ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తం
► అద్దె బస్సులను అడ్డుకున్న కార్మికులు
► రోడ్డుపైన బైఠాయించిన మహిళా కండక్టర్లు
► జేఏసీ కన్వీనర్ అరెస్ట్‌కు యత్నం
► పోలీస్ అధికారులతో వాగ్వాదం
కర్నూలు రాజ్‌విహార్/ నంద్యాలటౌన్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నంద్యాల పట్టణంలో ఉద్రిక్తతకు దారి తీసింది. బస్టాండ్ వద్ద ఆదివారం కార్మికులు అద్దె బస్సులను అడ్డుకున్నారు. యజమానులు ప్రయాణికులను దోచుకుంటున్నారని, రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ కార్మికులు, మహిళా కండక్టర్లు రోడ్డుపైన బైఠాయించి బస్సులు బస్టాండ్‌లోకి వెళ్లనివ్వలేదు. పోలీసులు వీరికి సర్ది చెప్పాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జేఏసీ కన్వీనర్ ఖాన్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులు యత్నించారు.
ఆయనను ఎత్తుకొని జీపు వద్దకు తీసుకెళ్లడానికి ప్రయత్నించగా మహిళా కండక్టర్లు, కార్మికులు ప్రతిఘటించారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఖాన్‌ను వదిలి పెట్టడంతో కార్మికులు శాంతించారు. తర్వాత కార్మికులు గుంపులుగా ఆత్మకూరు, కోవెలకుంట్ల రూట్ల ఫ్లాట్ ఫారాల వద్దకు వెళ్లి తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లను వాహనాలను తిప్పవద్దని హెచ్చరించారు. సీఐలు రామయ్యనాయుడు, ప్రతాపరెడ్డి, ఎస్‌ఐలు రమణ, ప్రీయతంరెడ్డిలతో వాగ్వాదానికి దిగారు. తర్వాత కార్మికులు దీక్షా శిబిరం వద్దకు వెళ్లి ప్రశాంతంగా ఆందోళనను కొనసాగించారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్‌సీ ఇవ్వాలి
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రోడ్డు రవాణ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఆర్‌సీ ఇవ్వాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూధన్ డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ఆదివారం ఐదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా కర్నూలులో ఆయన మాట్లాడుతూ ప్రజా సేవలో ఆర్టీసీ కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని, వీరికి 43శాతం పీఆర్‌సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో నెల రోజుల కిత్రం నోటీసు జారీ చేసినా పట్టించుకోకపోవడం వల్లే ప్రస్తుతం సమ్మె బాట పట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ఈయూ రాష్ట్ర కార్యదర్శులు ఏవీ రెడ్డి, ఖాజా మిన్నల్ల, ఊరుకుందు, రషీద్, రీజినల్ కార్యదర్శి మద్దిలేటి, నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్, జిల్లా కార్యదర్శి మద్దిలేటి, జిల్లా నాయకులు సింగ్, వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవి కుమార్, జిల్లా నాయకులు ఎంబిఎన్ శాస్త్రీ తదితరులు పాల్గొన్నారు.
- ఐదో రోజు రూ.70లక్షలు నష్టం:
సమ్మె కారణంగా జిల్లాలోని 11డిపోల్లో 494 బస్సులు నిలిచిపోయాయి. 970బస్సుల్లో 476 బస్సులు నడపగా ఇందులో ఆర్టీసీ బస్సులు 290, అద్దె బస్సులు 186 ఉన్నాయి. అయినప్పటకీ సంస్థకు రూ.70లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు డిప్యూటి చీఫ్ ట్రాఫిక్ మేనేజరు టివి రామం పేర్కొన్నారు.
మరి కొంత మంది ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులు రెగ్యులర్
రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తూ కొంత కాలంగా డిస్ ఎంగేజ్ పేరుతో విధులకు దూరంగా ఉన్న మరి కొంత మంది కాంట్రాక్టు కండక్టర్లను రెగ్యులర్ చేసినట్లు ఆర్టీసీ కర్నూలు రీజినల్ మేనేజర్ కృష్ణమోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 మంది డ్రైవర్లతోపాటు మరో 14 మంది కాంట్రాక్టు డ్రైవర్లను రెగ్యులర్ చేశామని వెల్లడించారు.