Iran Rainbow Valley Unknown Facts In Telugu: మట్టి వాసన బాగుందంటాం కానీ..దానిని రుచి చూడం. కానీ, మట్టినే మసాల దినుసులుగా, సాస్‌గా తీసుకుంటారంటే నమ్ముతారా? తినే పర్వతం ఒకటి ఉందంటే ఊహించగలరా? ఎగిసిపడుతున్న రక్తపు సముద్రాన్ని చూస్తే భయపడకుండా ఉండగలరా? చిటికెడు ఉప్పు అనేవాళ్లకు ఉప్పు కొండలు కనిపిస్తే అచ్చెరువొందరా? పర్వతాలే ఇంద్రధనస్సులై మెరిస్తే మైమరిచిపోరా? ఇదంతా ఏదో హాలీవుడ్ సినిమా గ్రాఫిక్స్ కాదు.. ఈ భూమి మీదే! ప్రపంచ పర్యాటకానికి దూరంగా..ఓ మాయా ద్వీపంలా ఉన్న ‘రెయిన్‌బో ఐలాండ్’ విశేషాలు తెలుసుకుందామా?
ఇరాన్–పర్షియన్ గల్ఫ్‌లోని హార్ముజ్ ద్వీపం 42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 7,000 జనాభా. ఇది శాస్త్రవేత్తలకు ఓ పెద్ద డిస్నీల్యాండ్. ఎటుచూసినా సహజసిద్ధంగా ఏర్పడిన రంగురంగుల పర్వతాలు..అడుగడుగునా ఖనిజ నిక్షేపాలు..నాపరాయి, మట్టి, ఇనుము అధికంగా ఉండే అగ్నిపర్వత శిలలతో ఏర్పడిన తెలుపు, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, నారింజ, లేత గోధుమరంగు, గోధుమ, లేత మణి, బంగారపు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. అందుకే దీనిని ‘రెయిన్‌బో ఐలాండ్’ అని పిలుస్తారు. ఈ దీవిలో దాదాపు 70 వరకు ఖనిజాలను గుర్తించారు. కోట్ల ఏళ్ల కిందట పర్షియన్ గల్ఫ్ అంచుల చుట్టూ సముద్రం నుంచి కొట్టుకొచ్చిన ఉప్పు భారీగా పేరుకుపోయిందని, ఖనిజ, అగ్ని పర్వతాలతో కలిసి రంగురంగుల ఉప్పు దిబ్బలుగా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.
చదవండి: 1485 ఎకరాల్లో అతి పేద్ద శ్మశానం.. ఇప్పటివరకు 50 లక్షల మృతదేహాలు..
– సాక్షి, అమరావతి
ఉప్పు దేవత..
స్థానికులు ఇక్కడి ఉప్పు పర్వతాన్ని దేవతగా పిలుస్తారు. ఇది కిలోమీటరకుపైగా విస్తరించి ఉంది. దీనికి ఔషధ గుణాలున్నాయని నమ్ముతారు. రాతి ఉప్పు గాలి పీల్చుకోవడంతో అనారోగ్య సమస్యలను నయమవుతాయని విశ్వసిస్తారు. అందుకే దీనిని పాజిటివ్ ఎనర్జీ వ్యాలీ అని కూడా అంటారు.
బ్లడ్ సీ..
ఈ ద్వీపంలోని సముద్రం ఎర్రటి అలలతో ఎగిసిపడుతుంది. అందుకే దీనిని బ్లడ్ బీచ్, బ్లడీ సీ అని పిలుస్తారు. ఐరన్ ఆక్సైడ్ అధికంగా ఉండే ఎర్రటి మట్టి వల్ల నీరు ఎరుపుగా ఉంటుంది. ఇక్కడ అతిపెద్ద రంగురంగుల మట్టి కార్పెట్ కనిపిస్తుంది. సైలెంట్ వ్యాలీ, రెయిన్‌బో గుహలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. 2019 ఇరాన్ లెక్కల ప్రకారం 18 వేల మంది మాత్రమే ఈ ప్రదేశాన్ని సందర్శించారు. ఇక్కడ పెద్ద వాహనాలు ఉండవు. స్థానికుల రిక్షాల్లో ద్వీపాన్ని చుట్టిరావచ్చు.
చదవండి: Viral Video: ‘వాట్ ఏ టైమింగ్.. ఇక్కడ విసిరితే అక్కడ ల్యాండ్ అయ్యింది’
తినే పర్వతం..
హార్ముజ్‌లోని ఓ పర్వతపు ఎర్ర మట్టిని సుగంధ ద్రవ్యంగా స్థానికులు వంటల్లో వినియోగిస్తుంటారు. ఇక్కడి పర్వతాల ఎర్రటి మట్టిని గెలాక్ అని పిలుస్తారు. ఇది అగ్నిపర్వత శిలల నుంచి ఉద్భవించిన హెమటైట్ ఐరన్ ఆక్సైడ్ వల్ల ఏర్పడింది. ఈ ఖనిజానికి ఎన్నో పారిశ్రామిక ఉపయోగాలున్నాయి. దీని మట్టి కూరలకు మంచి రుచి ఇస్తుంది. స్థానికులు దీనిని రొట్టెతో నంజుకుని తింటారు. తాజాగా పట్టిన సార్డినెస్, కిల్కా, మోమాగ్ చేపలను శుభ్రం చేసి వాటిని మట్టితో చేసి సాస్‌లో పెద్ద కంటైనర్‌లో వేసి 2 రోజులు ఎండలో ఉంచడంతో ‘సురఘ్’అనే రుచికరమైన భోజనం అవుతుంది. ఈ మట్టినే స్థానిక కళాకారులు పెయింటింగ్, సిరామిక్స్, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తారు
Comments
Please login to add a commentAdd a comment