న్యూఢిల్లీ: వారు విదేశాలు వెళ్లిన దాఖలాలు లేవు.. చుట్టాలు పక్కాలు, ఇరుగు పొరుగు వారెవరూ విదేశాల నుంచి రాలేదు.. ఆరోగ్య, పారిశుధ్య సిబ్బందితోనూ సంబంధాలు లేవు..లేబొరేటరీల్లోనూ పని చేయలేదు..అయినా సరే 40 మందికి కరోనా సోకింది. పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది..ఎందుకిలా?? ఇప్పుడిదే కేంద్రానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
భారత్‌లో కరోనా వ్యాప్తిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన సర్వే ఫలితాలు ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో (ఎస్‌ఏఆర్‌ఐ) బాధపడుతున్న వారిలో ఎంపిక చేసిన 5,911 మందికి ఐసీఎంఆర్ కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. వారిలో 104 మందికి కరోనా పాజిటివ్ రాగా, వీరిలో 40 మందికి వ్యాధిగ్రస్తులెవరితోనూ నేరుగా సంబంధాలు లేకపోవడం, విదేశాల నుంచి వచ్చిన చరిత్ర లేకపోవడం ప్రభుత్వానికి షాక్ కలిగించింది. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 52 జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వే ఫలితాలు తాజాగా ఐసీఎంఆర్ మెడికల్ జర్నల్‌లో వెల్లడయ్యాయి. సర్వే నివేదిక ముఖ్యాంశాలు..
► తీవ్రమైన శ్వాస కోశ సమస్యలతో బాధపడే రోగులకు (ఎస్‌ఏఆర్‌ఐ) మార్చి 14 కంటే ముందు కరోనా వైరస్ అసలు సోకలేదు. అదే ఏప్రిల్ 2 వచ్చేసరికి అలాంటి వారిలో 2.6% మందికి కోవిడ్–19 సోకింది.
► 50 ఏళ్లకు పైబడినవారిలోనూ, పురుషులపైనా ఈ వైరస్ పంజా విసురుతోంది. 50–59 ఏళ్ల మధ్య వయస్కుల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
► ఎస్‌ఏఆర్‌ఐ రోగుల్లో 5,911 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 104 మందికి (1.4%) కరోనా ఉన్నట్టు తేలింది.
► ఈ కరోనా కేసుల్లో 40 మంది విదేశీ ప్రయాణాలు, విదేశాల నుంచి వచ్చిన వారితో సంబంధాలు లేకపోయినా వైరస్ సోకింది. మొత్తం 15 రాష్ట్రాల్లోని 36 జిల్లాల్లో ఇలాంటి కేసులున్నాయి.
► శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ కోవిడ్–19 బారిన పడిన వారిలో గుజరాత్ నుంచి అత్యధికంగా కేసులు (792) నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో తమిళనాడు (577), మహారాష్ట్ర (533), కేరళ (503) ఉన్నాయి. కోవిడ్ కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు కూడా ఇవే కావడం గమనార్హం.
నిబంధనలు కఠినతరం చేయాలి
దేశవ్యాప్తంగా 36 జిల్లాల్లో ఎలాంటి లింకులు లేకపోయినా కరోనా వ్యాపించడంతో ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు ఆయా ప్రాంతాల్లో కఠినమైన నిబంధనల్ని అమలు చేయాలని సూచిస్తున్నారు. భారత్‌లో సమూహ వ్యాప్తికి ఇది సంకేతమని ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ్ అభిప్రాయపడ్డారు.
సరిహద్దులు జాగ్రత్త
బీఎస్‌ఎఫ్‌కు అమిత్ షా ఆదేశాలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల వెంట చొరబాట్లను అడ్డుకునే దిశగా మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రి సరిహద్దు భద్రతాదళాన్ని(బీఎస్‌ఎఫ్)ను ఆదేశించారు. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో, ముఖ్యంగా ఫెన్సింగ్ లేని ప్రాంతాలపై, మరింత దృష్టి పెట్టాలన్నారు. ఈ సరిహద్దుల్లో పరిస్థితిపై శుక్రవారం బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా అమిత్ షా సమీక్ష జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో చొరబాట్లకు అవకాశం కల్పించకూడదని వారికి ఆదేశాలిచ్చారు. ఈ వివరాలను హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ మీడియాకు వివరించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 37,978 రిలీఫ్ క్యాంప్‌లు ఏర్పాటయ్యాయని, వాటిలో 14.3 లక్షల మంది కార్మికులు, వలస కూలీలకు ఆశ్రయం కల్పించామన్నారు.
ఎఫ్‌సీఐ ఉద్యోగులకు బీమా సౌకర్యం
► లక్ష మందికి పైగా ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) అధికారులు, కార్మికులకు రూ. 35 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
► ఉద్యోగులు తమ వేతనాల నుంచి యాజమాన్యాల ద్వారా పీఎంకేర్స్ నిధికి విరాళం ఇస్తున్నట్లయితే.. ఆ వివరాలను యాజమాన్యాలు ఆయా ఉద్యోగుల ఫామ్–16 టీడీఎస్ సర్టిఫికెట్‌లో చూపించాలని ఐటీ శాఖ కోరింది.
► దేశవ్యాప్త లాక్‌డౌన్ పరిస్థితుల్లో వీధుల్లో తిరుగుతున్న మానసిక వ్యాధిగ్రస్తులకు ఆశ్రయం కల్పించేందుకు తీసుకున్న చర్యలను రెండు వారాల్లోగా వివరించాలని హోం శాఖను మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.
► మధ్యప్రదేశ్‌లో 75 వేల జనాభాకు ఒక వెంటిలేటర్, 47 వేల మందికి ఒక ఐసీయూ బెడ్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తాజా అధికార గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలో శుక్రవారం నాటికి 426 కరోనా కేసులు, 33 మరణాలు సంభవించాయి.
ఆ 40 మందికి ఎలా సోకింది?
Published Sat, Apr 11 2020 4:01 AM | Last Updated on Sat, Apr 11 2020 4:58 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment