
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన ఓరుగల్లు అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సీఎం కేసీఆర్ కూడా వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం ప్రతి బడ్జెట్‌లో నగర అభివృద్ధికి రూ.300 కోట్లు కేటాయిస్తున్నారు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినిమా ఇండస్ట్రీ దృష్టి కూడా వరంగల్ వైపు మళ్లింది. దాదాపు ఇక్కడ18 సినిమాల షూటింగ్‌లు, ప్రమోషన్ వర్క్, విజయోత్సవాలను ఇక్కడ నిర్వహించారు.
ఒకప్పుడు వరంగల్‌లో సినిమా కార్యక్రమాలు చేయాలంటే సినీ ప్రముఖులు వెనుకడుగు వేసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. రోజు రోజుకు సినిమా ప్రమోషన్లు పెరిగిపోతున్నాయి. విడుదలకు ముందు సినిమా గురించి ప్రజలకు తెలిపేందుకు హైదరాబాద్, ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే గతంలో ప్రమోషన్ వర్క్ నిర్వహించే వారు. ఇప్పుడు వరంగల్‌లో సైతం జరుగుతున్నాయి. వరంగల్ విద్యాసంస్థలకు నిలయంగా మారడంతో విద్యార్థులు, యువత తాకిడి ఎక్కువగా ఉంటోంది. నిట్, కేఎంసీ, ఇంజనీరింగ్ కళాశాలు ఎక్కువగా ఉండడంతో అన్ని ప్రాంతాల కల్చర్ వరంగల్‌కు వచ్చేసింది.
గరుడవేగ సినిమా విజయోత్సవం సందర్భంగా వరంగల్‌లోని దేవి థియేటర్‌కు హీరో రాజశేఖర్ టీం వచ్చింది. హీరో నాని నటించిన ఎంసీఏ సినిమా సగం షూటింగ్ వరంగల్, రామప్ప, లక్నవరం, ఖిలా వరంగల్, నిర్వహించారు. బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో లండన్ బాబులు సినిమాలోని ఒక సాంగ్‌ను విడుదల చేశారు. రాజుగారి గది టీం హన్మకొండలోని అమృత థియేటర్‌కు వచ్చింది. రుద్రమదేవి సినిమాలోని మూడు పాటలను ఖిలా వరంగల్‌లోని శిల్పాల మధ్య విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో అల్లు అర్జున్, హీరోయిన్ అనుష్క, దర్శకుడు గుణశేఖర్ వచ్చారు. పిల్ల నువ్వులేని జీవితం సినిమా హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ రేజీనా వరంగల్‌లోని రాధిక, హన్మకొండలోని ఎషియన్ శ్రీదేవి మాల్‌కు వచ్చారు. గాలిపటం సినిమా విజయోత్సవం సందర్భంగా వరంగల్‌లోని రామ్‌లక్ష్మణ్ థియేటర్‌కు ప్రొడ్యూసర్ సంపత్ నంది, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలి యో, హీరో, హీరోహీరోయిన్ వచ్చి ప్రేక్షకులతో సందడి చేశారు. హీరోయిన్లు రేజీనా, సుఖన్య, హీరో రాహుల్ రవీంద్రన్ ములుగు రోడ్డులోని టాటా గోల్డ్ ప్లస్‌కు యాడ్ చిత్రీకరణ కోసం వచ్చారు.
రేపు ఎంసీఏ ప్రీ ఆడియో రిలీజ్ ఫంక్షన్
వెంకటేశ్వర క్రియేషన్స్ ఆధ్వర్యంలో వరంగల్‌లో చిత్రీకరించిన ఎంసీఏ సినిమా ప్రీ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్‌లో శనివారం నిర్వహించనున్నారు. ఇక్కడికి డైరెక్టర్, హీరో లు, హీరోయిన్లు రానున్నారు. ఇప్పటికే నిర్వాహకులు అన్ని అనుమతుల కోసం దరఖాస్తు చేశారు.
ఆడియో విడుదల కూడా..
గ్రేటర్ వరంగల్ నగరానికి సినీ తారల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. సినిమాల ప్రమోషన్స్ కోసం ఎంతోమంది నగరానికి వస్తున్నారు. దీంతో ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతోందనే విషయం ప్రేక్షకులకు త్వరగా తెలుస్తోంది. సినిమాకు ముందు ప్రమోషన్, విడుదలైన అనంత రం విజయోత్సవ యాత్రలు కూడా వరంగల్‌లో చేస్తున్నారు. సినిమాలకు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉండడంతో థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు ప్రమోషన్, విజయోత్సవ యాత్రలపై శ్రద్ధ చూపుతున్నారు. ఆడియో విడుదల సైతం వరంగల్‌లో ఉండే అభిమాన సంఘాల నాయకులతో చేయిస్తున్నారు.
భీమవరం బుల్లోడు సినిమా ప్రమోషన్‌తోపాటు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ హన్మకొండలోని శ్రీ దేవి మాల్‌లో జరిగింది. హీరో సునీల్, హీరోయిన్ ఎస్తేర్ తదితరులు వచ్చారు. చందమామ కథలు సినిమా ప్రమోషన్ నగర శివారులో వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. లెజెండ్ సినిమా విజయోత్సవ ర్యాలీ నగరంలో జరిగింది. సునీల్ థియేటర్‌లో హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను వచ్చి అభిమానులతో సందడి చేశారు. సినిమా తారలను చూసేందుకు, ఫొటోలు దిగేందుకు పోటీలు పడుతున్నారు. గోల్డ్, బట్టల షాపులు, ఇతర షాపుల ప్రారంభోత్సవాలకు సినీ తారలను తీసుకొస్తున్నారు. మహేష్‌బాబు నటించిన నంబర్ వన్ సినిమా పాటను అభిమాన సంఘం నాయకుడు గందె నవీన్ అవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment