హెచ్‌ఆర్‌సీలో టీ.వైఎస్‌ఆర్ సీపీ ఫిర్యాదు
హైదరాబాద్ : ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో దారుణంపై తెలంగాణ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహిరించి రోగి మృతికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరింది. స్పందించిన హెచ్‌ఆర్‌సీ ఈ ఘటనపై వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో వచ్చే నెల 6వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. (ప్రాణం ఖరీదు రూ. 150!)
వివరాల్లోకి వెళితే... మహబూబ్ నగర్ జిల్లా లింగాల మండలం రాయారంకు చెందిన వడ్త్యా కృష్ణ నాయక్ ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరి అందక కొట్టుమిట్టాడుతున్న అతనికి వెంటనే ఆక్సిజన్ పెట్టాలంటూ కృష్ణ భార్య డ్యూటీలోని సిబ్బందిని కోరింది. అయితే అందుకు రూ.150 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన దగ్గర డబ్బు లేదని, ఆక్సిజన్ పెట్టాలని ఆమె కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు. దీంతో అతడు కొద్దిసేపటికే మృతి చెందాడు. ఈ దుర్ఘటనను వైఎస్‌ఆర్ సీపీ ...హెచ్‌ఆర్‌సీ దృష్టికి తీసుకువెళ్లింది.