గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ బుధవారం జిల్లాకు వస్తున్నారు.
నేడు గవర్నర్ నరసింహన్ రాక
జనగామ నియోజకవర్గంలో పర్యటన
వరంగల్ : గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ బుధవారం జిల్లాకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులను పరిశీలించనున్నారు. మెదక్ జిల్లాలో మిషన్ భగీరథ పనులను పరిశీలించిన అనంతరం గవర్నర్ నరసింహన్ మధ్యాహ్నం 12.10 గంటలకు కొమురవెల్లి క్రాస్ మీదుగా రోడ్డు మార్గంలో జిల్లాలోకి వస్తారు. జనగామ నియోజకవర్గంలోని చేర్యాల మండలంలో ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(ఓహెచ్‌బీఆర్) పనులను పరిశీలిస్తారు. అక్కడి నుంచి కొమురవెల్లి క్రాస్ మీదుగా తపాస్‌పల్లికి చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న పైపులైను పనులను పరిశీలిస్తారు. అక్కడి నుంచి మెదక్ జిల్లా మీదుగా హైదరాబాద్‌కు వెళ్తారు. గవర్నర్ నరసింహన్ గత వేసవిలో జిల్లాలో పర్యటించి మిషన్ కాకతీయ పథకంలో చేపట్టిన చెరువుల అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇప్పుడు మిషన్ భగీరథ పనుల పరిశీలన కోసం వస్తున్నారు.
ఐదు సెగ్మెంట్లుగా పనులు
ప్రతీ ఇంటికి శుద్ధమైన తాగునీటిని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. మన జిల్లాలోని మొత్తం ఆవాసాలకు తాగునీటిని అందించేందుకు ఐదు సెగ్మెంట్లుగా పనులు చేపడుతున్నారు. హైదరాబాద్ తాగునీటి సరఫరా బోర్డు(హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ)- మెట్రో వరంగల్, పాలేరు, ఎల్‌ఎండీ-పరకాల-వరంగల్, గోదావరి-మంగపేట, ఎల్లంపల్లి-మంథని-భూపాలపల్లి సెగ్మెంట్లుగా మిషన్ భగీరథ పనులను విభజించారు. మొదటి దశలో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ - మెట్రో వరంగల్ సెగ్మెంట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. గవర్నర్ నరసింహన్ ఈ సెగ్మెంట్‌లోని పనులను పరిశీలించనున్నారు.