శంకర్‌పల్లి: భారత దేశంలోనే తెలంగాణను ఆదర్శరాష్ట్రంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని, దీనికి రంగారెడ్డి జిల్లా ఎంతో కీలకంగా మారనుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జిల్లా కళ్లు చేదిరే రీతిలో అభివృద్ధి సాధిస్తుందన్నారు. మండల పరిధిలోని సింగాపూర్‌లో ఆదివారం తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీయూటీఎఫ్) ద్వితీయ జిల్లా మహాసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల, విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమైందని గుర్తు చేశారు.
త్వరలోనే వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడనుందని చెప్పారు. జిల్లాలో స్థానికేతర ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉన్నారని, త్వరలోనే వారిని స్వస్థలాలకు పంపించి ఖాళీలను స్థానికులతో భర్తీ చేస్తామని చెప్పారు. చేవెళ్ల ఎమ్యెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. రాజకీయలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. జీవో 111ను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. వి కారాబాద్ ఎమ్యెల్యే సంజీవరావు మా ట్లాడుతూ.. చాలా పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల సమస్య ఉందని, వీటి పరిష్కారానికి త్వరలోనే ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని చెప్పారు.
ప్రముఖ తెలంగాణ ఉద్యమకవి, గాయకుడు సాయిచంద్ పాడిన పాటలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందర్ని అలరించాయి. అంతకు ముందు మెదక్ జిల్లాలో ఇటీవల జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు సంతాప సూచికగా మౌనం పాటించారు. సర్వశిక్షా అభియాన్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ఆ సంఘం నాయకులు మంత్రికి వినతి పత్రం అందజేశారు. అలాగే టీయూటీఎఫ్ నాయకులు తాత్కాలిక సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి దృష్టికి తీసుకవెళ్లారు.
కార్యక్రమంలో టీయూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు స్వామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, శంకర్‌పల్లి ఎంపీపీ మాల చిన్న నర్సింలు, మండల టీయూటీఎఫ్ గౌరవ అధ్యక్షుడు అంజయ్య, మండల అధ్యక్షుడు రఘునందన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మునీర్‌పాష, నరేందర్‌రెడ్డి, సుఖ్‌దేవ్, కమల్‌సింగ్ సర్పంచ్‌లు మాణిక్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, శ్రీధర్, సొసైటీ చైర్మన్ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కళ్లు చెదిరేలా జిల్లా అభివృద్ధి
Published Sun, Jul 27 2014 10:57 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement