మన డిస్కంలు.. ఓ మోస్తరు!
► డిస్కంల వార్షిక ర్యాంకులను ప్రకటించిన కేంద్రం
► తెలంగాణలోని రెండు డిస్కంలకు ‘బీ ప్లస్’ గ్రేడ్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల వార్షిక ర్యాంకింగ్స్ లో తెలంగాణలోని రెండు డిస్కంలకు ‘బీ ప్లస్ (ఆ+)’ గ్రేడ్లు దక్కాయి. ఓ మోస్తరు పనితీరు ఉన్న డిస్కంలకు ఈ రేటింగ్స్ దక్కా యి. నిర్వహణ, ఆర్థిక పరిస్థితి, నియంత్రణ చర్యలు, సంస్కరణల అమలు తీరును ప్రామాణికంగా తీసుకుని ఏటా కేంద్ర విద్యుత్ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న డిస్కంలకు వార్షిక రేటింగ్స్ కేటాయిస్తోంది.
2017కి ప్రకటించిన ఈ ర్యాంకింగ్స్‌లో గుజరాత్‌లోని 4 డిస్కంలు, ఉత్తరాఖండ్ డిస్కం ‘ఏ ప్లస్ (అ+)’ రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచాయి. ఆ తర్వాత కర్ణాటకలోని మూడు డిస్కంలు, హిమాచల్‌ప్రదేశ్ విద్యుత్ బోర్డు, మహారాష్ట్ర డిస్కంలతోపాటు ఏపీఈపీడీసీ ఎల్ ‘ఏ(అ)’ గ్రేడ్ సాధించాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీ ఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్పీడీసీఎల్) వివిధ రాష్ట్రాలకు చెందిన మరో ఆరు డిస్కంలతో కలసి ‘బీ ప్లస్ (ఆ+)’ గ్రేడ్‌ను సాధించాయి. దేశంలోని మరో పది డిస్కంలు బీ(ఆ) గ్రేడ్‌ను, ఐదు డిస్కంలు సీ ప్లస్ (ఇ+)గ్రేడ్‌ను, ఏడు డిస్కంలు సీ(ఇ) గ్రేడ్‌ను సాధించాయి.
విద్యుత్ కొనుగోలు ధర అధికం
తెలంగాణ డిస్కంల విద్యుత్ కొనుగోలు ధర అధికంగా ఉందని రేటింగ్స్ నివేదికలో కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది. రాష్ట్ర డిస్కంల పనితీరులో ఆందోళనకర అంశాల జాబితాలో విద్యుత్ కొనుగోలు ధరలు అధికంగా ఉండ టాన్ని ప్రస్తావించింది. 2015–16లో టీఎస్ ఎస్పీడీసీఎల్ విద్యుత్ కొనుగోళ్ల కోసం యూనిట్‌కు రూ.4.55 వెచ్చించగా, టీఎస్ ఎన్పీడీసీఎల్ రూ.4.82 ఖర్చు చేసిందని వెల్లడించింది.
2017–18కి సంబంధించిన టారిఫ్ పిటిషన్‌ను రెండు డిస్కంలూ సకాలంలో ఈఆర్సీకి సమర్పించలేదంది. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో విద్యుత్ బిల్లుల వసూళ్ల సమర్థత తగ్గిపోయిందని, నష్టాలు 13.38 శాతానికి పెరిగిపోయాయంది. టీఎస్‌ఎన్పీ డీసీఎల్ పరిధిలో వినియోగదారుల మీటరిం గ్ తక్కువగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. 2014–15తో పోల్చితే 2015–16లో మీటరింగ్ పెంపుదలలో మార్పు లేదంది.
మన డిస్కంల బలాలివీ...
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో టారిఫ్ సబ్సిడీ విడుదల చేయడంతోపాటు 2016–17కి సం బంధించిన టారిఫ్ ఆర్డర్‌ను జారీ చేయడాన్ని డిస్కంల ప్రధాన బలాలుగా రేటింగ్‌ల నివే దిక పేర్కొంది. టీఎస్‌ఎస్పీడీసీఎల్ 88.50 శాతం బిల్లింగ్ సాధించడంపై సంతృప్తి వ్యక్తం చేసింది. టీఎస్‌ఎన్పీడీసీఎల్ 2014–15లో 16.04 శాతం ఉన్న నష్టాలను 2015–16లో 15.79 శాతానికి తగ్గించుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేసింది.
గ్రేడ్ల కేటాయింపు తీరు ఇదీ...
ప్రముఖ రేటింగ్స్ నిర్వహణ సంస్థలు కేర్, ఇక్రా ఆధ్వర్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ డిస్కంల వార్షిక రేటింగ్స్ నిర్వహిం చింది. వివిధ అంశాల్లో డిస్కంల పనితీరు, నిర్వహణ సామర్థ్యం ఆధారంగా రేటింగ్స్ స్కోర్లను కేటాయించి గ్రేడ్లను ఈ సంస్థలు ఖరారు చేశాయి. 80–100 స్కోర్ సాధిస్తే (అత్యుత్తమ పనితీరు) ‘ఏ ప్లస్’, 65–80 స్కోర్‌కు (ఉత్తమ పనితీరు) ‘ఏ’ గ్రేడ్, 50–65 స్కోర్ సాధించిన డిస్కం (ఓ మోస్తరు పనితీరు)లకు బీ ప్లస్ గ్రేడ్, 35–50 స్కోర్ సాధిస్తే (సగటు కంటే తక్కువ పనితీరు) బీ గ్రేడ్, 20–35 స్కోర్ సాధిస్తే (అథమ పనితీరు) ‘సీ ప్లస్’ గ్రేడ్, 0–20 స్కోర్ సాధిస్తే (పనితీరు అత్యంత అథమం) ‘సీ’ గ్రేడ్‌ను కేటాయించారు.