శంకర్‌పల్లి: మండల పరిధిలోని మిర్జాగూడ అనుబంధ ఇంద్రారెడ్డినగర్ కాలనీలో శనివారం అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. శంకర్‌పల్లి తహసీల్దార్ అనంత్‌రెడ్డి, నార్సింగి సీఐ రాంచందర్‌రావు ఆధ్వర్యంలో కూల్చివేతలు జరిగాయి. వివరాలు.. ఇంద్రారెడ్డినగర్ కాలనీలో సర్వేనెంబర్ 192లో నిరుపేదలకు 2004లో అప్పటి ప్రభుత్వం 60 గజాల చొప్పున 62 ఎకరాల్లో ఇళ్ల స్థలాలను కేటాయించింది. మధ్యవర్తులు అవకతవకలకు పాల్పడి ప్లాట్లను ఇతరులకు అమ్ముకొని డబ్బులు తీసుకొని లబ్ధిదారులకు నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారు. కొనుగోలు చేసిన వారు ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. ఈవిషయమై కొందరు జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుకు ఫిర్యాదు చేశారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు నెలరోజుల క్రితం రెవెన్యూ అధికారులు ఇంటింటికి తిరిగి విచారణ జరిపి 550 సర్టిఫికెట్లు బోగస్ అని నిర్ధారించారు. కలెక్టర్ ఆదేశానుసారం ఈ నెల 8న రెవెన్యూ అధికారులు 100 వరకు బేస్‌మెంట్, లెంటల్‌లెవల్ స్థాయిలో ఉన్న ఇళ్లను పూర్తిగా కూల్చి వేశారు. శనివారం మరో 110 ఇళ్లను నేలమట్టం చేశారు. దీంతో లబ్ధిదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తాము అప్పు చేసి ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసి లక్షల రూపాయలతో ఇళ్లు కట్టుకుంటే అధికారులు కూల్చివేయడం తగదన్నారు. ఎంపీపీ నర్సింలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోవర్దన్‌రెడ్డి, సర్పంచ్ సంజీవ, ఎంపీటీసీ రవిగౌడ్, జనవాడ ఎంపీటీసీ మైసయ్య తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు అండగా నిలిచారు. కాగా, తాము ఇళ్లను కట్టుకునేటప్పుడు వీఆర్‌ఓ సుధాకర్‌రెడ్డికి ఇళ్ల సర్టిఫికెట్‌లను చూపించామని, ఆయన చెప్పడంతోనే నిర్మించుకున్నామని బోరుమన్నారు. కూల్చివేత సమయంలో ఆర్డీఓ చంద్రమోహన్ రావడంతో ఆయనకు వ్యతిరేకంగా ఆర్డీఓ డౌన్‌డౌన్.. అని నినాదాలు చేసి అడ్డుకున్నారు. నార్సింగి ఠాణాకు జేసీ ఆమ్రపాలి వచ్చిందనే సమాచారంతో లబ్ధిదారులు అక్కడికి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
దీంతో ఆమె ఇంద్రారెడ్డినగర్‌కు చేరుకొని వివరాలు సేకరించారు. ఇంద్రారెడ్డినగర్ కాలనీలో ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లు లేకుండా ఇళ్లు కట్టుకున్న వారి నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పారు. లబ్ధిదారులు కూడా మూడేళ్లలో ఇళ్లు కట్టుకోకుంటే వాటిని రద్దు చేస్తామన్నారు. నిజమైన లబ్ధిదారులకు తాము అడ్డుచెప్పబోమని జేసీ స్పష్టం చేశారు. విధి నిర్వహ ణలో రెవెన్యూ అధికారులకు అడ్డుతగిలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడు వారాల తర్వాత రెవెన్యూ సదస్సు నిర్వహించి పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని జేసీ ఆమ్రపాలి తెలిపారు.
అక్రమ నిర్మాణాలు కూల్చివేత
Published Sun, May 31 2015 2:33 AM | Last Updated on Thu, Jul 26 2018 1:37 PM
Advertisement
Advertisement