ఆలయంలో నంది విగ్రహం చోరీ
గొండ్యాల్ గ్రామస్తుల రాస్తారోకో
పోలీసుల హామీతో ఆందోళన విరమణ
హన్వాడ : పురాతన ఆలయంలోని నంది విగ్రహాన్ని దుండగులు ఎత్తుకెళ్లగా, నిందితులను పట్టుకోవాలంటూ గ్రామస్తులు కొద్దిసేపు రాస్తారోకోకు దిగారు. చివరకు పోలీసుల హామీతో ఆందోళన విరమించారు. వివరాలిలా ఉన్నాయి. హన్వాడ మండలంలోని గొండ్యాల్ శివారులోని దేవునిగడ్డకాలనీలో సుమారు 200ఏళ్లనాటి నందీశ్వరాలయం ఉంది. గురువారం అర్ధరాత్రి ఆలయం తాళం పగులగొట్టి నంది విగ్ర హాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకెళ్లారు. శుక్రవారం ఉదయం అక్కడికి వచ్చిన భక్తులు విషయం తెలుసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాక వేపూర్ రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో ఈ ఆలయంలో మూడుసార్లు దుండగులు చోరీకి విఫలయత్నం చేశారని ఆరోపించారు. ఈ విగ్రహం అతి ప్రాచీనకాలం నాటిదని, దాని కొమ్ములు, గోపురం, కడుపు ప్రాంతం లో వజ్రాలు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి ఎస్‌ఐ లక్ష్మయ్య చేరుకుని వారితో మాట్లాడారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అక్కడి ఆనవాళ్లను బట్టి దొంగలు భారీ గంభీరంగా కనిపించే ఈ విగ్రహాన్ని తవ్వి తీసి ఓ వాహనానికి కట్టి లాకెళ్లినట్లు భావిస్తున్నారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.