Sankarpalli
-
నమ్మకంగా నడిపించి.. నట్టేట ముంచి
శంకర్పల్లి : సంఘం పేరుతో చిట్టీలు, డిపాజిట్ చేయించుకొని రాత్రికి రాత్రి ఉడాయించిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధి తులిచ్చిన సమాచారం ప్రకారం... మండల కేంద్రంలో వీరభద్రియ సంఘం చాలా సంవత్సరాలుగా ఉంది. అందులోని సభ్యులు వీరభద్రియ సంఘం పేరు మీద చిట్టీల దందా చేసేవారు. చాలామంది రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు సంఘంలో డబ్బులు డిపాజిట్ చేసుకొని నెలనెలా వడ్డీ తీసుకునేవారు. ఎక్కువ వడ్డీ వస్తుండటంతో వీరభద్రియ సంఘంలో కోట్ల రూపాయల డిపాజిట్లు చేశారు. అయితే నెలనెలా చిట్టీల డబ్బులను సంఘం వారు వాడుకోవడంతోపాటు ఇతర కార్యక్రమాలకు ఉపయోగించేవారు. గత రెండేళ్లుగా సంఘంలో డిపాజిట్ చేసిన వారి డబ్బులు సరిగా ఇవ్వకపోవడం, చిట్టీ డబ్బులు లేపిన తరువాత సరిగా ఇవ్వకపోవడంతో తమ డబ్బులు ఇచ్చేయాలని డిపాజిట్‌దారులు ఒత్తిడి చేయడం ఎక్కవైంది. సంఘం సభ్యులు నేడు రేపు నెలా, రెండు నెలలు అంటూ కాలం గడిపారు. ఈ నేపథ్యం లో శుక్రవారం రాత్రి సమయంలో సంఘం సభ్యు లు ఎవరికీ చెప్పకుండా ఇళ్లు ఖాళీ చేసి సంఘానికి తాళం వేసి వెళ్లిపోయారు. ఉదయం సంఘానికి తాళం వేసి ఉండటం చూసిన డిపాజిట్ దారులు ఆందోళనకు దిగారు. పైసాపైసా కూడబెట్టి దాచుకున్న డబ్బులతో ఉడాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది సంఘం ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూశారు. అయితే డబ్బులు సంఘంలో డిపాజిట్ చేసిన వారు ఒక్కరూ పోలీస్‌స్టేషకు వెళ్లి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. అయితే సంఘంలో ఎంత మంది ఎంతెంత డబ్బులు డిపాజిట్ చేశారనే వివరాలు పోలీసులకు అందిన ఫిర్యాదులను బట్టే తెలియరానున్నాయి. -
ప్లాస్టిక్ నోట్లతో రిజిస్ట్రేషన్
శంకర్పల్లి : రిజిస్ట్రేషన్ చేసుకొని చిన్నపిల్లలు ఆడుకొనే నోట్లు ఇచ్చి పారిపోయిన సంఘటన శంకర్‌పల్లిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా బంటారం మండలం సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన బాధితుడు కడుచర్ల అంజిలయ్య తండ్రి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. అంజిలయ్య తనకు శంకర్పల్లి మండల పరిధిలోని మహాలింగపురం గ్రామంలో మూడు వందల గజాల ప్లాటు ఉంది. ఆ ప్లాటును హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి బంటారం మండలం నూర్లంపల్లి గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి మధ్యవర్తిగా ఉండి విక్రయించారు. బుధవారం రోజు స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్లాటు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బయటకొచ్చిన తరువాత రూ1.50 లక్షల డబ్బులు ఇవ్వగా ఆ నోట్లను లెక్కిస్తున్నారు. మధ్యలో కొన్ని చిన్నపిల్లలు ఆడుకొనే ప్లాస్టిక్ నోట్లు ఉన్నాయని గుర్తించారు. వెంటనే శ్రీనివాస్‌ను నిలదీయగా ఇచ్చిన లక్షన్నరలో లక్ష రూపాయల రెండు వేల నోట్లు లాక్కొని కారులో పారిపోయాడు. మిగతా రూ. 50 వేలకు ప్లాస్టిక్ నోట్లు ఉన్నాయి. డబ్బులను లాక్కొని పారిపోతుండగా వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే బాధితుడు చుట్టుపక్కల వారిని పిలిచి జరిగిన విషయాన్ని వివరించాడు. శ్రీనివాస్ ఇచ్చిన నోట్లపై రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియాకు బదులు భారతీయ మనోరంజన్ బ్యాంక్ అని దాని పక్కనే పాంచ్ సౌ కూపన్ అని నోట్ల కింది భాగంలో పుల్ ఆఫ్ ఫన్ అని ముద్రించారు. బాధితుడు జరిగిన విషయంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
కబ్జాకు గురైన మార్కెట్ స్థలం స్వాధీనం
శంకర్పల్లి: రైతుల సంక్షేమమే తమ లక్ష్యమని వారి కోసం నిరంతరం పాటు పడుతామని శంకర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్‌యాదవ్ తెలిపారు. శంకర్పల్లి మార్కెట్ కమిటీ సమీపంలో సర్వే నెంబర్196/ఎలో కొంత భాగం కబ్జాకు గురెంది దానిని బుధవారం పాలకమండలి సభ్యులు అందరూ కలిసి స్వాధీనం చేసుకొని సంతను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక వ్యవసాయ మా ర్కెట్ కమిటీలో మొత్తం 7ఎకరాల30 గుంటల భూమి ఉందని అన్నారు. కాగా కొంత మంది అక్రమార్కులు మార్కెట్ కమిటీ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. భూమిని స్వాధీనం చేసుకొని అక్కడ పశువుల సంతను ఏర్పాటు చేశామని తెలిపారు. గ తంలో పశువుల సంత మార్కెట్ ఆవరణలో జరిగేదని దీంతో వ్యాపారులు , రైతులు ఇబ్బందులు పడేవారని తెలిపారు. ఇప్పుడు స్వాదీనం చేసుకున్న స్థలంలో పశువుల సంతను తరలించడం వలన ఉల్లి వ్యాపారులకు, రైతులకు ఇక్కట్లు తొలి గిపోయాయని అన్నారు. త్వరలోనే రైతుల కొరకు విశ్రాంతి భవననిర్మాణం చేపడుతామని అందుకు ప్రభుత్వనికి ప్రతిపాదనలు పాలకవర్గం తీర్మాణం చేసి పంపుతామని అన్నారు. మార్కెట్ కార్యదర్శి వెంకటయ్య మాట్లాడుతూ 5నవంబర్ 2015 సంవత్సరంలో ఈ భూమినిమార్కెట్ కమిటీ అధీనంలోకి వచ్చిందని అందుకే స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్, తహసీల్దార్, పోలీసులు అన్నిరకాలుగా సహకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దండురాజేశ్వర్, సర్పంచ్ శ్రీధర్, గుడిమల్కాపూర్ మార్కెట్‌కమిటీ డెరైక్టర్ శేరి అనంత్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ డెరైక్టర్లు వార్డు సభ్యులు, రైతు సంఘం నాయకులు తదితరులు ఉన్నారు. రైతుల విజయం... కబ్జాకుగురైన మార్కెట్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం రైతుల విజయం అని భారతీయ కిసాన్ సంఘ్ మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు రాంరెడ్డి, పాండురంగం, ప్రకాశ్‌చారి అన్నారు. బుధవారం వారు మాట్లాడు తూ మార్కెట్ స్థలం కబ్జాకు గు రైందని ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తున్నామన్నారు. జేఏసీ చైర్మన్ కోదండరామ్, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి ప్రత్యేకంగా మంత్రి హరీష్‌రావు, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారని అన్నారు. అధికారులు వెను వెంటనే రికార్డులు పరిశీలించి స్థలం కబ్జాకు గురైందని గుర్తించి కలెక్టర్ అదేశంతో తిరిగి స్వాధీనం చేసుకు న్నారన్నారు. రెతు సంఘం స హాయకార్యదర్శి దేవిరెడ్డి, జనార్దన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
కుమారుడిని చూసేందుకు వచ్చి..
శంకర్పల్లి: కుమారుడిని చూసేందుకు వచ్చిన ఓ తండ్రిని ఆటో ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యాడు. మరో ఘటనలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మరొకరు మృతిచెం దారు. శంకర్పల్లి పోలీసుల కథనం ప్రకారం.. ధారూరు మండలం మైలరం గ్రామానికి చెందిన మల్లయ్య(55) వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన కుమారుడు గోపాల్ మోకిల గ్రామంలో అద్దెకు ఉంటూ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బుధవారం మల్లయ్య కుమారుడిని చూసేందుకు మోకిల గ్రామానికి వచ్చాడు. గురువారం ఉదయం మోకిల గ్రామంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఆయనను వెనుక నుంచి టాటాఎస్ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లయ్యకు తీవ్ర రక్తగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడి కుమారుడు రాందాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు.. పరిగి: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పరిగి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. సీఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకా రం.. పరిగి మండలం రంగంపల్లికి చెందిన మల్లయ్య(38) బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా తుంకిమెట్లలో తమ బంధువుల వద్ద జరిగిన వింధుకు వెళ్లాడు. అదే రోజు రాత్రి ఇంటికి వచ్చే క్రమంలో చీకటిపడింది. రంగంపల్లి గేటు వద్ద గుర్తుతెలియని వాహనం ఆయనను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి భార్య బాలమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అక్రమ నిర్మాణాలు కూల్చివేత
శంకర్పల్లి: మండల పరిధిలోని మిర్జాగూడ అనుబంధ ఇంద్రారెడ్డినగర్ కాలనీలో శనివారం అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. శంకర్పల్లి తహసీల్దార్ అనంత్‌రెడ్డి, నార్సింగి సీఐ రాంచందర్‌రావు ఆధ్వర్యంలో కూల్చివేతలు జరిగాయి. వివరాలు.. ఇంద్రారెడ్డినగర్ కాలనీలో సర్వేనెంబర్ 192లో నిరుపేదలకు 2004లో అప్పటి ప్రభుత్వం 60 గజాల చొప్పున 62 ఎకరాల్లో ఇళ్ల స్థలాలను కేటాయించింది. మధ్యవర్తులు అవకతవకలకు పాల్పడి ప్లాట్లను ఇతరులకు అమ్ముకొని డబ్బులు తీసుకొని లబ్ధిదారులకు నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారు. కొనుగోలు చేసిన వారు ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. ఈవిషయమై కొందరు జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నెలరోజుల క్రితం రెవెన్యూ అధికారులు ఇంటింటికి తిరిగి విచారణ జరిపి 550 సర్టిఫికెట్లు బోగస్ అని నిర్ధారించారు. కలెక్టర్ ఆదేశానుసారం ఈ నెల 8న రెవెన్యూ అధికారులు 100 వరకు బేస్మెంట్, లెంటల్లెవల్ స్థాయిలో ఉన్న ఇళ్లను పూర్తిగా కూల్చి వేశారు. శనివారం మరో 110 ఇళ్లను నేలమట్టం చేశారు. దీంతో లబ్ధిదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తాము అప్పు చేసి ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసి లక్షల రూపాయలతో ఇళ్లు కట్టుకుంటే అధికారులు కూల్చివేయడం తగదన్నారు. ఎంపీపీ నర్సింలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోవర్దన్‌రెడ్డి, సర్పంచ్ సంజీవ, ఎంపీటీసీ రవిగౌడ్, జనవాడ ఎంపీటీసీ మైసయ్య తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు అండగా నిలిచారు. కాగా, తాము ఇళ్లను కట్టుకునేటప్పుడు వీఆర్ఓ సుధాకర్‌రెడ్డికి ఇళ్ల సర్టిఫికెట్లను చూపించామని, ఆయన చెప్పడంతోనే నిర్మించుకున్నామని బోరుమన్నారు. కూల్చివేత సమయంలో ఆర్డీఓ చంద్రమోహన్ రావడంతో ఆయనకు వ్యతిరేకంగా ఆర్డీఓ డౌన్‌డౌన్.. అని నినాదాలు చేసి అడ్డుకున్నారు. నార్సింగి ఠాణాకు జేసీ ఆమ్రపాలి వచ్చిందనే సమాచారంతో లబ్ధిదారులు అక్కడికి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ఆమె ఇంద్రారెడ్డినగర్‌కు చేరుకొని వివరాలు సేకరించారు. ఇంద్రారెడ్డినగర్ కాలనీలో ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లు లేకుండా ఇళ్లు కట్టుకున్న వారి నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పారు. లబ్ధిదారులు కూడా మూడేళ్లలో ఇళ్లు కట్టుకోకుంటే వాటిని రద్దు చేస్తామన్నారు. నిజమైన లబ్ధిదారులకు తాము అడ్డుచెప్పబోమని జేసీ స్పష్టం చేశారు. విధి నిర్వహ ణలో రెవెన్యూ అధికారులకు అడ్డుతగిలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడు వారాల తర్వాత రెవెన్యూ సదస్సు నిర్వహించి పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని జేసీ ఆమ్రపాలి తెలిపారు. -
కళ్లు చెదిరేలా జిల్లా అభివృద్ధి
శంకర్పల్లి: భారత దేశంలోనే తెలంగాణను ఆదర్శరాష్ట్రంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని, దీనికి రంగారెడ్డి జిల్లా ఎంతో కీలకంగా మారనుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జిల్లా కళ్లు చేదిరే రీతిలో అభివృద్ధి సాధిస్తుందన్నారు. మండల పరిధిలోని సింగాపూర్‌లో ఆదివారం తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీయూటీఎఫ్) ద్వితీయ జిల్లా మహాసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల, విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమైందని గుర్తు చేశారు. త్వరలోనే వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడనుందని చెప్పారు. జిల్లాలో స్థానికేతర ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉన్నారని, త్వరలోనే వారిని స్వస్థలాలకు పంపించి ఖాళీలను స్థానికులతో భర్తీ చేస్తామని చెప్పారు. చేవెళ్ల ఎమ్యెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. రాజకీయలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. జీవో 111ను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. వి కారాబాద్ ఎమ్యెల్యే సంజీవరావు మా ట్లాడుతూ.. చాలా పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల సమస్య ఉందని, వీటి పరిష్కారానికి త్వరలోనే ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని చెప్పారు. ప్రముఖ తెలంగాణ ఉద్యమకవి, గాయకుడు సాయిచంద్ పాడిన పాటలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందర్ని అలరించాయి. అంతకు ముందు మెదక్ జిల్లాలో ఇటీవల జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు సంతాప సూచికగా మౌనం పాటించారు. సర్వశిక్షా అభియాన్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ఆ సంఘం నాయకులు మంత్రికి వినతి పత్రం అందజేశారు. అలాగే టీయూటీఎఫ్ నాయకులు తాత్కాలిక సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి దృష్టికి తీసుకవెళ్లారు. కార్యక్రమంలో టీయూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు స్వామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, శంకర్పల్లి ఎంపీపీ మాల చిన్న నర్సింలు, మండల టీయూటీఎఫ్ గౌరవ అధ్యక్షుడు అంజయ్య, మండల అధ్యక్షుడు రఘునందన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మునీర్పాష, నరేందర్‌రెడ్డి, సుఖ్‌దేవ్, కమల్‌సింగ్ సర్పంచ్‌లు మాణిక్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, శ్రీధర్, సొసైటీ చైర్మన్ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.