పేగు ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు
నా వయసు 32 ఏళ్లు. నేను కొంతకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి, మంట, మలంలో రక్తం కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదించాను. కొన్ని పరీక్షలు నిర్వహించి యానల్ ఫిషర్స్ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. నా సమస్య హోమియో మందులతో పూర్తిగా నయం అవుతుందా?– శివకుమార్, నరసరావుపేట
దీర్ఘకాలికంగా మలబద్దకం లేదా తరచూ విరేచనాలు అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు ఈ యానల్ ఫిషర్స్ బారిన పడే అవకాశం ఎక్కువ. ఇటీవలి కాలంలో ఉన్న పని ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వంటి అంశాలు జీర్ణవ్యవస్థౖపై ప్రభావం చూపి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వంటి సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. వీటి గురించి తెలుసుకుందాం.
పైల్స్: మలద్వారంలో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి వాపునకు గురై తీవ్రమైన నొప్పిని కలగజేస్తాయి. రక్తస్రావం కూడా కనిపిస్తుంది. సమస్యలను పైల్స్ అంటారు.
కారణాలు: దీర్ఘకాలిక మలబద్దకం, పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం, దీర్ఘకాలిక దగ్గు, మహిళల్లో గర్భధారణ సమయంలో పడే ఒత్తిడి, కాలేయ సంబంధిత వ్యాధులు పైల్స్‌ను కలగజేసే అవకాశం ఉంది.
ఫిషర్స్: మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఈ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల ఇది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన తర్వాత గానీ తీవ్రమైన నొప్పిని, రక్తస్రావాన్ని కలగజేస్తుంది.
కారణాలు: దీర్ఘకాలిక మలబద్దకం, తరచూ విరేచనాలు, పేగులకు ఇన్ఫెక్షన్ కలిగించే వ్యాధులు (ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్), ప్రసవ సమయంలో పెద్దపేగు చివరి భాగం... పురీషనాళానికి (రెక్టమ్‌కు) రక్తప్రసరణ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది.
ఫిస్టులా: రెండు ఎపిథీలియల్ కణజాలాల మధ్య ఒక గొట్టంలా ఏర్పడే నిర్మాణాన్ని ఫిస్టులా అంటారు. ఇది శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. అయితే సాధారణంగా ఇది మలద్వారానికి ఒక పక్కగా ఏర్పడుతుంది. దీన్ని యానల్ ఫిస్టులా అంటారు. మొదట అక్కడి చర్మంపై చిన్న మొటిమలాగా ఏర్పడి నొప్పి, వాపు కనిపిస్తాయి. రెండు మూడు రోజులలో అది పగిలి చీము స్రవిస్తుంది. దానివల్ల తీవ్రమైన నొప్పి, చీము, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తూ ఇబ్బంది పెడతాయి. దీని తీవ్రతను బట్టి వారంలో లేదా నెలలో 1, 2 సార్లు తిరగబెడుతూ ఉండవచ్చు.
కారణాలు : ఊబకాయం, గంటల తరబడి కదలకుండా ఒకేచోట కూర్చొని పనిచేయడం, తీవ్రమైన మలబద్దకంతో బాధపడేవారిలో ఈ సమస్య ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వంటి సమస్యలను హోమియో మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. సంపూర్ణంగా చికిత్స అందించడం ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే వాటిని తగ్గించి, అవి మళ్లీ తిరగబెట్టకుండా చేయవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
సీఎండీ, హోమియోకేర్
ఇంటర్నేషనల్, హైదరాబాద్
అలర్జీకి కారణాలనేకం
మా పాప వయసు 12 సంవత్సరాలు. వాతావరణంలో మార్పులు కనిపించగానే ఆమెను తుమ్ములు, జలుబు, ముక్కుదిబ్బడ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. స్కూలుకు సరిగా వెళ్లలేకపోతోంది. మా పాప సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – ప్రమోద్, ఏలూరు
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ పాప అలర్జీ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మనకు ఏదైనా వాతావరణంగానీ, ఆహారంగానీ సరిపడకపోతే వచ్చే సమస్యను అలర్జీ అని చెప్పవచ్చు. మన రోగనిరోధక వ్యవస్థ అతిగా ప్రతిస్పందించడంతో వేధించే సమస్యే అలర్జీ. ఈ సమస్య ఉన్నవారిలో తుమ్ములు, దగ్గు మాత్రమే కాకుండా ఒక్కోసారి శ్వాసతీసుకోవడం కష్టం కావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో వచ్చే జలుబు, దగ్గు సహజంగా ఒక్కోసారి వైరల్ జ్వరాలకు దారితీయవచ్చు. మన ఆధునిక జీవనం, పారిశ్రామిక ప్రాంతాలతో పాటు వాతావరణ కాలుష్యం కూడా అలర్జీకి కారణాలే.
అలర్జీ కారణంగా వచ్చే బాధలు వర్ణనాతీతం. వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా, పెద్దా అందరూ అలర్జీల బారిన పడుతున్నారు. అలర్జీని కలిగించే పదార్థాలను అలర్జెన్స్ అంటారు. అలర్జీలతో బాధపడేవారిలో వారికి సరిపడని పదార్థాల సంపర్కంలోనికి వచ్చినప్పుడు వారి శరీరంలోని యాంటీబాడీస్ వల్ల హిస్టమిన్ అనే పదార్థం విడుదల అవుతుంది. దీనివల్లనే వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరు లక్షణాలు కనిపిస్తాయి. శరీరతత్వం, వాతావరణం, వంశచరిత్ర, గాలి, నీరు, ఆహారం... వీటిలోని మార్పులు వంటి అనేక అంశాల వల్ల రక్తంలో కలిగే మార్పుల వల్ల కొందరిలో అలర్జీ కనిపిస్తుంది.
అలర్జీకి కారణాలు: దుమ్ము ∙పుప్పొడి రేణువులు ∙పెంపుడు జంతువులు, వాటి వెంట్రుకలు ∙ఘాటువాసనలు ∙చల్లటిగాలి ∙శీతలపానియాలు, ఐస్‌క్రీమ్స్ ∙మస్కిటో రిపల్లెంట్స్ ∙వాతావరణ మార్పులు ∙వంశపారంపర్యంగా రావచ్చు.
లక్షణాలు: ∙తుమ్ములు ∙ఉబ్బసం, ఆయాసం శ్వాసలో ఇబ్బందులు ∙వాంతులు ∙ముక్కుకారడం ∙ఒంటిపై ఎర్రని దద్దుర్లు ∙కళ్లలో దురద, కంట్లో ఏదో గుచ్చుకున్నట్లు ఉండటం
చికిత్స: హోమియోలో అలర్జీ సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం కలిగించే మందులు ఉన్నాయి. చికిత్సతో అన్ని రకాల అలర్జిక్ సమస్యలు దూరమవుతాయి. రోగనిరోధక శక్తి పెంచి, పూర్తిగా వ్యాధిని నయం చేయడం హోమియో ప్రక్రియలో సాధ్యమవుతుంది. ఈ సమస్యకు ఆర్సినిక్ ఆల్బ్, రస్టాక్స్, బెల్లడోన, అలియమ్ సెపా వంటి మందులు ఉన్నాయి. నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో ఈ మందులు వాడితే అలర్జీ పూర్తిగా నయమవుతుంది.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి,
ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్
వెన్ను నొప్పి తగ్గుతుందా?
నా వయసు 37 ఏళ్లు. గత ఏడాది కాలం నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. దగ్గరలో ఉన్న డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అంటున్నారు. దీనికి మందులు వాడుతున్నాను. నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా?– సువర్ణకుమార్, భీమవరం
స్పాండిలోసిస్ అనేది వెన్నెముకకు సంబంధించిన సమస్య. స్పాండిలోసిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అంటారు.
కారణాలు: ∙కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు.
∙జాయింట్స్‌లో వాటర్ తగ్గడం వల్ల కూడా నొప్పి రావచ్చు.
∙స్పైన్ దెబ్బతిని కూడా నొప్పి రావచ్చు.
∙వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి దారి ఉంటుంది. ఆ దారి సన్నబడితే నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది.
లక్షణాలు
సర్వైకల్ స్పాండిలోసిస్ : ∙మెడనొప్పి, తలనొప్పి తల అటు –ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది.
లంబార్ స్పాండిలోసిస్ : నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి ఒకవైపు కాలు, పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, దాంతో నడవడానికి కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి.
నిర్ధారణ: ∙వ్యాధి లక్షణాలను బట్టి ∙ఎక్స్–రే ∙ఎమ్మారై, సీటీ స్కాన్
నివారణ: వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం.
హోమియో చికిత్స: హోమియో ప్రక్రియలో ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా పరిష్కారం ఉంది. రోగి వ్యక్తిగత లక్షణాలను బట్టి వారి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని చికిత్స ఇస్తారు. ఇలా కాన్స్టిట్యూషనల్ చికిత్స అందిస్తే క్రమంగా రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధి తీవ్రత క్రమంగా తగ్గుతుంది. దాంతో క్రమక్రమంగా పూర్తిగా వ్యాధి నివారణ జరుగుతుంది.
డాక్టర్ టి. కిరణ్ కుమార్, డైరెక్టర్,
పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్