సత్యనారాయణపురంలోని బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్ వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకున్న కాల్పుల ఘటన..
చర్ల : సత్యనారాయణపురంలోని బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్ వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకున్న కాల్పుల ఘటనతో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. సరిహద్దులోని అటవీప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. సోమ, మంగళవారాల్లో సరిహద్దు ప్రాంతానికి చేరుకున్న గ్రేహౌండ్స్, డిస్ట్రిక్ట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసు బలగాలు ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి.
ఒక్కసారిగా భారీగా బలగాలు చేరుకోవడంతో సరిహద్దుల్లోని ఆదివాసీ గ్రామాల గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. సత్యనారాయణపురం కాల్పుల ఘటనలో పాల్గొన్న మావోయిస్టులు, మిలిటెంట్లు, మిలీషియా సభ్యుల ఆచూకీ కోసం తీవ్రంగా బలగాలు శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సరిహద్దు ప్రాంతాల్లోని ఎర్రంపాడు, చెన్నాపురం, బత్తినపల్లి, కుర్నపల్లి, ఎర్రబోరు, బోదనెల్లి, కురకట్‌పాడు, డోకుపాడు, తిప్పాపురం తదితర గ్రామాలలోని ఆదివాసీలను వారు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
మావోయిస్టులకు ఆదివాసీలు సహకరించవద్దని, ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బందులు కల్గించే వారికి సహకరించి ఇబ్బందులు తెచ్చుకోవద్దంటూ ఆదివాసీలకు పోలీసులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివాసీ గ్రామాల నుంచి ప్రజలు వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది.