సాక్షి, సిటీబ్యూరో: ఢిల్లీ, ముంబై, సూరత్‌లకు దీటుగా రాజధానిలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే దాదాపు 5 లక్షలకు చేరుకున్న వీటి సంఖ్యను 10 లక్షలకు చేర్చాలనే లక్ష్యంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు ముందుకెళ్తున్నారు. నగరంపై నిరంతర పర్యవేక్షణ, నేరగాళ్లపై నిఘా, కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటన్నింటినీ ఆయాకమిషనరేట్లలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ (సీసీసీ)కు అనుసంధానిస్తున్నారు. ఇప్పుడీ వ్యవస్థకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సైతం జోడించడంపై అధికారులు దృష్టిసారించారు.
‘తేడా’ లేకుండా...
2014లో అమల్లోకి వచ్చిన ప్రజా భద్రత చట్టాన్ని కమిషనరేట్ల అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. వ్యాపార సముదాయాలు, వాణిజ్య ప్రాంతాల్లో వ్యక్తిగతంగా, కమ్యూనిటీ మొత్తం కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడాన్ని కచ్చితం చేశారు. పోలీసు స్టేషన్ల వారీగా బాధ్యతలు అప్పగించిన కమిషనర్లు... ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు వీటి ఆవశ్యకతనూ వివరిస్తూ ఎవరికివారు ముందుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఏర్పాటవుతున్న కమ్యూనిటీ కెమెరాలను ఎవరికి నచ్చిన మోడల్, సామర్థ్యం కలిగినవి వారు ఏర్పాటు చేసుకుంటే సీసీసీతో అనుంధానం, పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలా కాకుండా యూనిఫామిటీ కోసమూ పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసు విభాగమే ప్రముఖ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. సీసీ కెమెరాలకు ఉండాల్సిన స్పెసిఫికేషన్స్‌ను నిర్దేశించి అంతా వాటినే ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో అన్నీ ఒకే రకమైన కెమెరాలు సమకూరుతున్నాయి.
అన్నింటికీ అనుసంధానం...
ఇప్పటికే జంట కమిషనరేట్లలో పోలీసు, ట్రాఫిక్ విభాగాలు ఏర్పాటు చేసిన కెమెరాలు సీసీసీతో అనుసంధానించి ఉన్నాయి. వీటి సంఖ్య పరిమితం కావడంతో అన్నిచోట్లా నిఘా సాధ్యం కావట్లేదు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఉన్నతా«ధికారులు వ్యాపార సముదాయాలు, వాణిజ్య కూడళ్లతో పాటు దుకాణాల్లోనూ ఏర్పాటు చేస్తున్న వాటినీ అనుసంధానిస్తున్నారు. దుకాణం లోపల భాగం మినహా బయటకు ఉన్న కెమెరాలు, కాలనీలు, పబ్లిక్ ప్లేసుల్లో ఉన్న అన్నింటినీ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా సీసీసీలతో అనుసంధానిస్తున్నారు. దీంతో పోలీసు విభాగానికి చెందిన కెమెరాలూ ప్రధానంగా ట్రాఫిక్ కోణంలో ఉన్నా... అనుసంధానించినవి నిఘా, శాంతిభద్రతల పర్యవేక్షణకు ఉపకరిస్తున్నాయి. రానున్న రెండేళ్లలో మూడు కమిషనరేట్లలో పోలీసు, కమ్యూనిటీ అన్నీ కలిపి 10 లక్షల సీసీ కెమెరాలు ఉండాలన్న లక్ష్యంతో కమిషనర్లు ముందుకెళ్తున్నారు. ఈ కలసాకారమైతే అలాంటి నిఘాతో కూడిన నగరంగా హైదరాబాద్ దేశంలోనే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించనుంది.
ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు
ప్రస్తుతం సిటీలో ఎలాంటి నేరం జరుగుతున్నా పోలీసులు ప్రధానంగా సీసీ కెమెరాలపైనే ఆధారపడుతున్నారు. అంతటి ప్రాధాన్యమున్న వీటి ఏర్పాటులో అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటును పర్యవేక్షించే బాధ్యతలను పోలీసుస్టేషన్ల వారీగా ఆయా ఇన్‌స్పెక్టర్లకు అప్పగించారు. వ్యాపారులు, సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్న వీరు కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది చివరి నాటికి సిటీలోని కెమెరాల సంఖ్యను భారీగా పెంచాలని, అన్నింటికీ సీసీసీతో అనుసంధానించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
సైబరాబాద్‌లో లక్షమార్కు...
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సీసీటీవీ కెమెరాల బిగింపు లక్ష మార్కును దాటింది. మాదాపూర్, బాలానగర్, శంషాబాద్ జోన్లలో మంగళవారం వరకు 1,00,419 నిఘానేత్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 13,846 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు, 86,669 ‘నేను సైతం’ కెమెరాలు ఉన్నాయి. అయితే జోన్ల వారీగా తీసుకుంటే అత్యధికంగా మాదాపూర్ జోన్‌లో 48,914, బాలానగర్ జోన్‌లో 26,783, శంషాబాద్‌లో 24,572 సీసీటీవీ కెమెరాలు బిగించారు. అలాగే పోలీసు స్టేషన్ల వారీగా తీసుకుంటే గచ్చిబౌలి ఠాణా పరిధిలో అత్యధికంగా 7,530 సీసీటీవీ కెమెరాలు బిగిస్తే అత్పల్పంగా చౌదరిగూడ ఠాణాలో 185 నిఘానేత్రాలు అమర్చారు. అలాగే రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 95,000 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ విషయానికొస్తే దాదాపు మూడు లక్షలకు పైగా సీసీటీవీ కెమెరాలు అమర్చారు.
Comments
Please login to add a commentAdd a comment