తెలంగాణ రైతు సంఘాల జేఏసీ ఏర్పాటు
- 18న చైర్మన్, క న్వీనర్‌ల ఎంపిక
- రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించాలన్న ప్రొ.కోదండరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని దాదాపు 20 రైతు సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ)గా ఏర్పడ్డాయి. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు సంఘాలు సమావేశమయ్యాయి. వీటిల్లో పలు రాజకీయ పార్టీల రైతు విభాగాలతోపాటు స్వచ్ఛంద సంఘాలు కూడా ఉన్నాయి. ఈ నెల 18న మరోసారి సమావేశమై జేఏసీ చైర్మన్, కన్వీనర్‌లను ఎన్నుకోవాలని రైతు నేతలు తీర్మానించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రైతులు విత్తనాలు, ఎరువుల కోసం క్యూలో నిలుచునే పరిస్థితి రాకూడదన్నారు. అప్పులు, నష్టాలతో కుంగుబాటుకు గురైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరగటం చాలబాదాకరమని, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వంతో చర్చించి నివారణ చర్యలు తీసుకునేలా కృషి చేయాలన్నారు.
తెలంగాణ తొలి బడ్జెట్‌లో వ్యవసాయానికి నిధులు పెంచకపోగా ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్‌లో కంటే తక్కువ నిధుల కేటాయించడంతోనే రైతులపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోందని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ అన్నారు. రైతు సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు మేలు చేయాలని అఖిల భారత కిసాన్‌సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి సూచించారు. సమావేశంలో రైతు సంఘాల నేతలు పశ్య పద్మ, ఇంద్రకుమార్, సదానంద్, ప్రభాకర్‌రెడ్డి, జంగారెడ్డి, రంగయ్య, ఉపేందర్‌రెడ్డి, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.