బాబు మోసాన్ని ఎండగడదాం: వైఎస్ జగన్ | Ys Jagan mohan reddy slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబు మోసాన్ని ఎండగడదాం: వైఎస్ జగన్

Published Sat, Jun 7 2014 2:01 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

బాబు మోసాన్ని ఎండగడదాం: వైఎస్ జగన్ - Sakshi

బాబు మోసాన్ని ఎండగడదాం: వైఎస్ జగన్

* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
* మరో 15 రోజుల్లోనే బాబు అసలు స్వరూపం బయటపడుతుంది
* ఆయన మోసాలను ఎల్లో మీడియా కప్పిపుచ్చడానికి చూస్తోంది
* కాబట్టి వాటిని ఎండగట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంది
* కార్యకర్తలకు అండగా ఉందాం.. ప్రజాసమస్యలపై పోరాడుదాం
* సార్వత్రిక ఫలితాలపై ముగిసిన తొలి విడత సమీక్షలు
* కార్యకర్తల్లో సమరోత్సాహాన్ని నింపిన జగన్

 
సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: ‘‘మోసాలతో మాయ చేసి అధికారం చేపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు అసలు స్వరూపం కేవలం 15 రోజుల్లోనే ప్రజలకు తెలియబోతోంది. గతంలో మద్యపాన నిషేధం ఎత్తివేసిన సమయంలో బాబుకు వెన్నుదన్నుగా నిలిచినట్టే.. ఇప్పుడు కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 వంటి ఎల్లో మీడియా సంస్థలు ఆయనకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆయన మోసాలు బయటకు రానీయకుండా కంటికి రెప్పలా బాబును కాపాడనున్నాయి. బాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంది. పార్టీని గ్రామస్థాయి వరకూ బలోపేతం చేద్దాం. కార్యకర్తలకు బాసటగా నిలుద్దాం. గ్రామ కమిటీలను పునరుజ్జీవింపజేసి టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఆ కమిటీల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్దాం. పోరాటాల ద్వారా ప్రజలకు అండగా నిలుద్దాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
 
 సార్వత్రిక ఎన్నికల గెలుపు ఓటములపై రాజమండ్రి వేదికగా బుధవారం నుంచి శుక్రవారం వరకూ.. మూడు రోజులపాటు నిర్వహించిన తొలి విడత సమీక్షా సమావేశాలు శుక్రవారం రాత్రితో ముగిశాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో 8 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 51 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు ఓటములపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించి నాయకులు, కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. పేరుపేరునా కార్యకర్తలను పలకరిస్తూ వారిలో మనోధైర్యం నింపారు. చివరి రోజైన శుక్రవారం ఉభయ గోదావరి జిల్లాల్లోని అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని రాజోలు, పి.గన్నవరం, ముమ్మిడివరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఆచంట, పాలకొల్లు, ఉండి, నర్సాపురం అసెంబ్లీ సెగ్మెంట్ల నాయకులు, కార్యకర్తలతో సమీక్షించారు.
 
 తెల్లవారుజాము వరకూ కొనసాగిన సమీక్షలు
 ఆయా నియోజకవర్గాలకు కేటాయించినదానికంటే ఎక్కువ సమయం వెచ్చించడంతో.. సమీక్షల షెడ్యూల్‌లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటూ వచ్చింది. తొలి రోజు నుంచీ సమీక్షలు అర్ధరాత్రి దాటేవరకూ కొనసాగుతూ వచ్చాయి. కార్యకర్తలు చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధగా విన్న జగన్‌మోహన్‌రెడ్డి వారి సూచనలు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సమీక్షలు తెల్లవారుజామున ఐదు గంటల వరకూ సాగాయి. శుక్రవారం ఇదే తరహాలో అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం సమీక్షలో, గ్రామ కమిటీలు, మండల కమిటీలను పునర్వ్యవస్థీకరించి, నిత్యం ప్రజలతో మమేకమయ్యేలా చూడాలని పి.గన్నవరం గ్రామానికి చెందిన బంగారు నాయుడు జగన్‌కు సూచించారు.
 
  వైఫల్యాలకు ఒకరిపై మరొకరు కారణాలు నెట్టుకోవడం మాని, ఇకనైనా నేతలు సమన్వయంతో పరస్పరం సాయపడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పెనుమంట్ర సర్పంచ్ దాట్ల రంగవతి సూచించారు. ‘ఓడినా మేమేమీ అధైర్యపడడం లేదు. మీరూ అధైర్యపడకండి. గెలుపు అవకాశం ఉన్న పార్టీగా వైఎస్సార్ సీపీని బలోపేతం చేద్దాం’ అని ఉండి కార్యకర్త అర్చారావు అన్నారు. ‘మీకోసం నాలుగున్నరేళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రానున్న ఐదేళ్లు కూడా ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాం. అవసరమైతే ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నానని కుటుంబం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని ఆచంటకు చెందిన డాక్టర్ మునుబాబు అన్నప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సమీక్ష సమావేశాల్లో నాయకులు, కార్యకర్తల మనోగతాలను తెలుసుకునేందుకే జననేత అధిక ప్రాధాన్యతనిచ్చారు. రానున్న రోజుల్లో పార్టీ విధివిధానాలపై నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
 
 అధికారం కన్నా విశ్వసనీయత ముఖ్యం: జగన్
 నాయకులకు అధికారం కన్నా విశ్వసనీయత ముఖ్యమని, విలువలతో కూడిన రాజకీయాలు చేసినప్పుడే ప్రజలు మనల్ని ఆదరిస్తారని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సమీక్షల సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ‘‘రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా నిలిచాం. రానున్న రోజుల్లో పదునైన వ్యూహాలతో పార్టీని గ్రామస్థాయి వరకూ బలోపేతం చేద్దాం. దేశంలో ఇప్పటివరకూ ఉన్న ప్రతిపక్ష పార్టీలకు భిన్నంగా, బలమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడేందుకు నాయకులు, కార్యకర్తలు ఇప్పటినుంచే కార్యోన్ముఖులు కావాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘అధికారంలోకి వచ్చిన టీడీపీ, బీజేపీ కూటమి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నా కేవలం 5.60 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువ తెచ్చుకుంది. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా రుణమాఫీ హామీతో చంద్రబాబు ప్రజలను నమ్మించగలిగారు. మరో 15 రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది.
 
 రైతులు రుణాల కోసం బ్యాంకర్ల వద్దకు వెళ్తారు. పాత రుణాలు మాఫీ చేస్తేనే కానీ కొత్త రుణాలు ఇవ్వరు. అప్పుడు చంద్రబాబు మోసం బయటపడుతుంది. రైతులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు’’ అని అన్నారు. ‘‘నేను కూడా రైతు రుణ మాఫీ హామీ ఇచ్చి ఉంటే మూడు నెలలు తిరక్కుండానే మీరంతా నా దగ్గరకు వచ్చి ఆచరణ సాధ్యం కాని హామీలు ఎందుకిచ్చావన్నా? గ్రామాల్లోకి వెళ్లలేకపోతున్నామన్నా.. అని అనేవారు. ఆ పరిస్థితి రాకూడదనే నేను ఆ హామీ ఇవ్వలేదు. నేను ముఖ్యమంత్రి కావాలనుకునే లక్ష్యం వెనుక ఒక బలమైన ఆశయం ఉంది. ఒకసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ల పాటు వరుసగా తిరిగి ఎన్నుకునేలా ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. ఓటమిపై దిగులు చెందాల్సిన పనిలే దు. ధైర్యంగా ఉండండి. భవిష్యత్ మనదే’’ అంటూ జగన్ కార్యకర్తల్లో మనోధైర్యం నింపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement