పాల్వంచ,న్యూస్‌లైన్: టీడీపీ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై నోరుమెదపని కోనేరు చిన్ని(సత్యనారాయణ)ను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీలో రోజురోజుకు తుమ్మల, నామా వర్గాల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. నామా నాగేశ్వరరావు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కోనేరు చిన్ని ఒంటెత్తు పోకడలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు తెలిపారు.
శనివారం ఖమ్మం వచ్చిన చంద్రబాబుని చల్లపల్లి గార్డెన్స్‌లో తుమ్మల వర్గానికి చెందిన రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి మేడిద సంతోష్ గౌడ్, పట్టణ కార్యదర్శి కనగాల బాలకృష్ణ ఆధ్వర్యంలో పలువురు నేతలు కలిసి నామా, చిన్నిల ఒంటెత్తు పోకడలపై వివరించినట్లు వారు ఆదివారం విలేకరులకు తెలిపారు. కొత్తగూడెం నియోజక వర్గ ఇన్‌చార్జిగా ఉన్న కోనేరు సత్యనారాయణ(చిన్ని)కి టిక్కెట్టు ఇవ్వోద్దని కోరినట్లు చెప్పారు. నామా జిల్లాలో తన సొంత వ్యాపారాల కోసం, తన వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీని ఉపయోగించుకుంటున్నారే తప్ప పార్టీని బలోపేతం చేయాలన్న తపన లేదని అధినేతకు వివరించినట్లు తుమ్మల వర్గీయులు పేర్కొంటున్నారు.
కొత్తగూడెం నియోజక వర్గ ఇన్‌చార్జిగా ఏడాది క్రితం బాధ్యత చేపట్టిన చిన్ని కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నోరు మెదపకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా తీర్పు ఇవ్వడానికి కొత్తశక్తులను ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇక్కడ నామా వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు చిన్ని వారసత్వ రాజకీయాలకు కొత్తగూడెం నియోజకవర్గ కార్యకర్తలు గులామ్‌గిరి చేయలేరని తేల్చి చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ టికెట్ తుమ్మల వర్గానికి ఇవ్వాలని అధినేతకు వినతిపత్రాలు ఇచ్చినట్లు తమ్ముళ్లు పేర్కొంటున్నారు.
సభ నిర్వహణపై చేతిలేత్తేసిన చిన్ని
జిల్లాలోని అన్ని మండలాలకు అందుబాటులో ఉన్న కొత్తగూడెంలో చంద్రబాబు నాయుడు ‘ప్రజా గర్జన’ బహిరంగ సభను ఏర్పాటు చేస్తే అధికారంలేక నైరాశ్యంలో ఉన్న ఇక్కడి నాయకుల్లో, కార్యకర్తల్లో చైతన్యం కలిగేదని జిల్లా పార్టీ ఆలోచించిందని తుమ్మల వర్గం నేతలు తెలిపారు.
అయితే కోనేరు చిన్ని అసమర్థత తో సభ నిర్వహించలేమని చేతులు ఎత్తేయడంతోనే ఖమ్మంలో జరిపారని ఫిర్యాదు చేసినట్లు తుమ్మల వర్గం నేతలు తెలిపారు. అలాంటి వ్యక్తికి కొత్తగూడెం టికెట్టు ఇస్తే ఓడిపోవడం ఖాయమని, బీసీలకు కేటాయించే పరిస్థితి ఉంటే మేడిద సంతోష్ గౌడ్‌కు, ఓసీలకు ఇవ్వాలను కుంటే కనగాల బాలకృష్ణలకు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. పాల్వంచ జెడ్పీటీసీ అభ్యర్థిగా దొంతగాని రవిగౌడ్‌కు అవకాశం ఇవ్వాలని కోరినట్టు వివరించారు. అధినేతను కలిసి వారిలో తుమ్మల వార్గానికి చెందిన నాయకులు కాంపెల్లి కన కేష్, చల్లగుండ్ల వీరభద్రరావు, మదార్, వుండేటి రవికుమార్, దొంతగాని రవి, శీలం భద్రం, కడలి సత్యనారాయణ, రాహుల్, కిర ణ్ తదితరులు ఉన్నారు.
నామాపై తమ్ముళ్ల గుస్సా...
Published Mon, Mar 17 2014 2:11 AM | Last Updated on Sat, Jul 28 2018 3:21 PM
Advertisement
Advertisement