
నిండుచూలాలి నరకయాతన
ఆస్పత్రిలో అందుబాటులో ఉండని వైద్యుడు
ప్రసవం చేసేందుకు సిబ్బంది ప్రయత్నం
శిశువును సగభాగం బయటికి తీసి చేతులెత్తేసిన వైనం
శిశువు మృతి.. తల్లి పరిస్థితి ఆందోళనకరం
సాయంత్రం 4.30 గంటలు : అంగురీబాయికి పురిటి నొప్పులు వచ్చాయి. రోడ్డు సౌకర్యం లేక అక్కడికి 108 వాహనం వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఆమె అత్తామామలు, మరో ఇద్దరు కలిసి ఎడ్లబండిపై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోరిలాల్ వాగు వద్దకు చేర్చారు. అక్కడి నుంచి మరో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆనార్‌పల్లికి ఆటో సాయంతో వచ్చారు. అక్కడి నుంచి 108 లో రాత్రి 7.00 గంటలకు కెరమెరి పీహెచ్‌సీకి చేరుకున్నారు.
రాత్రి 7.00 గంటలు : అక్కడికి వచ్చే సరికి వైద్యుడు అందుబాటులో లేరు. కేవలం ఏఎన్‌ఎం, స్టాఫ్ నర్స్ మాత్రమే ఉన్నారు.
రాత్రి 7.10 గంటలు : డెలీవరీ చేసేందుకు సిబ్బంది ప్రయత్నం.
రాత్రి 8.40 గంటలు : గంటన్నరపాటు ప్రయత్నించి సగం బాబు ను బయటకు తీయగా.. తదుపరి ఆపరేషన్ చేయాలని.. పరిస్థితి విషమంగా ఉందని సిబ్బంది చేతులెత్తేశారు.
రాత్రి 8.45 గంటలు : 108 సహాయంతో ఆ కుటుంబ సభ్యులు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాత్రి 9 గంటలకు తీసుకొచ్చారు. ఇక్కడా ఆపరేషన్ సదుపాయం లేదని.. ఉట్నూర్ తీసుకెళ్లాలని సూచించారు.
రాత్రి 9.20 గంటలు : మళ్లీ 108 సహాయంతోనే సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉట్నూర్ సీహెచ్‌సీకి రాత్రి 10 గంటలకు తీసుకొచ్చారు. అప్పటికి సగభాగం బయటకు వచ్చిన శిశువు మృ తి చెందిన విషయాన్ని గుర్తించారు. వెంటనే శిశువును తొలగించాలని.. లేకుంటే తల్లి ప్రాణాలకు ప్రమాదమని.. వెంటనే రిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. ఇక్కడా ఆపరేషన్ సదుపాయం లేదు.
రాత్రి 10.30 గంటలు : దిక్కుతోచని పరిస్థితిలో అదే 108లో ఉట్నూర్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిమ్స్‌కు తీసుకెళ్లారు. రాత్రి 11.45 గంటలకు అక్కడికి చేరుకున్నారు.
రాత్రి 12.00 గంటలు : రిమ్స్ వైద్యులు మృత శిశువును తొలగిం చారు. తల్లి పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. 16 రోజులు ఆస్పత్రిలోనే ఉండాలన్నారు.