రనగర్ మండలాలు 111 జీవో పరిధిలోకి వస్తాయి. ఈ మండలాల పరిధిలో గత 10–15 ఏళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం సహా ఐటీ కంపెనీల ఏర్పాటుతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి. దీంతో ఇక్కడి భూములు ధరలు గజం రూ. 40–60 వేల వరకు చేరాయి. 111 జీవో వచ్చిన తొలినాళ్లలో ఇక్కడ భూముల కొనుగోలుకు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపకున్నా 2009లో స్థాని కుల నుంచి జీవో ఎత్తేయాలనే డిమాండ్ వచ్చింది. ఆందోళనలు కూడా జరగడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు 111 జీవోను ఎత్తేస్తామని హామీలిచ్చాయి. పార్టీల వాగ్దానాలతో ప్రజల్లోనూ మార్పు వచ్చింది.
అదే సమయంలో జీవో రద్దవుతుందనే ధీమాతో వేల ఎకరాల్లో వెంచర్లు వెలిశాయి. ఇప్పుడు ఆ వెంచర్లనే పంచాయతీరాజ్ అధికారులు కూల్చేస్తున్నారు. ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం శంషాబాద్, మొయినాబాద్, షాబాద్, శంకర్‌పల్లి, చేవెళ్ల మండలాల పరిధిలోని 47 గ్రామాల్లో 2,991 ఎకరాల విస్తీర్ణంలో వెలసిన 303 లేఅవుట్లను ధ్వంసం చేశారు. 2,991 ఎకరాలను గజాల లెక్కన లెక్కించి నిబంధనలకు అనుగుణంగా 40% మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉంచాల్సిన భూమిని తీసేస్తే కనీసం ఈ లెక్క 80,75,700 గజాలుగా తేలుతోంది. సగటున గజానికి రూ. 20 వేల చొప్పున లెక్కగట్టినా అధికారులు ధ్వంసం చేసిన స్థలాల విలువ రూ. 16,150 కోట్లపైనే. ఆ మేరకు ఇప్పటికే సామాన్యులు నష్టపోగా కూల్చివేతలు ముమ్మరం చేస్తే మరింత మంది నిండా మునగనున్నారు.
సరిదిద్దాల్సింది పార్టీలు, ప్రభుత్వమే...
సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని తెలిసినా పార్టీలు జీవో రద్దుపై హామీలివ్వడం తప్పు. ఇప్పుడు ఆ తప్పును సరిచేయాల్సింది పార్టీలు, ప్రభుత్వమే. జీవోను ఎత్తేయడం రాష్ట్ర పరిధిలోని అంశమే అయినా అందులో న్యాయపరమైన చిక్కులున్నాయి. కానీ ప్రభుత్వం తలుచుకుంటే కొంతైనా సడలింపు వస్తుంది. – రెవెన్యూ వ్యవహారాల్లో తలపండిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి
సహేతుక కారణాలు చూపితే
పర్యావరణ కాముకుల వ్యతిరేకత, సుప్రీంకోర్టులో న్యాయపరంగా ఉన్న అవాంతరాలను పరిగణనలోకి తీసుకుంటూనే స్థానికులు, భూములు కొన్న ప్రజలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి. జీవో 111 పరిధిలోకి వచ్చే దిగువ ప్రాంతంలోని గ్రామాలకైనా సడలింపు ఇవ్వాలి. ఎగువ ప్రాంతంలోనూ 90% కాకుండా కనీసం 50% మేరకైనా వ్యవసాయ భూములుండాలన్న నిబంధనను సవరించాలి. లేదంటే జీవోను పూర్తిగా ఎత్తేసేలా చర్యలు తీసుకోవాలి. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటికి ఇబ్బంది అనే సమస్య రాకుండా కృష్ణా, గోదావరి నుంచి నీటిని తీసుకొని జంట జలాశయాలను నింపాలనే ప్రభుత్వ ప్రతిపాదనను ముందుపెట్టి గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీం కోర్టుకు సహేతుక కారణాలు చూపితే జీవో ఎత్తివేత కష్టమేమీ కాదు. – న్యాయ నిపుణుల అభిప్రాయం
నిరాశే మిగిలింది...
ఆర్మీలో పనిచేసి 2018లో రిటైరయ్యాక రూ. 23 లక్షలు పెట్టి చిలుకూరు రెవెన్యూ పరిధిలో హైదరాబాద్–బీజాపూర్ రహదారి పక్కన వెంచర్‌లో 208 గజాల ప్లాటు కొన్నా. అక్రమ వెంచర్ అంటూ అధికారులు కూల్చేశారు. ఇప్పుడు నా ప్లాటు ఎక్కడుందో కూడా తెలియట్లేదు. నా కుటుంబానికి ఈ ప్లాటు ఉపయోగపడుతుందని ఆశించిన నాకు నిరాశే మిగిలింది. – లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి, పెద్దమంగళారం
వెంచర్ కూల్చేశారు...
తమిళనాడు నుంచి 20 ఏళ్ల క్రితం ఇక్కడికి వలసవచ్చిన నేను సొంత ప్లాట్ ఉండాలనే ఆలోచనతో రూ. 25 లక్షలు పెట్టి మొయినాబాద్ సమీపంలో ప్లాటు కొన్నా. 111 జీవో పరిధిలో వెంచర్ అంటూ అధికారులు వెంచర్‌ను కూల్చివేశారు. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. – రాంచందర్, ప్లాటు కొనుగోలుదారుడు
Comments
Please login to add a commentAdd a comment