అటు సొసైటీ.. ఇటు కార్పొరేషన్
రాజీవ్ స్వగృహ ఇళ్ల యజమానులకు కొత్త కష్టాలు
సాక్షి, మహబూబ్‌నగర్: సొంతింటి కలను నెరవేర్చే గొప్ప ఆలోచనతో మొదలైన రాజీవ్ స్వగృహ.. అధికారుల తీరుతో లబ్ధిదారులకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్‌లో ‘షెడ్యుల్–బి’ని చేర్చి మరొకరికి హక్కులు కల్పించారని లబ్ధిదారులు వాపోతున్నారు.రాజీవ్ స్వగృహ కింద రాష్ట్రంలో ఆదిలాబాద్, బండ్లగూడ, పోచారం, తాండూరు, మహబూబ్‌నగర్, రామగుండం, చందానగర్, గద్వాలలో చేపట్టిన ప్రాజెక్టులలో ఈ పరిస్థితి నెలకొంది. మరోవైపు రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు నిర్వహణ రుసుం కింద డబ్బులు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఒకవైపు సొసైటీ నిర్వాహకుల తీరు.. మరోవైపు కార్పొరేషన్ అధికారుల చర్యలతో స్వగృహ యజమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అంతా షెడ్యూల్–బితోనే..
రాజీవ్ స్వగృహ ఇళ్ల విషయంలో కిరికిరంతా షెడ్యూల్–బి కారణంగానే తలెత్తింది. ఇళ్ల రిజిస్ట్రేషన్ సమయంలో కచ్చితంగా సొసైటీలో సభ్యత్వం తీసుకోవాలని స్వగృహ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు. సొసైటీతో సంబంధం లేకుండానే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉన్నా రూ.1,200 చెల్లించి బలవంతంగా సభ్యత్వం తీసుకునేలా చేశారు. దీంతో షెడ్యూల్–బి కారణంగా స్వగృహలోని ఇళ్లపై అక్కడి సొసైటీకి సర్వహక్కులు కల్పించినట్లయింది. సొసైటీ నిబంధనలకు యజమానులు కట్టుబడి ఉండాల్సి వస్తోంది. నల్లా, విద్యుత్ కనెక్షన్ సహా ఇతర విషయాల్లో సొసైటీ నిర్వాహకుల చర్యలతో యజమానులు ఇబ్బందులకు గురవుతున్నారు. బ్యాంకు నుంచి రుణం పొందాలన్నా సొసైటీ నుంచి ఎన్‌వోసీ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
కొనుగోలుదారులకు నోటీసులు
స్వగృహ ఇళ్ల కొనుగోలుదారులకు తాజాగా కార్పొరేషన్ నుంచి నోటీసులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహణ రుసుం పేరిట ఒక్కొక్క ఇంటికి రూ.9,000 చెల్లించాలంటూ నోటీసులిచ్చారు. వీధిలైట్ల కరెంట్ బిల్లు సొసైటీ నుంచి వసూలు చేయాల్సి ఉండగా.. తమకు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. సొసైటీ సభ్యత్వ రుసుం పేరిట రూ.1,200, నల్లా కనెక్షన్ కోసం వసూలు చేసిన రూ.3 వేలు సొసైటీ వద్దే ఉన్నాయని.. నిర్వహణ చార్జీలు కూడా వారినుంచి తీసుకోవాలంటున్నారు.
నిర్వహణ బిల్లు చెల్లించాల్సిందే
2015 నుంచి విద్యుత్, వాటర్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండేళ్లుగా సొసైటీగానీ, ఇళ్ల యజమానులుగానీ వీటిని చెల్లించలేదు. ఇప్పటి వరకు రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంది. సొసైటీ ముందుకు రాకపోవడంతో యజమానులకు నోటీసులు జారీ చేశాం. ఒక్కొక్కరూ రూ.9 వేలు చెల్లించాలని సూచించాం. యాజమాన్య హక్కులకు సంబంధించి షెడ్యూల్–బి విషయం ప్రభుత్వంతో తేల్చుకోవాల్సిందే.
– శ్రీనివాస్, రాజీవ్‌స్వగృహ జీఎం, మహబూబ్‌నగర్