సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లోని పోలీసుస్టేషన్‌లకు కొత్త వాహనాలను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు కొత్త ఇన్నోవా వాహనాలను, 300కు పైగా ద్విచక్ర వాహనాలను ప్రభుత్వం ఇదివరకే అందజేసిన సంగతి తెలిసిందే. మిగిలిన తొమ్మిది జిల్లాల పోలీసు స్టేషన్‌లకు సైతం కొత్త వాహనాలను సమకూర్చితే, గస్తీ విస్తృతమై శాంతి భద్రతలు పరిరక్షించడానికి వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే, ఇన్నోవా వాహనాలు పోలీసుల విధినిర్వహణకు అంతగా తోడ్పడవని వచ్చిన విమర్శలపై దృష్టి సారించిన ప్రభుత్వం జిల్లాలకు టాటాసుమో, బొలేరో వాహనాలను అందచేయాలని యోచిస్తోంది. అలాగే ద్విచక్ర వాహనాలను కూడా గస్తీ కోసం అందజేయనుంది. ఇందులో భాగంగా పూర్తిగా వాహనాలు లేని పోలీసుస్టేషన్‌లకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది.
దీనిపై డీజీపీ అనురాగ్‌శర్మ, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డిలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. రాష్ట్రంలో మొత్తం 680 పోలీసు స్టేషన్‌లు ఉన్నాయి. హైదరాబాద్,సైబరాబాద్‌లకు చెందిన పోలీసు స్టేషన్‌లు పోగా మిగతా వాటికి ప్రాధాన్యక్రమంలో కొత్త వాహనాలను అందచేస్తారని అధికారవర్గాలు తెలిపాయి.
జిల్లాల్లోనూ పోలీసులకు కొత్త వాహనాలు
Published Sun, Dec 7 2014 12:42 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement