
‘థర్మల్’ సర్వే బృందానికి చుక్కెదురు
మొదటిరోజే అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు
పురుగుమందు డబ్బాలతో మహిళల ధర్నా
దామరచర్ల: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ శివారులో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన 7,500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ పవర్‌ప్లాంట్ భూసేకరణ సర్వేకు వెళ్లిన అధికారులకు మొదటిరోజే చుక్కెదురైంది. శుక్రవారం మండలానికి వచ్చిన అధికారుల బృందాన్ని తాళ్లవీరప్పగూడెం, మోదుగులకుంట తండా గ్రామస్తులు అడ్డుకున్నారు. మహిళలు పురుగు మందు డబ్బాలతో ధర్నాకు దిగారు. ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్‌ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన భూమిని ఏరియల్ సర్వే చేశారు. అనంతరం మండలంలోని ఏడు గ్రామాల పరిధిలో 9 వేల ఎకరాల్లో ప్లాంట్ నిర్మాణం చేపడుతామని, అందుకు త్వరలో భూసేకరణ జరుగుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాళ్లవీరప్పగూడెం గ్రామ రైతులకు కంటి మీద కునుకులేదు. గ్రామానికి చెందిన పేద రైతులు తుంగపాడు బందం వెంట ఫారెస్ట్, ప్రభుత్వ భూమి సుమారు వెయ్యి ఎకరాల మేర సేద్యం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ప్లాంట్ నిర్మాణంలో భాగంగా ఈ భూములు పోనున్నాయి. మోదుగుకుంటతండా గిరిజనులది కూడా ఇదే పరిస్థితి. దీంతో ఆయా గ్రామాలవాసులు సీఎం ప్రకటన నాటినుంచి కొంత ఆందోళనగా ఉన్నారు. అధికారుల బృందం భూమిని సర్వే చేసేందుకు మొదట తాళ్లవీరప్పగూడానికి చేరుకున్నారు. వారిని గ్రామరైతులు, స్థానికులు అడ్డుకున్నారు. థర్మల్ పవర్‌ప్లాంట్ పేరుతో జీవనాధారమైన భూములను లాక్కుంటే తమ బతుకుదెరువు ఏమిటని పలువురు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలు బజారున పడతాయని వాపోయారు. తమ భూములు తీసుకుంటే చావేగతని పురుగుమందు డబ్బాలు ఎత్తారు. ప్రభుత్వం సమస్య పరిష్కరించేవరకు ఇక్కడినుంచి కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు.
ప్రతి రైతుకు పరిహారం
సర్వేలో ఉన్న మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. విద్యుత్ ప్లాంట్ నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారంతోపాటు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. కేవలం భూమి సర్వే చేసినంత మాత్రాన జరిగే నష్టం ఏమీ ఉండదని నచ్చజెప్పారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించారు.