గ్యాస్ లీకైన ఘటనలో ముగ్గురి మృతికి కారణం
కంపెనీని తనిఖీ చేసిన పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ అధికారులు
మరొకరి పరిస్థితి విషమం
కంపెనీ ఎదుట ధర్నా, భారీ బందోబస్తు
చౌటుప్పల్ : మండలంలోని మల్కాపురం శివారులోని శ్రీజయ లాబోరేటరీస్ కంపెనీలో క్లోరోఫామ్ గ్యాస్ లీకై ముగ్గురు మృతికి కారణమైనందున కంపెనీ యాజమాన్యంపై పోలీసులు కేసునమోదు చేశారు. సాయంత్రం 5గంటలకే ప్రమాదం జరిగి, ముగ్గురు మృతిచెందినప్పటికీ, రాత్రి 10గంటల వరకు కూడా మృతిచెందిన విషయాన్ని బయటికి పొక్కకుండా కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచడాన్ని నిరసిస్తూ, బుధవారం ఉదయం మల్కాపురం గ్రామస్తులు, సీఐటీయూ నాయకులు కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు.
కంపెనీకి తనిఖీల కోసం వచ్చిన పరిశ్రమల శాఖ అధికారులను అడ్డుకోవడంతో, చౌటుప్పల్ ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో నలుగురిని పోలీ సులు అదుపులోకి తీసుకుని, భూదాన్ పోచంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చిన్నకుల్లెడ గ్రామానికి చెందిన ఎ.రాజశేఖర్(24) మృతిచెం దినప్పటికీ, ఇతని పేరు బయటికి రాలేదు. ఒరిస్సాకు చెందిన మారుతి అనే వ్యక్తి చనిపోయినట్టు చెప్పారు. దీంతో పోలీసులు ఈయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
పోలీస్ ఇన్‌స్పెక్టర్ భూపతి గట్టుమల్లు బుధవారం ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లారు. మృతదేహాలను పరిశీలించారు. పరిశ్రమల శాఖ రాష్ట్ర డెరైక్టర్ కిషన్, జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ కేశవులు, శ్రీదేవి, డిప్యూటీ లేబర్ కమీషనర్ కె.భాగ్యానాయక్‌లు కంపెనీని సందర్శించారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా,ఎస్‌ఐ మల్లీశ్వరి ఆధ్వర్యంలో కంపెనీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కె.శ్రీని వాసరాజు(33), పి.వెంకట్రాజు(50), కె.చంద్రశేఖర్(34), టి.సత్యనారాయణ(30), రాజుమెహ్ర(22)ల ఆరోగ్యం నిల కడగానే ఉంది. రామారావు(25) పరిస్థితి విషమంగా ఉంది. ఈయన సన్‌రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతుల కుటుంబాలకు నష్టపరిహారం..
కంపెనీలో సంపును శుభ్రం చేయిస్తుండగా, క్లోరోఫామ్ గ్యాస్ లీకై 9మంది అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వారు అక్కడ చనిపోయినప్పటికీ, కంపెనీ యాజమాన్యం పోలీసులకు కూడా సమాచారమివ్వకుండా గోప్యంగా ఉంచింది. బుధవారం మృతుల కుటుంబాలను పిలిచి నష్టపరిహారం చెల్లించింది. రాజశేఖర్ కుటుంబానికి రూ.10లక్షలు, మిగతా ఇద్దరి కుటుంబాలకు రూ.8లక్షల చొప్పున పరిహారం చెల్లించినట్టు తెలిసింది.
కంపెనీ యాజమాన్యంపై కేసు
Published Wed, Jun 10 2015 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 3:31 AM
Advertisement
Advertisement