1,200 ఏళ్ల క్రితమే భారత్‌కు పార్శీల వలస | The Parsis migrated to India 1,200 years ago | Sakshi
Sakshi News home page

1,200 ఏళ్ల క్రితమే భారత్‌కు పార్శీల వలస

Published Sat, Jun 17 2017 2:11 AM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

The Parsis migrated to India 1,200 years ago

నిర్ధారించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం  
సాక్షి, హైదరాబాద్‌: పర్షియా (నేటి ఇరాన్‌) నుంచి వలస వచ్చిన వారు పార్శీలని, వారు జొరాష్ట్రియన్‌ మతాన్ని అనుసరిస్తారని మనకు చరిత్ర చెబుతుంది. క్రీస్తు శకం 8–10 శతకంలో తొలి పార్శీ గుజరాత్‌కు వచ్చి, ఆ తరువాత దేశమంతా విస్తరించారని మనకు తెలుసు. జన్యువుల పరంగానూ ఇది నిజమేనని నిరూపించింది అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం. హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) నేతృత్వంలో ఈస్టోనియా, యూకే, పాకిస్తాన్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు నిర్వహించారు.

భారత్, పాకిస్తాన్‌లలో స్థిరపడ్డ పార్శీలు, గుజరాత్‌లోని సంజన్‌ ప్రాంతంలో బయటపడ్డ పార్శీల అవశేషాల నుంచి సేకరించిన జన్యువులను పరిశీలించడం ద్వారా వారు సుమారు 1,200 ఏళ్ల క్రితం భారత్‌కు వలస వచ్చినట్లు నిర్ధారించామని శుక్రవారం ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్‌ తంగరాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జన్యుపరంగా పార్శీలు నియోలిథిక్‌ ఇరానియన్లకు దగ్గరి వారని ఆయన చెప్పారు. మైటోకాండ్రియల్, వై–క్రోమోసోమల్, ఆటోసోమల్‌ డీఎన్‌ఏ మార్కర్లను ఈ పరిశోధనలో పరిశీలించామని, ఈ ఫలితాలు చరిత్ర పుస్తకాలతో సరిపోలుతున్నాయని సాంగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్త ఖాసీం అయూబ్‌ పేర్కొన్నారు.

భారత్‌పై ముస్లిం రాజుల దండయాత్రల ప్రభావం పార్శీలపై ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని ఈస్టోనియా బయోసెంటర్‌ శాస్త్రవేత్త జ్ఞానేశ్వర్‌ చౌబే తెలిపారు. పార్శీల గురించి ఇప్పటికే జరిగిన అధ్యయనాలు ఈ విషయాలనే చెబుతున్నప్పటికీ తాము తొలిసారి అత్యాధునిక పద్ధతుల ద్వారా నిర్ధారించడం గమనార్హమని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ కె.మిశ్రా తెలిపారు. పరిశోధన వివరాలు ప్రతిష్టాత్మక జీనోమ్‌ బయాలజీ మేగజైన్‌లో ప్రచురితమయ్యాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement