చిన్నారులపై టెట్రాప్యాక్‌ పాల ప్రయోగం | Tetra pack milk experiment on baby Infant home | Sakshi
Sakshi News home page

చిన్నారులపై టెట్రాప్యాక్‌ పాల ప్రయోగం

Published Sat, Nov 11 2017 8:27 AM | Last Updated on Sat, Nov 11 2017 8:27 AM

Tetra pack milk experiment on  baby Infant home - Sakshi

నల్లగొండ : నల్లగొండ శిశుగృహలోని చిన్నారుల మృతుల సంఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. అతితక్కువ బరువు కలిగిన చిన్నారులు శిశుగృహకు వస్తున్నారని, రోగనిరోధక శక్తి లోపించి పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని అధికారులు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నా.. లోతుగా గమనిస్తే అధికారుల తప్పిదం ఎంత ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. శిశుగృహలో గతంలో మృతిచెందిన చిన్నారులకు, ఇటీవల కాలంలో చోటుచేసుకున్న వరుస మరణాలకు మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తే పొరపాటు ఎక్కడ జరిగిందో అవగతమవుతోంది. కానీ ఆ దిశగా అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. 2016 ఏప్రిల్‌ నుంచి 2017 జూలై వరకు శిశుగృహలో మృతిచెందిన చిన్నారులు ఆరుగురు మాత్రమే. ఆ తర్వాత ఆగస్టు, నవంబర్, అక్టోబర్‌ అంటే మూడు నెలల్లోనే 11 మంది మృతి చెందారు. అదికూడా ఒక్క అక్టోబర్‌లోనే ఏడుగురు శిశువులు మృతిచెందడం గమనార్హం. వరుస మరణాలకు గల కారణాలను ఓసారి విశ్లేషిస్తే అధికారుల తప్పిందం ఎక్కడ జరిగిందో బహిర్గతమవుతుంది.

వికటించిన ప్రయోగం
నాలుగైదేళ్ల నుంచి చిన్నారులకు లాక్టోజెన్‌ 1, 2, జీరోలాక్‌ పాల డబ్బాలనే వాడుతున్నారు. ఈ పాల డబ్బాలను నల్లగొండ పట్టణంలోని అపోలో హాస్పిటల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ నుంచి కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు పిల్లలకు అవసరమయ్యే ఇంజక్షన్లు, సబ్బులు, మందులు అపోలో నుంచే తెప్పిస్తున్నారు. అదే క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు శిశుగృహకు పాల డబ్బాలతో పాటు, ఇతర మందులను సప్లయ్‌ చేసేందుకు ఫిబ్రవరిలో టెండర్లు పిలిచారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ టెండర్ల ప్రక్రియలో నాలుగైదు ఏజెన్సీలు పోటీ పడగా.. దీంట్లో అపోలో హాస్పిటల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ని ఎంపిక చేశారు.

 ఫిబ్రవరిలో టెండరు ప్రక్రియ పూర్తికాగా.. మార్చి నుంచి శిశుగృహకు పాల డబ్బాలు, మందులను అపోలో పంపిణీ చేస్తోంది. ఆగస్టు వరకు అక్కడి నుంచే పాల డబ్బాలు కొనుగోలు చేశారు. దీనికిగాను అపోలో ఎంటర్‌ప్రైజెస్‌కు రూ. 4 లక్షలు చెల్లించారు. ఈ విధంగా ఏడాది పాటు సప్లయ్‌ చేయాల్సిన అపోలో ఏజెన్సీ కాంట్రాక్టును అధికారులు అర్ధంతరంగా ఆపేశారు. అపోలో నుంచి పాల డబ్బాలు, మందులను తెప్పించడం మానేసి, అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేస్తున్న ‘విజయ డెయిరీ స్టైల్‌’ పాలను పిల్లలపై ప్రయోగించారు. కొవ్వు, కొలెస్ట్రాల్‌ పాళ్లు తక్కువగా ఉన్న టెట్రా ప్యాకెట్లను సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ వరకు వాడుతూ వచ్చారు. 

తక్కువ బరువు, రోగనిరోధక శక్తి లోపంతో బాధపడుతున్న పిల్లలకు ఈ పాలను వాడడంతో మరింత బరువు తగ్గిపోయారు. దీంతో చిన్నారులు అనారోగ్యానికి గురవుతుండడంతో అప్పటికప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించారు. అప్పటికే చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు హుటాహుటిన హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పిల్లల ఆరోగ్యం క్షీణించడంతో చిన్నారులు అక్కడ మృ త్యువాత పడ్డారు. టెట్రాపాలు వికటించాయన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికా రులు వాటిని వాడడం మానేసి, అక్టోబర్‌ 15 నుంచి డెక్సోలాక్‌ పాల డబ్బాలను వాడుతు న్నారు.

