సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అభివృద్ధి మొత్తం తన హయాంలోనే జరిగిందని చంకలు గుద్దుకుంటూ జనాన్ని మోసం చేయాలని చూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. ఆయన తొమ్మిదేళ్ల పరిపాలనలో జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేకుండా పోయింది. కనీసం జిల్లా కేంద్రమైన ఒంగోలును సైతం ఆయన పట్టించుకోలేదు. కేవలం తమ పార్టీ నాయకులు, కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చడానికే ఆయన పరిమితమయ్యారు. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పలానా పని చేశామని చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. ఒంగోలు నడిబొడ్డున నిరుపయోగంగా ఉన్న ఊరచెరువును పూడ్చివేసి స్టేడియం నిర్మించాలని స్థానికులు కోరితే.. టీడీపీ హయాంలో దాన్ని మట్టిదిబ్బగా మార్చి వదిలేశారు.
నీటి ఎద్దడితో పట్టణవాసులు అల్లాడుతుంటే రంగారాయుడు చెరువును సాగర్ నీటితో నింపి బోట్ క్లబ్ అంటూ ఉపయోగం లేని పనులు చేశారు. టీడీపీ జిల్లా కార్యాలయం నిర్మాణానికి భూములు కబ్జా చేశారు. ఈ విషయం వెలుగులోకి వచ్చి విచారిస్తే.. ఆ భూములు ఆగ్నిమాపక కేంద్రానికి కేటాయించినవని తేలింది. కొత్తపట్నం రోడ్డుపై రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ కాంట్రాక్ట్‌ను టీడీపీకి చెందిన కాంట్రాక్టర్‌కు అప్పగించారు. కాసులకు కక్కుర్తిపడిన ఆ కాంట్రాక్టర్.. బ్రిడ్జిని నాశిరకంగా నిర్మించడంతో ప్రారంభంలోనే కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు కూడా మరణించారు. టీడీపీ హయాంలో నిర్మించిన జిల్లా పరిషత్ కార్యాలయం కనీసం వారి పదవీకాలం పూర్తికాకముందే కొన్నేళ్లకే శిథిలావస్థకు చేరింది. దీంతో దాన్ని కూల్చివేశారు.
టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ అవినీతే అందుకు కారణమైనప్పటికీ దానిపై అతన్ని ప్రశ్నించిన దాఖలాలు కూడా లే వు. గ్రామాలకు దూరంగా బస్టాండ్లు నిర్మించి ప్రయాణికులను ఇబ్బందులపాలు చేశారు. ఆ బస్టాండ్లన్నీ అలంకారప్రాయంగా మారాయి. కేవలం తమ కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చేందుకు అప్పట్లో వాటిని నిర్మించారు. ఇలా చెప్పుకుంటూపోతే ఒంగోలుతో పాటు జిల్లా అభివృద్ధి గురించి టీడీపీ హయాంలో చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకపోగా, ఇంకాస్త నష్టం కలిగించేలా వ్యవహరించారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో అవన్నీ గుర్తుచేసుకుంటున్న ప్రజలు.. పచ్చపార్టీ అంటేనే మండిపడుతున్నారు.
చంద్రబాబు చేసిందేమీ లేదు
Published Tue, May 6 2014 2:22 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM
Advertisement
Advertisement