వైద్య శాఖలో అరకొరగా సిబ్బంది
కీలక పోస్టులు ఖాళీ..
అలంకారప్రాయంగా పీహెచ్‌సీలు
{V>Ð]l*ÌZÏ అందని ప్రభుత్వ వైద్యం
ఎంజీఎం : వర్షాకాలం మొదలైంది. ముసుర్లతో అంటు వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. పల్లెలు మంచం పట్టే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితుల నుంచి ప్రజలను గట్టెక్కించాల్సిన వైద్య శాఖ మాత్రం సిబ్బంది లేక ఇబ్బంది పడుతోంది. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో అవి అలంకారప్రాయంగా మారుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదు. జిల్లాకు ఐదు సివిల్ సర్జన్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం రెండు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ సివిల్ సర్జన్ 20 పోస్టులు ఉంటే రెండు ఖాళీగా ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 154 ఉంటే వీటిలో తొమ్మిది ఖాళీలు ఉన్నాయి. ఉన్నవారిలోనూ 11 మంది పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తి చేసేందుకు వెళ్లనున్నారు. వీరంతా ఏజెన్సీ ప్రాంతంలోని వారే. ఫార్మసిస్టు పోస్టులు 75కు 24 ఖాళీగా ఉన్నాయి. 65 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులలో 26 ఖాళీగా ఉన్నాయి. గ్రామాల్లో వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, చికిత్స అందించే హెల్త్ అసిస్టెంట్ పోస్టులు పురుషుల కేటగిరీలో 327 ఉండగా, అందులో 156, మహిళా కేటగిరీలో 546 పోస్టులకు గాను 140 ఖాళీగా ఉన్నాయి.
కొత్త పీహెచ్‌సీలు ఖాళీ...
గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ)లోనూ సేవలు అందుబాటులోకి రావడం లేదు. 2014-15లో జిల్లాలో కొత్తగా ప్రాథమిక వైద్య కేం ద్రాలను నిర్మించారు. కొన్నింటిని ప్రజాప్రతినిధులు హడావుడిగా ప్రారంభించారు. అరుుతే ఏ ఒక్కదాంట్లోనూ వైద్య సేవలు మొదలు కాలేదు. పీహెచ్‌సీలో ఒక వైద్యాధికారి, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, ఏఎన్‌ఎం, సహాయ సిబ్బంది ఉండాలి. కానీ, ఏ ఒక్క అధికారి, సిబ్బంది ఇప్పటి వరకు విధుల్లో చేరలేదు. తాడ్వాయి మండలం కాటాపూర్, హన్మకొండ మండలం పైడిపల్లి, కొండపర్తి, హసన్‌పర్తి మండలం సిద్ధాపూర్, చేర్యాల మండలం ముత్యాల, మంగపేట మండలం బ్రాహ్మణపల్లి, మహబూబాబాద్ మండలం మల్యాల, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ, ఇప్పగూడ, జనగామ మండలం ఓబుల్‌కేశ్వాపూర్, మరిపెడ మండలం ఉగ్గంపల్లిలో కొత్తగా పీహెచ్‌సీలను నిర్మించారు. అసరమైన సామగ్రిని సమకూర్చారు. వైద్య సేవలు అందించే సిబ్బంది మాత్రం లేకపోవడంతో ఇవన్నీ అలంకారప్రాయంగానే మిగిలాయి.