
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 29 వరకు పొడిగించడంతో పాటు పలు రకాల సడలింపులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలోని జిల్లాల్లో ఉన్న పురపాలికల్లో దుకాణాలను ఒకరోజు తప్పించి మరో రోజు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. సరి–బేసి సంఖ్యల విధానం ద్వారా దీనిని అమలు పరచనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ బుధవారం జారీ చేశారు.
అన్ని జోన్ల పరిధిలో వీటికే అనుమతి..
రెడ్ జోన్ పరిధిలోని పుర పాలికలతో సహా రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో కిరాణం, పాలు, కూరగాయలు, పండ్లు, మందులు వంటి నిత్యావసర సరుకులు దుకాణాలను యథాతథంగా నిర్వహించుకోవచ్చు. అయితే అదనంగా ఈ కింది దుకాణాలను తెరవడానికి కొత్తగా అనుమతి లభించింది.
►నిర్మాణ రంగంతో ముడిపడి ఉన్న సిమెంట్, స్టీల్, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వస్తువులు, ఇతర భవన నిర్మాణ సామగ్రికి సంబంధించిన దుకాణాలు.
►వ్యవసాయ రంగానికి సంబంధించిన దుకాణాలు ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన మేరకు కంటైన్మెంట్ జోన్ల పరిధిలోనివి మినహా అన్ని మద్యం దుకాణాలు.
దుకాణాలకు సరి–బేసి సంఖ్యలు
ఒకరోజు తప్పించి మరో రోజు తెరవాల్సిన దుకాణాలను సులువుగా గుర్తించేందుకు వాటికి సరి–బేసి సంఖ్యలు కేటాయిస్తారు. 1, 3, 5, 7.. ఇలా బేసి సంఖ్య కలిగిన దుకాణాలను సోమ, బుధ, శుక్రవారాల్లో అనుమతిస్తారు. 2, 4, 6, 8.. వంటి సరి సంఖ్యలు కేటాయించిన దుకాణాలను మంగళ, గురు, శనివారాల్లో అనుమతిస్తారు. ఒక రోజు 50 శాతం దుకాణాలను అనుమతిస్తే మరుసటి రోజు మిగిలిన 50 శాతం దుకాణాలకు అనుమతి ఉంటుంది. పక్కపక్కనే ఉండే రెండు దుకాణాలను ఒకే రోజు తెరిచేందుకు అనుమతి ఉండదు. దుకాణాల్లో పనిచేసే వ్యక్తులు, వినియోగదారులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. మాస్కు లేకుంటే సరుకులు/సేవలు లేవనే నినాదంతో పనిచేయాలి. భౌతిక దూరం పాటించడానికి నాలుగు అడుగుల నిడివితో ఫుట్ మార్కింగ్ చేయాలి. ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. లిఫ్టుల బటన్‌లు, డోర్ హ్యాండిల్స్ వంటి కామన్ టచ్ పాయింట్ల వద్ద ఎరుపు రంగు (డేంజర్)లో సూచిక ఏర్పాటు చేయాలి. వీలున్న చోట ఆటోమేటిక్‌గా తెరుచుకునే డోర్లను ఏర్పాటు చేయాలి.
అన్ని జోన్లలో నిషేధం వీటిపైనే..
లాక్‌డౌన్ అమల్లో ఉన్నంత కాలం అన్ని జోన్ల పరిధిలోని పురపాలికల్లో ఈ కింద పేర్కొన్న వాటిపై నిషేధం కొనసాగనుంది.
►అన్ని పాఠశాలలు/కళాశాలలు/విద్యా/శిక్షణ/కోచింగ్ సెంటర్లు
►రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు వంటి ఆతిథ్య సేవలందించేవి (వైద్య/పోలీసు/అధికారులు/ఆరోగ్య కార్యకర్తలు/చిక్కుకున్న ప్రజలు/టూరిస్టులకు వసతి కల్పిస్తున్న, క్వారంటైన్ సేవలందిస్తున్న హోటళ్లకు మినహాయింపు)
►అన్ని సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, జిమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్‌పూల్స్, ఎంటర్‌టైన్మెంట్ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియం, అసెంబ్లీ హాల్స్ ఇతరత్రాలు
►ప్రార్థనా స్థలాల్లో గూమికూడటం
►అన్ని రకాల సామాజిక/రాజకీయ/క్రీడా/వినోద/విద్య/ మతపర కార్యక్రమాలు/ఇతర సామూహిక కార్యక్రమాలు 65 ఏళ్లకు పైగా వయసు కలిగిన వ్యక్తులు, ఇతర ఆరోగ్య సమస్యలున్న వ్యక్తులు, గర్భిణిలు, 10 ఏళ్లలోపు పిల్లలు ఇళ్లల్లోనే ఉండాలి. చదవండి: తెలంగాణలో మద్యం జాతర
గ్రీన్, ఆరెంజ్ జోన్లలో వీటికి అనుమతి..
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ –మల్కాజిగిరి, గద్వాల, వరంగల్ (అర్బన్) జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఉన్న మున్సిపాలిటీల్లో నిషేధించినవి మినహా మిగిలిన అన్నింటినీ ఒక రోజు తప్పించి మరో రోజు (ఆల్టర్నేటివ్ డేస్)లో తెరవాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని జిల్లాలు, పురపాలికల్లో ఈ–కామర్స్‌కు అనుమతి. 7 లేదా 8 నుంచి ఈ సడలింపులు అమల్లోకి వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment