
పాత.. కొత్త కలబోత
- ఇదీ కాంగ్రెస్ జాబితా..
- లోక్‌సభ అభ్యర్థుల ఖరారు
- మల్కాజిగిరి, సికింద్రాబాద్ సీట్లు సిట్టింగ్‌లకే..
- హైదరాబాద్‌కు కృష్ణారెడ్డి
- చేవెళ్లలో కార్తీక్‌రెడ్డి.. జైపాల్ మహబూబ్‌నగర్‌కు..
- ‘అసెంబ్లీ’ వీడని ఉత్కంఠ
సాక్షి, సిటీబ్యూరో: కొన్ని కొత్త ముఖాలు.. ఇంకొన్ని పాత ముఖాలు.. సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి కాంగ్రెస్ తన అభ్యర్థుల్ని సిద్ధం చేసింది. తొలి జాబితాను శనివారం రాత్రి ప్రకటించింది. గ్రేటర్ పరిధిలోని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాలకు సిట్టింగ్‌లైన సర్వే సత్యనారాయణ, అంజన్‌కుమార్ యాదవ్‌ల పేర్లే ఖరారయ్యాయి. చేవెళ్లలో సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డికి అవకాశమివ్వగా, అక్కడి సిట్టింగ్ ఎంపీ జైపాల్‌రెడ్డికి మహబూబ్‌నగర్ టికెట్‌ను కేటాయించింది. హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి నగర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ సామ కృష్ణారెడ్డిని పోటీకి దించింది. అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనను చివరి నిమిషంలో రద్దు చేయడంతో పార్టీ వర్గాలను నిరాశ పరిచింది.
మల్కాజిగిరి ‘సర్వే’దే..
మంత్రి సర్వే సత్యనారాయణ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. జనరల్ స్థానమైన మల్కాజిగిర
లోక్‌సభ పరిధిలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా వ్యతిరేకించినా సర్వే అభ్యర్థిత్వానికే అధిష్టానం మొగ్గు చూపడం గమనార్హం. అగ్రనేతలు, సెలబ్రిటీల పేర్లు ఆశావహుల జాబితాలో కనిపించినా.. చివరకు ఆయన పలుకుబడి ముందు నిలవలేదు. కాగా, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చే భువనగిరి లోక్‌సభ స్థానం కూడా సిట్టింగ్ సభ్యుడు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డికే ఖ రారైంది. తొలుత ఇక్కడి నుంచి పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రేసులో నిలవడం.. కోమటిరెడ్డి బ్రదర్స్ దీన్ని వ్యతిరేకించడంతో అధిష్టానం ఈ సీటు విషయంలో పునరాలోచన చేసింది.
చేవెళ్లకు కార్తీక్..
చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలనే అభిలాషను కార్తీక్‌రెడ్డి నెరవేర్చుకున్నారు. సీనియర్ నేత జైపాల్ రెడ్డి రాకతో 2009లో చివరి నిమిషంలో పార్టీ టికెట్ కోల్పోయిన కార్తీక్.. ఈసారి పట్టువదలకుండా పోరాడి బీ ఫారం దక్కించుకున్నారు. ఎలాగైనా ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్న కార్తీక్.. మూడు నెలల క్రితమే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీటు మారుతున్నట్లు జైపాల్ వెల్లడించకముందే చేవెళ్ల పార్లమెంటుపై తన ఇష్టాన్ని ‘తెలంగాణ నవ నిర్మాణ యాత్ర’ పేర బహిరంగ పరిచారు. ఈసారి కూడా పార్లమెంటు స్థానానికి పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది.
జైపాల్ తప్పుకున్నప్పటికీ, అక్కడి నుంచి బరిలోకి దిగడానికి మర్రి శశిధర్‌రెడ్డి గట్టి ప్రయత్నమే చేశారు. కుటుంబంలో ఒకరికే సీటు అని కాంగ్రెస్ నిబంధన పెట్టడంతో ఒకదశలో సబితా ఇంద్రారెడ్డికే చేవెళ్ల ఎంపీ టికెట్ ఖరారవుతుందని అంతా భావించారు. ఇదే విషయాన్ని అధిష్టానం కూడా స్పష్టం చేసింది. చివరకు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సీటును కార్తీక్‌రెడ్డికే కేటాయించారు.
మల్కాజిగిరి పార్లమెంట్
అభ్యర్థిపేరు : సర్వే సత్యనారాయణ
పుట్టిన తేదీ : 4 ఏప్రిల్, 1954
విద్యార్హత : బీఏ, ఎల్‌ఎల్‌బీ
భార్యా : సునీత
పిల్లలు : ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు
రాజకీయ నేపథ్యం : 13 ఏళ్ల పాటు ప్రభుత్వ సర్వీసులో కొనసాగి ఎస్‌ఎఐల్ ట్రేడ్ యూనియన్ నాయకునిగా పని చేశారు. 1985-89 మధ్య కాలంలో సిద్ధిపేట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు. 2004, 2009 ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
హైదరాబాద్
అభ్యర్థి పేరు : సామ కృష్ణారెడ్డి, హైదరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి
పుట్టినతేదీ : 01-17-1963
విద్యార్హత :బీకాం
నివాసం :నగరి అపార్ట్‌మెంట్, వినయ్‌నగర్ కాలనీ, ఐఎస్ సదన్
భార్య పేరు : విజయలక్ష్మి
పిల్లలు :రేష్మిరెడ్డి, రోహిణిరెడ్డి, భానుప్రతాప్
రాజకీయ నేపథ్యం : 1984లో ఎన్‌ఎస్‌యూఐ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక. 2003లో రంగారెడ్డిజిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నిక. 2010లో నగర గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా ఎన్నికై ఇంకా కొనసాగుతున్నారు.
సికింద్రాబాద్
అభ్యర్థిపేరు : ఎం.అంజన్‌కుమార్ యాదవ్, సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ
నివాసం : గొల్లకిడికి, పురానాపూల్ (పాతబస్తీ)
విద్యార్హత : బీఏ
భార్య : నాగమణి,
పిల్లలు : ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు
రాజకీయ నేపథ్యం : 1985లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004లో తొలిసారిగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ప్రత్యర్థి దత్తాత్రేయపై విజయం సాధించారు. 2009 మరోసారి పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మూడోసారి ఇదే స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.