
కోటిన్నర ఎకరాల్లో సాగు లక్ష్యం
2015-16 వ్యవసాయ ప్రణాళిక సిద్ధం
గత సీజన్ కంటే 20 లక్షల ఎకరాలు అదనం
115 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం
లక్ష్యం ఘనం.. వాతావరణ పరిస్థితులపైనే భారం
హైదరాబాద్: వచ్చే ఖరీఫ్, రబీ సీజన్లలో 1.52 కోట్ల ఎకరాల్లో పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 115.7 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పండించాలని నిర్దేశించుకుంది. ఈ మేరకు 2015-16 వ్యవసాయ ప్రణాళికను వ్యవసాయ శాఖ రూపొందించింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. త్వరలోనే దీనిని అధికారికంగా విడుదల చేయనున్నారు. సీజన్లవారీగా చూస్తే గత ఖరీఫ్‌లో కోటి ఎకరాల్లో సాగును లక్ష్యంగా పెట్టుకోగా.. వచ్చే ఖరీఫ్‌లో ఏకంగా 1.15 కోట్ల ఎకరాల్లో పంటల సాగు చేపట్టాలని నిర్ణయించారు. అంటే 15 లక్షల ఎకరాలు అదనం.
ఇక గత రబీలో 32.72 లక్షల ఎకరాల్లో పంటల సాగును లక్ష్యంగా నిర్దేశించుకోగా.. వచ్చే రబీలో 37.5 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. అంటే అదనంగా 4.78 లక్షల ఎకరాలు. మొత్తంగా గతేడాది కంటే వచ్చే వ్యవసాయ సీజన్‌లో ఖరీఫ్, రబీ కలిపి అదనంగా 19.78 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 107 లక్షల టన్నులు కాగా.. వచ్చే వ్యవసాయ సీజన్‌లో 115.7 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించాలని నిర్దేశించుకున్నారు. ఇందులో 68 లక్షల టన్నుల్లో వరి ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు.
పరిస్థితులు అనుకూలిస్తేనే..!
గత వ్యవసాయ సీజన్‌లో వర్షాభావం కారణంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా పంటల సాగు 96 శాతం వరకు ఉన్నా.. ముఖ్యమైన వరి, పప్పుధాన్యాల సాగు మాత్రం 83 శాతానికే పరిమితమైంది. దీనికితోడు సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో ఖరీఫ్‌లో ఆహార ధాన్యాల ఉత్ప త్తి దాదాపు 33 శాతం పడిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే వ్యవసాయ సీజన్ లక్ష్యాలపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఒకవేళ గత ఏడాది మాదిరిగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటే ప్రత్యామ్నాయ ప్రణాళికను కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిసింది. వ్యవసాయశాఖ, జయశంకర్ వ్యవసాయ వర్సిటీ కలిసి రూపొందించిన ఈ ప్రణాళిక ప్రకారం మూడు విడతల కంటింజెన్సీ ప్రణాళిక ఉండే అవకాశం ఉంది. జూలై 15లోపు సాధారణ స్థాయిలో వర్షాలు పడకుంటే ఒక ప్రణాళిక, జూలై 31లోపు వర్షాలు పడకుంటే రెండో ప్రణాళిక, ఆగస్టు 15 వరకు కూడా వర్షాలు కురవకుంటే మూడో ప్రణాళిక అమలు చేస్తారు. తక్కువ కాలపరిమితి పంటలు పండించే విధంగా రైతులను సిద్ధం చేస్తారు.