వ్యవసాయంతో పరిచయమున్న వారెవరికైనా గ్రీన్‌హౌస్ అంటే తెలిసే ఉంటుంది. ఎండావానలు, చీడపీడల నుంచి పంటలను కాపాడుకోవడానికి చేసుకొనే ఓ హైటెక్ ఏర్పాటు. ఒక ఎకరా విస్తీర్ణంలో ఆధునిక గ్రీన్‌హౌస్‌ను ఏర్పాటు చేసుకోవాలంటే... రూ. లక్షలకు లక్షలు ఖర్చు అవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖేతీ అనే స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన కౌశిక్ కప్పగంతుల అత్యంత తక్కువ ఖర్చుతోనే అత్యాధునిక గ్రీన్‌హౌస్‌ను అభివృద్ధి చేశారు.
అంతేకాకుండా ప్రాంతం, వేసే పంటలను బట్టి దిగుబడులు పెంచుకొనేందుకు, అత్యవసర పరిస్థితుల్లో పంటలను కాపాడుకొనేందుకు ఏమేం చేయాలో కూడా రైతులకు నేరి్పంచడం మొదలుపెట్టారు. ఈ మొత్తం వ్యవస్థ పేరే... ‘గ్రీన్‌హౌస్ ఇన్ ఎ బాక్స్’. ఈ వినూత్న ఆవిష్కరణకుగాను బ్రిటన్ యువరాజు చార్లెస్ స్థాపించిన ప్రతిష్టాత్మక ‘ద ఎర్త్ షాట్ ప్రైజ్–2022’ను కౌశిక్ పొందారు.
– సాక్షి, హైదరాబాద్
కావాల్సిన వారికి కావాల్సినంత...
ఖేతీ అభివృద్ధి చేసిన గ్రీన్‌హౌస్‌ను 240 చదరపు మీటర్లు లేదా ఎకరాలో పదహారో వంతు సైజులో ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఒక్కటొక్కటిగా చేర్చుకోనూవచ్చు. ఒక్క గ్రీన్‌హౌస్ ఏర్పాటుకు ప్రస్తుతం రూ. 60 వేల ఖర్చవుతోంది. సాధారణ గ్రీన్‌హౌస్‌తో పోలిస్తే ఇది 90 శాతం తక్కువ.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... రైతులు రోజుకు రెండు గంటలపాటు మాత్రమే పనిచేయడం ద్వారా ఏడాదిలోనే పెట్టుబడితోపాటు కనీసం రూ. 20 వేలు అదనంగా సంపాదించవచ్చు. 240 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పండే పంటకు ఏడు రెట్లు ఎక్కువగా పండటం ఒక కారణమైతే... నీటి వాడకం 95 శాతం వరకూ తక్కువ. అలాగే ఎరువులు, చీడపీడలకు పెట్టే ఖర్చులు కూడా తక్కువ కావడం వల్ల పెట్టిన పెట్టుబడికి మించిన రాబడి ఏడాదిలోనే వస్తుంది!
(చదవండి: ‘చిరు’ధాన్యాల సాగుకు పెద్ద ప్రోత్సాహం)
15 రకాల పంటలు..
ఖేతీ గ్రీన్‌హౌస్‌ల అమ్మకాలు మాత్రమే చేయడం లేదు. ఏ పంట వేస్తే ఎక్కువ లాభాలుంటాయో నిత్యం తెలుసుకొనే ప్రయత్నాల్లో ఉంది. హైదరాబాద్ సమీపంలోని సొంత వ్యయసాయ క్షేత్రంలో ఇప్పటివరకూ 15 రకాల పంటలను విజయవంతంగా పండించింది కూడా. మరిన్ని పంటల సాగుపై పరిశోధనలు జరుగుతున్నాయి.
2017లో కేవలం 15 మంది రైతులతో తెలంగాణలో ఈ టెక్నాలజీ వాడకం మొదలుకాగా... మూడేళ్లలో 500 మంది రైతుల దగ్గరకు చేర్చారు. గతేడాది తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌లలోనూ ‘గ్రీన్‌హౌస్ ఇన్ ఎ బాక్స్’వాడకం మొదలైంది. మొత్తమ్మీద ఇప్పుడు సుమారు 2,500 మంది చిన్న, సన్నకారు రైతులు ఈ టెక్నాలజీని వాడుతున్నారు.
2027కల్లా 50 వేల మంది వాడేలా ప్రయత్నిస్తున్నాం...
2027 నాటికి దేశవ్యాప్తంగా కనీసం 50 వేల మంది రైతులు ‘గ్రీన్‌హౌస్ ఇన్ ఏ బాక్స్’ను వాడేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వాలు చొరవ తీసుకొని రైతులకు వ్యవస్థీకృతమైన పద్ధతిలో రుణ సౌకర్యం కల్పిస్తే వారికి మరింత మేలు జరుగుతుంది. చిన్న, సన్నకారు రైతులు ఎంత ఎక్కువగా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే.. అంత తక్కువ ధరలకు ఈ గ్రీన్‌హౌస్‌లు అందించవచ్చు. సెన్సర్ల వంటి హంగులను కూడా ఈ గ్రీన్‌హౌస్‌లో చేర్చేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నాం.
– కౌశిక్ కప్పగంతుల, ఖేతీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో
Comments
Please login to add a commentAdd a comment