బస్సులను అడ్డుకున్న నాయకులు
అధికారులు, కార్మికుల మధ్య వాగ్వాదం
బస్సు కిందికి దూరిన కార్మికులు
ఆరుగురు నాయకుల అరెస్టు
తాండూరు : ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా నాలు గో రోజు తాండూరు డిపో వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డిపో నుంచి శనివారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్సులను నడపాలని అధికారులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న యూనియన్ నాయకులు, కార్మికులు డిపో గేట్ వద్ద ధర్నాకు దిగారు. బస్సులను ఎలా నడుపుతారంటూ డీప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, డిపో మేనేజర్ లక్ష్మీధర్మాలతో నాయకులు వాగ్వాదానికి దిగారు.
కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోనప్పుడు ఎందుకు సహకరించాలని నాయకులు ప్రశ్నించారు. దీంతో అధికారులు, నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో డిపో నుంచి చించొళి, కరన్‌కోట్ రూట్‌లో బస్సులను నడిపేందుకు బస్సులు బయలుదేరాయి. దాంతో ఆగ్రహం చెందిన కార్మికులు, నాయకులు బస్సులకు అడ్డంగా వెళ్లారు. మరికొందరు కార్మికులు బస్సు కిందికి దూరారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.
అర్బన్ ఎస్‌ఐ నాగార్జున, క్విక్ రియాక్షన్ టీం బలగాలు, పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తోపులాట జరిగింది. పరిస్థితి విషమించడంతో యూనియన్ నాయకులు గోపాల్‌రెడ్డి, బాషా, రవిసింగ్, తేజ, అంజిగౌడ్, సత్తయ్యగౌడ్ తదితర ఆరుగురు యూనియన్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు డిపో ఎదుట కార్మికులు బైఠాయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తాండూరు, కరన్‌కోట్ ఎస్‌ఐలు నాగార్జున, ప్రకాష్‌గౌడ్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
బస్టాండ్‌లో వంటావార్పు..
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తాండూరు బస్టాండ్‌లో కార్మికులు వంటావార్పు నిర్వహించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున వంటావార్పుకు అనుమతి ఇవ్వమని ముందు పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఈ విషయమై నాయకులు అధికారులతో మాట్లాడి అనుమతి తీసుకొని వంటావార్పు నిర్వహించారు.
డ్రైవింగ్ పరీక్షలు..
పరిగి మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ డీటీసీఎం రాజేంద్రప్రసాద్, డీఎం లక్ష్మీధర్మా పలువురు ప్రైవేట్ డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించారు. డిపోలోనే డ్రైవర్లతో బస్సులను నడిపించి, పలువురిని ఎంపిక చేశారు.
తాండూరు ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత
Published Sat, May 9 2015 11:47 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement