సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండగకు పంపిణీ చేయనున్న చీరల కొనుగోలుకు చేనేత జౌళిశాఖ టెండర్లు పిలిచింది. సిరిసిల్ల మరమగ్గాల నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమం తలపెట్టింది. దీనికోసం దాదాపు 86 లక్షల చీరెలు అవసరం. కానీ అంత భారీ మొత్తం వస్త్రోత్పత్తి సిరిసిల్లలో ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని అధికారు లు అంచనాకు వచ్చారు.
రాష్ట్రంలోనే అత్య ధికంగా సిరిసిల్లలో 32 వేల మరమగ్గాలు న్నాయి. కానీ అక్కడున్న రెగ్యులర్ ఆర్డర్ల కారణంగా ప్రభుత్వం ఇచ్చిన చీరల తయారీ పదివేల మరమగ్గాలపై మాత్రమే ప్రారంభమైంది. ఈ లెక్కన రోజుకు 8 లక్షల మీటర్ల ఉత్పత్తికి మించి సాధ్యం కాదు. కానీ ప్రభుత్వ ఆర్డరు మేరకు ఆరు కోట్ల మీటర్లు ఉత్పత్తి కావాలి. నెలలో ఇంత భారీ మొత్తం సాధ్యం కాదు కనుక... టెండర్లను ఆహ్వానించింది.