అడ్డుగా ఉన్నాడనే అంతం | The body fell on the road after heard patroling sound | Sakshi
Sakshi News home page

అడ్డుగా ఉన్నాడనే అంతం

Published Fri, Jun 13 2014 11:47 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

అడ్డుగా ఉన్నాడనే అంతం - Sakshi

అడ్డుగా ఉన్నాడనే అంతం

  • వీడిన టైలర్ హత్య కేసు మిస్టరీ
  • ప్రియుడితో కలిసి చంపించిన భార్య  
  • నిందితులకు రిమాండు
  • శంషాబాద్: పట్టణంలో కలకలం సృష్టించిన టైలర్ హత్య కేసు మిస్టరీ వీడింది..  తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్యే ప్రియుడితో కలిసి భర్తను చంపించింది. పోలీసులు శుక్రవారం నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. శంషాబాద్ ఏసీపీ సుదర్శన్ విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. శంషాబాద్ మాజీ ఎంపీపీ తోట లచ్చయ్య కుమారుడు శ్రీశైలం స్థానికంగా టైలర్‌గా పనిచేస్తూ మధురానగర్‌కాలనీలోని సొంతింట్లో ఉంటున్నాడు.
     
    మహేశ్వరం మండలం సరస్వతీగూడకు చెందిన సరితను ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లికి ముందే సరితకు స్వగ్రామానికి చెందిన సందీప్‌తో వివాహేతర సంబంధం ఉంది. వివాహానంతరం కూడా సరిత భర్తకు మత్తుమందు ఇచ్చి ఇంట్లోనే తన సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. తమ ‘బంధా’నికి అడ్డుగా ఉన్న శ్రీశైలాన్ని అంతం చేయాలని సరిత, సందీప్ పథకం వేశారు. ఈక్రమంలో సందీప్ తన స్నేహితులైన సరస్వతీగూడ, లేమూరు గ్రామాలకు చెందిన జంగయ్య, బాల్‌రాజ్, యాదగిరిలతో విషయం చెప్పాడు. శ్రీశైలం హత్యకు సహకరిస్తే  రూ. 50 వేలతో పాటు ఓ ప్లాటు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఈక్రమంలో గత మే 26న అర్ధరాత్రి సందీప్‌తో పాటు అతడి మగ్గురు స్నేహితులు ఇండికా కారులో శంషాబాద్‌లోని శ్రీశైలం ఇంటికి వచ్చారు. యాదగిరి గేటు వద్ద కాపలా ఉండగా మిగతా వారు ఇంట్లోకి వెళ్లారు.
     
    తమతో తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో నిద్రిస్తున్న శ్రీశైలం తలపై మోదారు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన అతడిని కారులో వేసుకొని శంషాబాద్ మండలంలోని బూర్జుగడ్డ వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. శ్రీశైలం మృతి చెందే వరకు అక్కడ రాడ్డుతో అతడి తలపై విచక్షణారహితంగా బాదారు. మృతిచెందాడని నిర్ధారించుకున్న వారు తిరిగి మధురానగర్‌లోని శ్రీశైలం ఇంటికి వెళ్లారు. సందీప్ సరిత వద్ద నుంచి రూ. 2500 తీసుకొని ఇంట్లో రక్తపు మరకలను తుడిచిన దుస్తులను కారులో వేసుకుని రాళ్లగూడ రహదారివైపు వెళ్లారు. శ్రీైశె లం ఇంటి వద్ద ఉన్న అతడి బైక్‌ను బాల్‌రాజ్ తీసుకుని రాళ్లగూడ ఔటర్ సర్వీసు రోడ్డువైపు కారు వెంబడి వెళ్లాడు.
     
    రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నిస్తుండగా పెట్రోలింగ్ శబ్దాన్ని విని మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు. అక్కడి నుంచి యాదగిరిగుట్టకు వెళ్లిపోయారు. మార్గమధ్యంలో ఉప్పల్ సమీపంలో ఇనుపరాడ్డుతో పాటు రక్తపు మరకలున్న దుస్తులను పడేశారు. మృతదేహం పక్కనే బైకు పడేద్దామనుకున్న బాల్‌రాజ్ భయపడి స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందున్న ఖాళీ స్థలంలో పెట్టి సరస్వతీగూడకు వెళ్లిపోయాడు. తీవ్ర భయాందోళ నకు గురైన బాల్‌రాజ్ స్థానిక పెద్దమనుషులకు విషయం చెప్పాడు.
     
    మరుసటి రోజు స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మొదట రాజకీయ లేదా ఆర్థిక కారణాలే హత్యకు దారి తీసి ఉండొచ్చని అనుమానించారు. అనంతరం శ్రీశైలం భార్య సరిత తీరు అనుమానాస్పదంగా ఉండడంతో ఆ దిశగా విచారణ జరిపారు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసిందని నిర్ధారించుకున్నారు. తొలుత బాల్‌రాజ్‌తో పాటు సరితను అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం సందీప్, జంగయ్య, యాదగిరిలను అరెస్ట్ చేశారు. సరితతో పాటు మిగతా నలుగురిని శుక్రవారం రిమాండుకు తరలించారు. కేసు ఛేదించిన సిబ్బందిని ఏసీపీ ఈ సందర్భంగా ప్రశంసించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement