టీ సర్కారుది కోర్టు ధిక్కారమే
హుస్సేన్ సాగర్ ప్రక్షాళనపై ‘సోల్’ మండిపాటు
హైదరాబాద్: హుస్సేన్ సాగర్ ప్రక్షాళన విషయంలో తెలంగాణ సర్కార్ కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే కాకుండా ఒక ప్రణాళికాయుత విధానం, శాస్త్రీయత లేకుండా వ్యవహరిస్తోందని ‘సేవ్ అవర్ అర్బన్ లేక్స్’ (సోల్) సంస్థ ప్రతినిధులు ఆరోపించారు. దీనిపై మరోసారి కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంస్థ కోకన్వీనర్ లుబ్నా సర్వత్ ఇతర సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సాగర్ ప్రక్షాళనపై తమకు పూర్తి వివరాలు కావాలని హక్కుల చట్టం ఆధారంగా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, టీపీసీబీలను కోరితే ఆ సంస్థలు తమ వద్ద ఏ సమాచారం లేదని సమాధానం ఇచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ (సదరన్ జోన్)లో పిటిషన్ వేశామన్నారు. సాగర్‌ను ఖాళీ చేయించే విషయమై ప్రభుత్వం ప్రాజెక్టు నివేదిక లేకుండా, ప్రజలతో సంప్రదింపులు జరపకుండా చర్యలకు ఉపక్రమించ డం తగదని వాదించామన్నారు.
తీవ్రంగా కలుషితమైన సాగర్ జలాలను, ప్రమాదకర వ్యర్థాలను నేరుగా మూసీలోకి వదలడం వల్ల ఆ నీటిలోని జీవరాశులు చనిపోతాయని పిటిషన్‌లో పేర్కొన్నామన్నారు. దీంతో సాగర్ ఖాళీచేసే పనులను నిలిపేయాలని ట్రిబ్యునల్ ప్రభుత్వానికి, సంబంధిత సంస్థలకు ఆదేశించినట్లు సర్వత్ వెల్లడించారు. అలాగే ఈ నెల 22 లోపు సాగర్ యాక్షన్‌ప్లాన్‌ను ప్రభుత్వం తమకు అందించాలని ఆదేశించిందన్నారు. ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం ప్రభుత్వం బేఖాతరు చేస్తూ నీటిని మళ్లిస్తోందని ఇది కోర్టుధిక్కారమని తెలి పారు. దీనిపై సోమవారం తిరిగి కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సోల్ వ్యవస్థాపక సభ్యుడు బి.వి. సుబ్బారావు, పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి, సోల్ ప్రతినిధులు జాస్విన్ జైరాథ్, ఒమిమ్ కూడా విలేకరులతో మాట్లాడారు.