అందమా...అందుమా!
- నగరంలో కాస్మొటిక్ సర్జరీలపై పెరుగుతున్న మోజు
- సొట్టబుగ్గలు, నడుము, ఛాతి సర్జరీలపై అమ్మాయిల ఆసక్తి
- ముక్కు, బట్టతల, పొట్టను సరి చేసుకుంటున్న అబ్బాయిలు
అందమంటే అమ్మాయిల సొంతం... ఒకప్పుడు ఈ మాట వింటే అబ్బాయిలు ‘నిజమే’నంటూ మెచ్చుకునేవారు. ఇప్పుడు ఈ రేసులో వారూ ముందుకు వస్తున్నారు. అందమా..అందుమా.. అంటూ తమ శరీరాకృతికి మెరుగులు దిద్దుకుంటున్నారు. మేని మెరుపులు పెంచుకునే క్రమంలో స్త్రీలు, పురుషులు పోటీ పడుతున్నారు. ఎవరికి తోచిన మార్గాల్లో వారు వెళుతున్నా... గమ్యం మాత్రం అందమే. వీరి మనసులో మాటను తెలుసుకొని... ‘మిమ్మల్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు మేమున్నామ’ంటూ అధునాతన చికిత్సలతో ముందుకొస్తున్నారు వైద్య నిపుణులు. వినూత్న పద్ధతుల్లో..విభిన్న రీతుల్లో సొబగులద్దుతున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: ఎదుటి వారిని ఆకర్షించడంలో కళ్లు, ముక్కు, పెదవులు, సొట్ట బుగ్గలు, ఛాతి, నడుములది కీలక పాత్ర. వీటిలో ఏ ఒక్కటి సరిగా లేకున్నా మనలో ఏదో తెలియని అసంతృప్తి. ఎంత ఐశ్యర్యవంతులైనా కంటికి అందంగా కనిపించకపోతే చెప్పలేని వెలితి. అందానికి ఉన్న స్థానమది. అందంగా లేనివారు... శారీరకంగా లోపాలు ఉన్న వారు ఒకప్పుడైతే ‘దేవుడిచ్చిన శరీర భాగాలను మనమేం చేయగలంలే’ అని సరిపెట్టుకునే వారు. మరి ఇప్పుడో... ఏదో ఒకటి చేసి... అందంగా కనిపించాల్సిందే అనుకుంటున్నారు.
అందాలకు మెరుగులు దిద్దే మార్గాలను వెదుక్కుంటూ వెళుతున్నారు. ఇలాంటి వారికి కాస్మొటిక్ సర్జరీలు వరంగా మారుతున్నాయి. ఒకప్పుడు సెలబ్రిటీలకు మాత్రమే పరిమితమైన ఈ తరహా చికిత్సల వైపు ప్రస్తుతం మధ్య తరగతి వారూ చూస్తున్నారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఈస్థెటిక్ ప్లాస్టిక్ సర్జరీ సర్వే ప్రకారం కాస్మొటిక్ సర్జరీల్లో మన దేశానిది నాలుగో స్థానం. అందాలకు మెరుగులు దిద్దుకోవాలని గత ఏడాది శస్త్రచికిత్సలకు క్యూ కట్టిన వారి సంఖ్య 8,94,700గా గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 20-25 శాతం మంది గ్రేటర్ వాసులే ఉండటం గమనార్హం.
కోటేరు లాంటి ముక్కు కోసం
ముఖం అందాన్ని నిర్ణయించేది ముక్కు. అందుకే ఏమాత్రం తేడా ఉన్నా.. చాలా మంది అమ్మాయిలు...అందులోనూ పెళ్లి కావాల్సిన వారు రైనోప్లాస్టీ సర్జరీని ఆశ్రయిస్తున్నారు. ఈ సర్జరీ చేసుకుంటున్న వారిలో 70 శాతం అమ్మాయిలు, 30 శాతం అబ్బాయిలు ఉంటున్నారు. ఇలా సర్జరీ చేయించుకునే వ్యక్తి శరీరంలోని ఏదో ఒక భాగం నుంచి కణజాలాన్ని సేకరిస్తారు. ఒక వేళ ఆ కణజాలం అతనికి సరిపోకపోతే రక్త సంబంధీకుల నుంచి సేకరించి, అమర్చుతున్నట్లు కేర్ ఆస్పత్రిలోని ఈఎన్‌టీ, కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి చెప్పారు.
నాజుకైన నడుముకు...
శరీరంలో ఉండాల్సిన బరువు కన్నా 20 శాతం ఎక్కువ ఉంటే ‘అధిక బరువుగా’ భావిస్తారు. మధ్య తరగతి మగవాళ్లలో మూడో వంతు, ఆడవాళ్లలో సగానికిపైగా అధిక బరువుతో బాధ పడుతున్నట్లు అంచనా. ఓ సర్వే ప్రకారం 2005లో నగరంలో ఈ సంఖ్య ఐదు శాతం ఉంటే.. ప్రస్తుతం 10 శాతానికి చేరుకుంది. శరీరంలోనికొవ్వును‘లైపోసక్షన్, బెరియాట్రిక్’ పద్ధతుల్లో తొ ల గిస్తారు. సినీ తారలు ఎక్కువగా లైపోసక్షన్‌ను ఆశ్రయిస్తుంటే... మధ్య తరగతి వారు ల్యాప్రోస్కోపిక్ విధానం లో చేసే బెరియాట్రిక్ సర్జరీలను ఎంచుకుంటున్నట్లు లివ్‌లైఫ్ ఆస్పత్రి బె రియాట్రిక్ సర్జన్ డాక్టర్ నందకిషోర్ చెప్పారు.
బట్టతలను వదిలించుకోవడానికి...
వివిధ కారణాలతో కుర్రాళ్లకు పాతికేళ్లకే తలపై జుట్టంతా ఊడిపోతోంది. పెళ్లికి ముందే ఈ పరిస్థితి ఎదురు కావడంతో అమ్మాయిలు ఇలాంటి వారిని నిరాకరిస్తున్నారు. దీంతో చాలా మంది అబ్బాయిలు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఇందు కోసం రూ.లక్ష ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదని కాస్మొటిక్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ వెంకటరమణ చెప్పారు.
విదేశాలకు పరుగెత్తాల్సిన అవసరం లేదు:
డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి, ప్లాస్టిక్ సర్జన్
కాస్మొటిక్ సర్జరీ అనగానే ఖరీదైన వ్యవహారం అనుకుంటారు. తక్కువ ఖర్చుతో లోపాలను సరిచేసుకునే అవకాశం ఉంది. విదేశాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లోని యువత సైతం ఇటీవల ఇక్కడికే వస్తున్నారు. నిపుణులు అందుబాటు లో ఉండటం, ఖర్చు తక్కువ ఉండటమే కారణం.
అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది:
డాక్టర్ మురళీ మోహన్‌రెడ్డి, కాస్మొటిక్ సర్జన్, యశోద ఆస్పత్రి
అందం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రస్తుత తరంఈ విషయాన్ని తొందరగా గ్రహించారు. నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అం దాలకు మెరుగుదిద్దుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మచ్చుకు కొన్ని ప్లాస్టిక్ సర్జరీలు..
రైనోప్లాస్టీ: అందమైన నాసిక కావాలనుకునే వారి చాయిస్. చప్పిడి ముక్కు, వంకరలు తిరిగిన ముక్కును సరి చేయవచ్చు.
బొటాక్స్: ముఖంపై ముడుతలు పోవడానికి చక్కని పరిష్కారం. 30 దాటిన వారు బొటాక్స్ కోసం పరుగులు తీస్తున్నారు.
లైపొసక్షన్: పొట్ట, నడుము భాగాల్లోని కొవ్వును కరిగించే శస్త్రచికిత్స.
డింపుల్స్ క్రియేషన్స్ సర్జరీ: నవ్వినప్పుడు బుగ్గలపై సొట్టపడేలా చేస్తారు.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్: బట్టతలపై జుట్టు మొలిపిస్తారు.
చీక్ అగ్మంటేషన్: ఆకట్టుకునే ముఖాకృతి కోసం చేసే సర్జరీ.
గైనకో మాస్టియా: అమ్మాయిల్లా పెరిగిపోయిన మ్యాన్‌బూబ్స్ తొలగించే శస్త్రచికిత్స.
టమ్మీటక్: పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. సిక్స్‌ప్యాక్‌లకు దారి చూపుతుంది.
బ్లైఫరోప్లాస్టీ: నాజుకైన కంటిరెప్పల కేరాఫ్ అడ్రస్ ఇది.
కాస్మొటిక్ సర్జరీలుచేయించుకుంటున్న వారు...
యువతులు- 70 శాతం
యువకులు- 30 శాతం
25 ఏళ్ల లోపు వారు- 50 శాతం
35 ఏళ్లలోపు వారు- 30 శాతం
ఆపై వయసు వారు- 20 శాతం
గ్రేటర్‌లో ప్రతి నెలా జరుగుతున్న కాస్మొటిక్ సర్జరీలు
కాస్మొటిక్ సర్జరీలు- 100
రైనో ప్లాస్టీ- 40-50
మేల్‌బ్రెస్ట్ సర్జరీస్- 60
లైపొసక్షన్- 150
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్-100