అనాలోచిత నిర్ణయాలు
అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్లే చిన్నారులు మృతిచెందారని వైద్యులు ఆరోపిస్తున్నారు. శిశుగృహ చిన్నారులకు పట్టించే పాల విషయంలో ఐసీడీఎస్‌ అధికారులు వైద్యుల సలహాలు, సూచనలు పాటించలేదని స్పష్టమవుతోంది. కొన్నేళ్లుగా చిన్నారులకు లాక్టోజెన్, జీరోలాక్‌ పాల డబ్బాలనే వాడుతున్నప్పుడు అధికారులు ఉన్న పళంగా టెట్రాప్యాక్‌ పాలను ఎందుకు వినియోగించాల్సి వచ్చిందనే దానిపైన నోరు మెదపడం లేదు. నాసిరకమైన పాలను వాడుతున్నారని వైద్య పరీక్షల్లో తేలినా అధికారులు పట్టించుకోలేదు. కనీసం ఏ రకమైన పాల డబ్బాలను వాడాలనే దానిపైన వైద్యులను సంప్రదించకుండా సొంత నిర్ణయాలనే అమలు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. 

వైద్యుల విషయంలోనూ..
శిశుగృహ చిన్నారులను పరీక్షించేందుకు తొలుత ప్రభుత్వ వైద్యుడు శ్రీకాంత్‌ను విజిటింగ్‌ డాక్టర్‌గా తీసుకున్నారు. వివిధ కారణాల రీత్యా ఆయన్ని కాదని మరో ప్రభుత్వ వైద్యుడు ప్రభాకర్‌రెడ్డిని తీసుకున్నారు. ఆగస్టు వరకు ప్రభాకర్‌రెడ్డి విజిటింగ్‌ డాక్టర్‌గా పనిచేశారు. ఏదో ఒక కారణాన్ని సాకుగా చూపి ప్రభాకర్‌రెడ్డిని కూడా కాదని, ప్రైవేట్‌ వైద్యుడు సుధాకర్‌ను ఆశ్రయించారు. ఆగస్టు నెలాఖరు నుంచి అక్టోబర్‌ 31 వరకు పిల్లలకు ఆయనే వైద్యపరీక్షలు చేశారు. ఈ సమయంలోనే పిల్లలు రోగాల బారినపడ్డట్టు సమాచారం. ఈయన సూచనల మేరకు చాలా మంది పిల్లలను నీలోఫర్‌కు తరలించారు. పిల్లలు మరణించడంతో ఏం చేయాలో పాలుపోని అధికారులు సుధాకర్‌ను కాదని మళ్లీ ప్రభాకర్‌రెడ్డిని తెరపైకి తీసుకొచ్చారు. ఈ నెల 1 నుంచి ఆయనే పిల్లలకు వైద్య చిక్సితలు అందిస్తున్నారు. 

నీలోఫర్‌ ఆస్పత్రికి వెళ్లిన ‘నల్లగొండ’ వైద్యులు
నల్లగొండ : హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శిశుగృహ చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రభుత్వ పిల్లల వైద్యుడు దామెర యాదయ్య, ఐసీడీఎస్‌ పీడీ పుష్పలతను పంపినట్లు కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తెలిపారు. చిన్నారులు అనారోగ్యంగా ఉన్నందున వారిని నీలోఫర్‌కు తరలించడం జరిగిందని చెప్పారు. నీలోఫర్‌ వైద్యులతో మాట్లాడి పిల్లలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని కోరినట్లు కలెక్టర్‌ తెలిపారు. 

నామమాత్రంగా విచారణ
శిశుగృహలో చిన్నారుల వరుస మృతులపై ఉన్నతాధికారులు చేపట్టిన విచారణపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా యంత్రాంగం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వేర్వేరుగా నిర్వహించిన విచారణలో శిశుగృహ రికార్డులను మాత్రమే పరిశీలించారు తప్ప అందులో పనిచేస్తున్న సిబ్బందిని, ఆయాలను, ఇతర ఉద్యోగులను వ్యక్తిగతంగా విచారించలేదు. పిల్లలకు వైద్యం అందించిన డాక్టర్లను సంప్రదించలేదు. తక్కువ బరువుతో పిల్లలు చనిపోతున్నారన్న కారణాలనే పైకి ప్రచారం చేస్తున్నారు. టెట్రా పాల ప్రయోగం పిల్లలపైన జరిగిందా..? లేదా..? అన్నది కూడా విచారించ లేదు. పాల సరఫరా విషయంలో అధికారులు సొంతగా ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది..? అనే కోణంలో విచారణ అధికారులు దృష్టి సారించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement