మూఢనమ్మకాలతో అధికారిక గృహప్రవేశమా
సీఎం కేసీఆర్ తీరుపై సీపీఎం విమర్శ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన అధికారిక గృహ ప్రవేశంలో మతమౌఢ్యాలకు, మూఢనమ్మకాలకు తావిచ్చారని ఆయన తీరును సీపీఎం విమర్శించింది. రాష్ట్రపతి భవన్, చిరాన్ ప్యాలెస్‌లను మరిపించేలా రూ.50 కోట్ల ప్రజాధనాన్ని ఇందుకు దుర్వినియోగం చేయడమూ దారుణమేనంది. ఆయన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుపేదలకు 4 లక్షల డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామన్న సీఎం వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోగా 9 ఎకరాల స్థలంలో నివాసం నిర్మించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. తన అధికార నివాసంలో ఒక మతానికి చెందిన క్రతువులు, యాగాలు చేయడాన్ని వీరభద్రం తప్పుబట్టారు. గవర్నర్ దంపతులు, మంత్రులు ఆయా క్రతువులను పాటించడంతో పాటు, సీఎం కూర్చోవాల్సిన కుర్చీలో ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌స్వామిని కూర్చోబెట్టడం ఆక్షేపణీయమన్నారు.