29 వరకు అసెంబ్లీ పొడిగింపు
- బడ్జెట్ సమావేశాలపై బీఏసీ భేటీలో నిర్ణయం
- 28న ద్రవ్య బిల్లుకు ఆమోదం
- రేవంత్ విషయాన్ని వదిలేయాలని జానా సూచన
- క్షమాపణ చెప్పేదాక వదలరన్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 29 దాకా పొడిగించారు. స్పీకర్ మదుసూదనాచారి అధ్యక్షతన శుక్రవారం జరి గిన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నా రు. వచ్చే సోమవారం నుంచి గురువారం వరకు వివిధ పద్దులు, శాఖలవారీ డిమాండ్లపై చర్చించనున్నారు.
నాలుగు రోజులూ సభ రెండు పూట ల సమావేశమవుతుంది. తర్వాత శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లును ఉభయసభల్లో ఆమోదించనున్నారు. వివిధ శాఖల పద్దులపై అన్ని పార్టీల అభిప్రాయాలను వెల్లడించే విధంగా ఈ నెలాఖరు దాకా సమావేశాలను పొడిగించాలని పలు పార్టీలు కోరాయి. బడ్జెట్ ఆమోదానికి డిసెంబర్ 2 వరకు అవకాశముందని కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్‌సీపీ సభ్యులు గుర్తు చేశారు. శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత బడ్జెట్‌ను గవర్నర్ ఆమోదించడానికి మూడు రోజు లు అవసరమైనందున, ఈ నెల 29 వరకు సమావేశాలను పొడిగించేందుకు బీఏసీ నిర్ణయించింది.
బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమం త్రి టి.రాజయ్య, మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, జి.చిన్నారెడ్డి(కాంగ్రెస్), డాక్టర్ కె.లక్ష్మణ్(బీజేపీ), అక్బరుద్దీన్ ఒవైసీ(ఎంఐఎం), తాటి వెంకటేశ్వర్లు(వైఎస్సార్ కాం గ్రెస్), సున్నం రాజయ్య(సీపీఎం), ఆర్.రవీంద్రకుమార్(సీపీఐ) హాజరయ్యారు.
సమావేశం నుంచి టీడీపీ వాకౌట్
బీఏసీలో సభ్యుల సంఖ్య విషయంలో స్పీకర్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ వాకౌట్ చేసింది. టీడీపీ తరఫున ఒకరికి సభ్యునిగా, మరొకరికి ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం కల్పించాలని గత బీఏసీ భేటీలో నిర్ణయించారు. తాజా భేటీకి టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి రావొద్దంటూ ప్రభుత్వం షరతు విధించించడంతో తమ పార్టీ నుంచి ఎంతమందికి అవకాశం కల్పిస్తారో రాతపూర్వకంగా చెప్పాలని టీడీపీ సభ్యు లు డిమాండ్ చేయగా స్పీకర్ నిరాకరించారు.
దీంతో వాకౌట్ చేస్తున్నట్టుగా టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, సండ్ర వెంకటవీరయ్య వెళ్లిపోయారు. కాగా ‘రేవంత్ తప్పుగా మాట్లాడినట్టుగా మీరు భావిస్తే ఆ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలిపెట్టండి. వెంటపడి వేధిస్తున్నట్టుగా కనిపించడం ప్రజాస్వామ్యంలో తప్పుడు సంకేతాలిస్తాయి’ అని బీఏసీలో జానారెడ్డి పేర్కొన్నారు. క్షమాపణ చెప్పేదాకా టీఆర్‌ఎస్ సభ్యులు వదలరని సీఎం వ్యాఖ్యానించారు.