గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భూగర్భ జలాల తీరు కాస్త నిలకడగా ఉన్నా ఆందోళనకర పరిస్థితులు మాత్రం తలెత్తుతున్నాయి. అవసరాలకు తగ్గట్టుగా జలాలు అందడం లేదు. అధికారులు ప్రత్యామ్నాయమని చెప్తున్నా వాస్తవంలో ఆ ఏర్పాట్లు ఫలితాల్నివ్వడం లేదు. కొన్ని మండలాల్లో ఈ నెలలో మరీ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. నీటి ఎద్దడితో పల్లెలు అల్లాడుతున్నాయి. ఏదో ఒకటి చేసి ఆదుకోమని అధికారులను కోరుతున్నాయి.
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో భూగర్భ జలమట్టం రోజు రోజుకు పడిపోతోంది. ఎండలు తీవ్రరూపం దాల్చడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈనెల 17 నుంచి 23 (శుక్రవారం) వరకు 39.03 డిగ్రీల నుంచి 40.03 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత జిల్లాలో నమోదైంది. ఈ తీవ్రత భూగర్భ జలాలపైనా పడి ఆందోళనకర పరి స్థితులు తలెత్తుతున్నాయి. మార్చి మా సంలో భూగర్భ జలమట్టం 10.30 మీట ర్లకు పడిపోగా ఏప్రిల్ నాటికి నీటి మట్టం 11.02 మీటర్లకు దిగిపోయింది.
ఈ మే నెలలోనైతే మరీ దిగజారి పోయింది. ఇక గత ఏడాది మార్చిలో భూగర్భ జలమట్టం 15.02 మీటర్లు ఉండగా ఏప్రిల్‌లో 14.54 మీటర్లు కనిపించింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో అకాల వర్షాలు, వడగళ్ల వాన పడటం వల్ల గతేడాదితో పోల్చితే భూగర్భ జలాలు నిలకడగానే ఉన్నప్పటికీ.. ఆందోళన కర పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జిల్లాలోని 36 ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం 10 మీటర్ల లోతుకు పడిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా ధరూరు మండలంలో భూగర్భ జలమట్టం 36.32 మీటర్లకు పడిపోయింది. అదేవిధంగా బిజినేపల్లి మండలంలో 22.33 మీటర్లు నమోదుకాగా కల్వకుర్తిలో 23.58 మీటర్లు కొడంగల్ మండలం రుద్రారంలో 18.54 మీటర్లు, మహబూబ్‌నగర్ మండలం ఏనుగొండలో 18.30 మీటర్లు, మిడ్జిల్‌లో 23.52 మీటర్లు, నర్వలో 20.89 మీటర్లు, వెల్దండలో 22.14 మీటర్లు తాడూరులో 23.07 మీటర్లు, తలకొండపల్లిలో 19.90 మీటర్లు భూగర్భ జలమట్టం నమోదైంది. అదేవిధంగా అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో 13.31 మీటర్లు, బాలానగర్ మండలం రాజాపూర్‌లో 19.40 మీటర్ల లోతుకు భూగర్భ జలమట్టం పడిపోయింది. బల్మూరు, వెల్కిచర్ల, దేవరకద్ర, ఇదే మండలంలోని మీన్గవానిపల్లిలో, మరికల్, కొండాపూర్, గోపాల్‌పేట మండలంలోని ఎద్దుట్ల, ఐజ, జడ్చర్ల, తుర్కదిన్నె, కొడంగల్, కోస్గి, కానాయపల్లి, అంబట్‌పల్లి, మాగనూరు, కోడూరు, కొత్తపల్లి, కొల్లంపల్లి, నారాయణపేట, పాన్‌గల్ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పది మీటర్ల కంటే లోతుకు పడిపోయింది.
ఎండలు తీవ్రరూపం దాల్చడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి జిల్లాలో ఇప్పటికే రెండు వేలకు పైగా చేతి పంపులు వట్టిపోయాయి. 26 గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో అధికార యంత్రాంగం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని 745 మంచినీటి పథకాల ద్వారా అరకొరగా మంచినీటిని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని 312 ఫ్లోరైడ్ ప్రవహిత గ్రామాల్లో తాగునీటి సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది. ఎండలు ఇదే విధంగా కొనసాగినట్లయితే భూగర్భ జలమట్టం మరింత లోతుకు పడిపోవడం వల్ల చేతి పంపులు, మంచినీటి పథకాలకు సంబంధించిన బావులు ఇంకిపోయే ప్రమాదం ఏర్పడనుంది. అదేవిధంగా చేతికి అందివచ్చిన పంటలకు సాగునీరందని పరిస్థితి నెలకొని ఉంది.
గంగమ్మా...కానరావమ్మా..!
Published Sun, May 25 2014 2:49 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement