ఇంత ఘోర పరాభవమా?
ఓటమికి కారణాలను విశ్లేషిస్తున్న కాంగ్రెస్ పెద్దలు
గ్రేటర్ నేతలతో పొన్నాల భేటీ
అంతకుముందు జానారెడ్డితో కలిసి జైపాల్ నివాసంలో మంతనాలు
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదురుకావడా న్ని కాంగ్రెస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌కు ఇంత దారుణ ఫలితాలెలా వచ్చాయని తలపట్టుకుంటున్నారు. దీనిపై సమీక్షలు కూడా ప్రారంభించారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శనివారం పార్టీ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మల్లు రవి తదితరులు భేటీలో పాల్గొన్నారు. తెలంగాణలో ఇంత దారుణమైన ఫలితాలు వస్తాయని అంచనా వేయలేకపోయామని వారు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచాయని, తెలంగాణలోనూ అదే కొనసాగిందనే భావన వ్యక్తమైంది. సోనియా తెలంగాణ ఇచ్చినా ఈ అంశాన్ని సరైన రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామనే అంచనాకు వచ్చినట్లు తెలిసిం ది. మొత్తంగా తెలంగాణలో పార్టీ ఓటమిపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా సోమవారం నుంచి ఎన్నికల ఫలితాలపై జిల్లాల వారీ సమీక్ష చేయాలని పొన్నాల నిర్ణయించారు. అదే సమయంలో సీఎల్పీ సమావేశం, ప్రతిపక్ష నేత ఎన్నిక వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. హైకమాండ్ పెద్దలతో మాట్లాడిన తరువాత సీఎల్పీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అనంతరం జానారెడ్డి నివాసంలోనూ టీ కాంగ్రెస్ నేతలు సమావేశమై తెలంగాణలో బలహీనపడిన పార్టీని ఏ విధంగా పునరుత్తేజితం చేయాలనే అంశంపైనా చర్చించినట్లు తెలిసింది.
విభజనే కొంపముంచింది!: మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ నేతలతో సమావేశమయ్యారు. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ సహా పలువురు నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో జిల్లాలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాకపోవడానికి గల కారణాలను విశ్లేషించారు. తెలంగాణ, సీమాంధ్రతో పాటు అన్ని ప్రాంతాల వారూ నివాసం ఉంటున్న హైదరాబాద్‌లో విభజన అంశమే కొంపముంచిందని దానం వాపోయినట్లు తెలిసింది.