తెలుగు సినీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ సాధారణ సర్వసభ్య సమావేశం వాడి, వేడిగా జరిగింది.
హైదరాబాద్(బంజారాహిల్స్): తెలుగు సినీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ సాధారణ సర్వసభ్య సమావేశం వాడి, వేడిగా జరిగింది. ఆదివారం ఉదయం బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని కార్యాలయంలో సమావేశం జరిగింది. పెద్ద ఎత్తున జూనియర్ ఆర్టిస్ట్‌లో ఈ సమావేశంలో పాల్గొని తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా యూనియన్ ఆదాయ, వ్యయ ఖర్చులు చూపించాలంటూ సభ్యులు డిమాండ్ చేయగా ఆ మేరకు యూనియన్ అధ్యక్షుడు స్వామిగౌడ్, ప్రధాన కార్యదర్శి రవి అక్కడికక్కడే ఖర్చులను, ఆదాయాన్ని చూపించారు.
లెక్కలన్నీ పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వాటిని తెలుపుతున్నామని చెప్పారు. ఎన్నికలు నిర్వహించాలని సభ్యులు డిమాండ్ చేయగా వచ్చే నెలలో ఎన్నికల తేదీని ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కొత్తగా చేరిన 200 మంది సభ్యులకు ఓటు హక్కు కల్పించవద్దంటూ పలువురు ఆర్టిస్టులు డిమాండ్ చేయగా ఓటు హక్కు ఉంటుందని అయితే పోటీ చేసే అవకాశం మాత్రం కల్పించబోమని స్పష్టం చేశారు.