18న జిల్లాకు టీపీసీసీ చీఫ్ రాక | The arrival of the tpcc chief of the district on 18th june | Sakshi
Sakshi News home page

18న జిల్లాకు టీపీసీసీ చీఫ్ రాక

Published Sun, Jun 15 2014 3:03 AM | Last Updated on Sat, Aug 11 2018 7:11 PM

18న జిల్లాకు టీపీసీసీ చీఫ్ రాక - Sakshi

18న జిల్లాకు టీపీసీసీ చీఫ్ రాక

- సార్వత్రిక ఫలితాలపై నేతలతో సమీక్ష
- భవిష్యత్ కార్యాచరణపై కేడర్‌తో చర్చ
- ఓటమికి కారణాలపై విశ్లేషణ

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఈనెల 18న జిల్లాకు రానున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో జిల్లాకు రెండు సార్లు వచ్చారు. అంతకు ముందు భారీ నీటి పారుదలశాఖ మంత్రిగా జిల్లాలో పర్యటించినా.. టీపీసీసీ అధ్యక్షునిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పొన్నాల లక్ష్మయ్య మరోమారు జిల్లాకు వస్తున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు డి.శ్రీనివాస్, పి.సుదర్శన్‌రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, కేఆర్ సురేశ్‌రెడ్డి తదితరులకు సమాచారం అందించిన పిదప జిల్లా పర్యటనకు సిద్ధమైనట్లు తెలిసింది.

సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని విధంగా దెబ్బ తగిలింది. రెండు పార్లమెంట్, 9 అసెంబ్లీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోగా, కాంగ్రెస్  రెండో లేదా మూడో స్థానంలో నిలిచింది. ఘోరపరాజయంపై తెలంగాణ జిల్లాల్లో ‘పోస్టుమార్టం’ నిర్వహిస్తున్న పొన్నాల లక్ష్మయ్య.. జిల్లాలోనూ పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించనున్నారు. ఈ మేరకు సీనియర్ నేతలతో పాటు ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలతో కూడా మాట్లాడి అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఓటమిపై సమీక్షతో పాటు భవిష్యత్ కార్యాచరణను ఆయన పార్టీ శ్రేణులకు వివరించి కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపనున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement