- రెండు వేల ఎకరాల్లో గ్రీన్‌హౌస్.. రూ. 500 కోట్లు
- రూ. 4,250 కోట్లు రెండో విడత రుణమాఫీకి
- నేడు ఆర్థిక మంత్రితో భేటీ కానున్న పోచారం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో వ్యవసాయశాఖకు రూ. 7,500 కోట్లు కేటాయించాలని వ్యవసాయశాఖ ప్రతిపాదిం చింది. మంగళవారం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌తో జరిగే బడ్జెట్ ముందస్తు సమావేశంలో ఈ మేరకు నివేదికను అందించనుంది. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం తన శాఖలోని అన్ని విభాగాల అధికారులతో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా గత ఏడాది కంటే ప్రతీ విభాగంలో 20 నుంచి 30 శాతం అదనంగా నిధుల అంచనాతో బడ్జెట్ ప్రతిపాదనలను తయారు చేశారు. వ్యవసాయశాఖకు రూ.7,500 కోట్లను కోరనుండగా... అందులో ప్రణాళిక కింద రూ. 2,472 కోట్ల మేరకు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రణాళికేతర బడ్జెట్లో రూ. 4,250 కోట్లను రుణమాఫీ రెండో విడత కోసం కేటాయించనున్నారు. మిగతా సొమ్మును వేతనాలు, ఇతరత్రా ఖర్చులకు వినియోగిస్తారు.
గ్రీన్‌హౌస్‌కు రెండింతలు...
ఈసారి బడ్జెట్‌లో గ్రీన్‌హౌస్, సూక్ష్మసేద్యం, వ్యవసాయ యాంత్రీకరణ, కోల్డ్‌స్టోరేజీలు, రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ యోజన (ఆర్కేవీవై) తదితర పథకాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. సూక్ష్మసేద్యానికి రూ. 800 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు తయారుచేశారు. రెండు వేల ఎకరాల్లో గ్రీన్‌హౌస్ (పాలీహౌస్)ల ఏర్పాటుకు రూ. 500 కోట్లు కేటాయించాలని కోరనున్నారు. ఇక వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 234 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇక విజయ డెయిరీని అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం పాడి రైతులకు లీటరుకు రూ. 4 ప్రోత్సాహకం కింద ఇస్తున్న నేపథ్యంలో... దానిని వచ్చే ఏడాది కూడా కొనసాగించేందుకు రూ. 36 కోట్లు కోరనున్నారు. మొత్తంగా పాత పథకాలే కొనసాగుతాయని, కొత్త పథకాలకు వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టకపోవచ్చని తెలుస్తోంది.
‘గిరిజన’శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15)లో గిరిజన సంక్షేమ శాఖకు బడ్జెట్‌లో కేటాయించిన మొత్తాన్ని ఏ మేరకు ఖర్చుచేశారు, మిగతా నెలన్నర రోజుల్లో ఏ మేరకు ఖర్చు చేయగలరనే అంశంపై సోమవారం శాఖ కార్యదర్శి జీడీ అరుణ సచివాలయంలో సమీక్షించారు. బడ్జెట్‌లో గిరిజన ఉప ప్రణాళిక (సబ్‌ప్లాన్)లో వివిధ శాఖల వారీగా కేటాయించిన మొత్తం రూ. 4.559 కోట్లలో (శాఖకు కేటాయించిన బడ్జెట్ రూ. 1,237 కోట్లు కలిపి) దాదాపు 60 శాతం నిధులు విడుదల కాగా... 30-40 శాతం వరకు వ్యయమైనట్లు తేలింది. మొత్తం రూ.1,237 బడ్జెట్‌లో ఇంజనీరింగ్ విభాగం రూ. 229 కోట్లు బిల్లుల ద్వారా తీసుకోవాల్సి ఉంది. మరో నెలన్నర రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున నిధుల వ్యయం వేగాన్ని పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వచ్చే బడ్జెట్ 2015-16కు సంబంధించి గిరిజన సంక్షేమ శాఖకు రూ. 2 వేల కోట్ల మేర ప్రతిపాదనలు పంపించాలని శాఖాధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. దీనితోపాటు వివిధ శాఖల నుంచి వచ్చే గిరిజన సబ్‌ప్లాన్ నిధులు ఎంతనేది పరిశీలించాల్సి ఉంది.