దువ్వడం కొత్తేం కాదు
ఆవిష్కరణం
మానవ నాగరికతను తెలిపే ప్రధాన చిహ్నాల కచ్చితంగా ఉండేది ‘దువ్వెన’. ఐదు వేల సంవత్సరాల క్రితమే ఇది పర్షియాలో బయటపడింది. ఇంకా చెప్పాలంటే అసలు మానవ నాగరికతకు సంబంధించి దొరికిన మొదటి వస్తువు కూడా అదే.
దువ్వెనలోని గొప్పదనం ఏంటంటే... ఇందులో అప్పటికీ ఇప్పటికీ పెద్ద తేడా కనపడుదు. అప్పుడూ ఒక పిడి లాంటి వస్తువుకు పొడవైన పళ్లు ఉండేవి. ఇపుడూ అంతే... కాకపోతే రంగులు, డిజైన్లు, సైజులు మాత్రమే తేడా. ఆకారాలు ఎన్ని మారినా దువ్వెన అన్నాక పళ్లు ఉండాల్సిందే. అందులో మార్పు చేయదగినది కూడా ఏమీ లేదు. మనిషి రూపురేఖలకు, అందానికి జుట్టు ఎంత అవసరమో ఈ దువ్వెన చరిత్ర చెబుతోంది. మనల్ని మనం అందంగా చూపుకోవడంలో జుట్టును మేనేజ్ చేయడం అన్నది వేల సంవత్సరాల క్రితమే మనిషి నేర్చుకున్న నాగరికత.
ప్రతిదాంట్లో వేలుపెట్టే అమెరికన్‌ల వల్ల ఇది కూడా పేటెంట్ బారిన పడింది. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాకు చెందిన వాల్టర్ సమన్స్ దువ్వెనకు కొన్ని మార్పులు చేసి 1920లో పేటెంట్ సంపాదించారు. అయితే అందులో ఆయన కొంత టెక్నాలజీ కూడా వాడారట. దాని ద్వారా జుట్టుకు వేడిని పంపి వాటిని సుడులు లేకుండా మార్చొచ్చట. ఇపుడు దీనికి అనేక రకాల వస్తువులు వచ్చాయి అది వేరే విషయం. కానీ దువ్వెన మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది... వజ్రం లాగా!