నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన జరిగిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఎనిమిది అంతరాష్ట్ర సరిహద్దులను నిర్ణయించారు. వాటిలో మూడు సరిహద్దులు జిల్లాలోనే ఉన్నాయి. పెద్దవూర మండలం నాగార్జునసాగర్ వంతెన సమీపంలో, దామరచర్ల మండలం వాడపల్లి వంతెన, కోదాడ మండలం దోరకుంట గ్రామ శివారు ప్రాంతాలను నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 21న రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు జిల్లా రవాణాశాఖ సమాయత్తమవుతోంది.
వాహనాల రద్దీపై సమాచార సేకరణ
మార్చి 16, 17వ తేదీల్లో సీమాంధ్ర, తెలంగాణ రవాణాశాఖ అధికారులు ఆయా రోడ్లలో ఎక్కడినుంచి ఎక్కడికి ఎన్ని వాహనాలు వెళ్తున్నాయో లెక్కలు కూడా తీశారు. మాచర్ల-నాగార్జునసాగర్‌కు మధ్యన రోజుకు 800 వాహనాలు తిరుగుతున్నట్టు అంచనా వేశారు. దామరచర్ల మండలం విష్ణుపురం-పొందుగుల మధ్య ఒంగోలు వెళ్లే జాతీయ రహదారి కావడంతో నిత్యం 8వేల వాహనాలు తిరుగుతున్నట్లు లెక్క వేశారు.
ఎక్కువ వాహనాలు తిరుగుతున్న ప్రాంతంలో సిబ్బందిని అధిక సంఖ్యలో నియమించనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ -ఇతర రాష్ట్రాల మధ్య వాహనాలు, తదితర తనిఖీలు ఎలా కొనసాగుతున్నాయో అదేవిధంగా వచ్చే నెలలో జిల్లా బార్డర్‌లోని అంతరాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద కొనసాగుతాయి. గతంలో ధాన్యం విక్రయించే సీజన్‌లలోనే వ్యవసాయ మార్కెట్ వారు తాత్కాలికంగా చెక్‌పోస్టులు ఏర్పాటుచేసేవారు. ఇప్పుడలా కాకుండా అంతరాష్ట్ర చెక్‌పోస్ట్టుల వద్ద అన్ని రకాల తనిఖీలు నిర్వహిస్తారు.
సిబ్బంది నియామకం ఇలా..
వాహనాల తనిఖీ కోసం మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, రవాణాశాఖ కానిస్టేబుళ్లు, హోంగార్డులు తదితర సిబ్బందిని ఈ చెక్‌పోస్టుల్లో నియమిస్తారు. వీరు మోటార్ వెహికిల్ ట్యాక్స్ చెల్లింపు, పర్మిట్ల గడువు, వాహనాల ఫిట్‌నెస్, లెసైన్సులు తనిఖీ చేస్తారు. అదే విధంగా ఆర్టీసీ బస్సులతోపాటు ప్రతి ప్రైవేటు బస్సునూ చెక్ చేయనున్నారు. వాటిలో లోపాలు గుర్తిస్తే తదనుగుణంగా చర్యలు తీసుకుంటారు. ఒక్కో చెక్‌పోస్టు వద్ద వాహనాల రాకపోకలననుసరించి 11మంది పైచిలుకు సిబ్బందిని ఏర్పాటుచేయనున్నారు.
అక్రమ వ్యాపారాలకు చెక్
అమరావతి నుంచి హైదరాబాద్‌కు, హాలియా, మూసీ తదితర వాగుల నుంచి మాచర్ల, గుంటూరు ప్రాంతాలకు ఇసుక అక్రమంగా రవాణా అవుతుంటుంది. అంతరాష్ట్ర చెక్‌పోస్టుల ఏర్పాటుతో ఈ అక్రమ వ్యాపారానికి చెక్‌పడనుంది. భవన నిర్మాణాల్లో ప్లాస్టరింగ్ కోసం అమరావతి ఇసుకను వాడతారు. హాలియా, మూసీ వాగుల నుంచి ఇసుక తక్కువ ధరకు వస్తుండడంతో రోజూ లారీల్లో తరలిస్తుంటారు.అలాగే పల్నాడునుంచి మిర్యాలగూడ, హాలియా మిల్లులకు రేషన్‌బియ్యం నిత్యం సరఫరా అవుతుంటాయి. వాటికి కొంతమేరకు చెక్‌పడనున్నది.
రైతులకు కష్టం..
ఇప్పటి వరకు సీజన్‌లలో ఆయా మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసేవారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు తమ ధాన్యాన్ని హలియా, మిర్యాలగూడలకు పాసుపుస్తకాలు చూయించి తీసుకువచ్చేవారు. ఆయా ప్రాంతాల్లోని మిల్లుల్లో విక్రయించి వెళ్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. అలాగే నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, చింతపల్లి తదితర ప్రాంతాలలో పండించిన పప్పుధాన్యం కందులు, పెసర్లు, మినుములను మాచర్ల దాల్‌మిల్లులకు తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఎటు వెళ్లాలన్నా చెక్‌పోస్టులు దాటాల్సిందే.
సరిహద్దు కూలీల పరిస్థితి అంతే..
వ్యవసాయ సీజన్‌లో వరికోతలు, పత్తి తీయడం తదితర పనులకు మాచర్ల మండలం నుంచి కూలీలు ఆటోలలో పెద్దవూర, హాలియా మండలాలకు వస్తారు. ప్రస్తుతం పెద్దవూర పత్తిమిల్లులో పనిచేసే కూలీలు సహితం మాచర్ల ప్రాంతం నుంచి ప్రత్యేక వాహనంలో వస్తున్నారు. అలాగే నల్లగొండ శివారు తండాలు, గ్రామాలనుంచి కూలీలు మిరపకాయలు ఏరే సమయంలో ఆటోలలో గుంటూరు జిల్లాలోని పలుగ్రామాలకు వెళ్తుంటారు. చెక్‌పోస్టులు ఏర్పాటైతే ఆటోలు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లే వీలుండదు. కచ్చితంగా పర్మిట్ పన్ను కట్టాల్సి ఉంటుంది.
ఐదు కిలోమీటర్లకే వాహన పన్ను
హిల్‌కాలనీ, పైలాన్‌నుంచి రైట్‌బ్యాంకుకు పనుల నిమిత్తం వెళ్లే వారికోసం ప్రస్తుతం ఆటోలు తిరుగుతున్నాయి. ఇక వచ్చే నెలలో పర్మిట్ పన్ను చెల్లించనిదే ఆటోలను అటూఇటూ తిరగనివ్వరు. వీటి మధ్య ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దూరం కోసం అదనంగా పన్ను చెల్లించక తప్పదేమో?. అలాగే హిల్‌కాలనీ సంఘమిత్ర నుంచే గుంటూరు జిల్లాలోని రైటు బ్యాంకు ఉద్యోగులకు వంట గ్యాస్ సరఫరా చేస్తారు. ఇక వచ్చే నెలలో గ్యాస్‌ను మరో రాష్ట్రంలోకి అనుమతిస్తారా? అనుమతిస్తే వాహనాలకు కట్టే పర్మిట్ పన్ను గ్యాస్ వినియోగదారులపై అదనపు భారం కానున్నది.
జిల్లాలో అంతరాష్ట్ర సరిహద్దులు మూడు
Published Sun, May 25 2014 2:42 AM | Last Updated on Fri, Oct 19 2018 7:33 PM
Advertisement
Advertisement