rajeev swagruha
-
అటు సొసైటీ.. ఇటు కార్పొరేషన్
రాజీవ్ స్వగృహ ఇళ్ల యజమానులకు కొత్త కష్టాలు సాక్షి, మహబూబ్‌నగర్: సొంతింటి కలను నెరవేర్చే గొప్ప ఆలోచనతో మొదలైన రాజీవ్ స్వగృహ.. అధికారుల తీరుతో లబ్ధిదారులకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్‌లో ‘షెడ్యుల్–బి’ని చేర్చి మరొకరికి హక్కులు కల్పించారని లబ్ధిదారులు వాపోతున్నారు.రాజీవ్ స్వగృహ కింద రాష్ట్రంలో ఆదిలాబాద్, బండ్లగూడ, పోచారం, తాండూరు, మహబూబ్‌నగర్, రామగుండం, చందానగర్, గద్వాలలో చేపట్టిన ప్రాజెక్టులలో ఈ పరిస్థితి నెలకొంది. మరోవైపు రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు నిర్వహణ రుసుం కింద డబ్బులు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఒకవైపు సొసైటీ నిర్వాహకుల తీరు.. మరోవైపు కార్పొరేషన్ అధికారుల చర్యలతో స్వగృహ యజమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతా షెడ్యూల్–బితోనే.. రాజీవ్ స్వగృహ ఇళ్ల విషయంలో కిరికిరంతా షెడ్యూల్–బి కారణంగానే తలెత్తింది. ఇళ్ల రిజిస్ట్రేషన్ సమయంలో కచ్చితంగా సొసైటీలో సభ్యత్వం తీసుకోవాలని స్వగృహ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు. సొసైటీతో సంబంధం లేకుండానే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉన్నా రూ.1,200 చెల్లించి బలవంతంగా సభ్యత్వం తీసుకునేలా చేశారు. దీంతో షెడ్యూల్–బి కారణంగా స్వగృహలోని ఇళ్లపై అక్కడి సొసైటీకి సర్వహక్కులు కల్పించినట్లయింది. సొసైటీ నిబంధనలకు యజమానులు కట్టుబడి ఉండాల్సి వస్తోంది. నల్లా, విద్యుత్ కనెక్షన్ సహా ఇతర విషయాల్లో సొసైటీ నిర్వాహకుల చర్యలతో యజమానులు ఇబ్బందులకు గురవుతున్నారు. బ్యాంకు నుంచి రుణం పొందాలన్నా సొసైటీ నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొనుగోలుదారులకు నోటీసులు స్వగృహ ఇళ్ల కొనుగోలుదారులకు తాజాగా కార్పొరేషన్ నుంచి నోటీసులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహణ రుసుం పేరిట ఒక్కొక్క ఇంటికి రూ.9,000 చెల్లించాలంటూ నోటీసులిచ్చారు. వీధిలైట్ల కరెంట్ బిల్లు సొసైటీ నుంచి వసూలు చేయాల్సి ఉండగా.. తమకు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. సొసైటీ సభ్యత్వ రుసుం పేరిట రూ.1,200, నల్లా కనెక్షన్ కోసం వసూలు చేసిన రూ.3 వేలు సొసైటీ వద్దే ఉన్నాయని.. నిర్వహణ చార్జీలు కూడా వారినుంచి తీసుకోవాలంటున్నారు. నిర్వహణ బిల్లు చెల్లించాల్సిందే 2015 నుంచి విద్యుత్, వాటర్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండేళ్లుగా సొసైటీగానీ, ఇళ్ల యజమానులుగానీ వీటిని చెల్లించలేదు. ఇప్పటి వరకు రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంది. సొసైటీ ముందుకు రాకపోవడంతో యజమానులకు నోటీసులు జారీ చేశాం. ఒక్కొక్కరూ రూ.9 వేలు చెల్లించాలని సూచించాం. యాజమాన్య హక్కులకు సంబంధించి షెడ్యూల్–బి విషయం ప్రభుత్వంతో తేల్చుకోవాల్సిందే. – శ్రీనివాస్, రాజీవ్‌స్వగృహ జీఎం, మహబూబ్‌నగర్ -
రాజీవ్ స్వగృహ ప్లాట్లు
90ఎకరాల్లో ఖాళీ స్థలాల్లోనే ప్లాట్లు 7344 దరఖాస్తులు.. 402 ప్లాట్లు ఒక్కో ప్లాటు 200 గజాలు దరఖాస్తుదారులకే అవకాశం తిమ్మాపూర్ : మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2007లో ప్రవేశపెట్టిన పథకం రాజీవ్ స్వగృహ. ఇందులో భాగంగా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో అంగారిక పేరుతో గృహ నిర్మాణాలు చేపట్టగా అర్ధాంతరంగా ఆగిపోయాయి. ప్రస్తుతం ఈ స్థలంలో ప్లాట్లు చేసి విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంగారిక ప్రాజెక్టులో గేటెడ్ కమ్యూనిటీతో అన్ని హంగులతో ఇండిపెండెంట్ ఇల్లు, ప్లాట్లు తక్కువ ధరలకే అందిస్తామని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ప్రకటించింది. 2007లో దరఖాస్తులు ఆహ్వానించగా 7344 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల నుంచి రూ.5వేల చొప్పున డిపాజిట్ స్వీకరించారు. కాంట్రాక్టర్ పనులు ఇళ్ల నిర్మాణ పనులు మెుదలు పెట్టారు. వైఎస్సార్ మరణం తర్వాత సకాలంలో బిల్లులు రాకపోవడంతో పనులను పునాదుల్లోనే నిలిపేశారు. దీంతో దాదాపు ఆరేళ్ల నుంచి ఈ ప్రాజెక్టు పెండింగ్‌లో పడింది. దరఖాస్తుదారుల సొమ్ము సుమారు రూ.4కోట్లు స్వగృహ కార్పొరేషన్ వద్దనే ఉంది. తర్వాత 2014 ఫిబ్రవరిలో 90ఎకరాల స్థలంలో ప్లాట్లు చేసి విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కో ప్లాటు ధరను నిర్ణయించి అందులో 25శాతం డిపాజిట్ ఫిబ్రవరి 14లోగా చెల్లించాలని కోరారు. దీంతో దరఖాస్తుదారులు తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. తమకు నమ్మకం కలిగించకుంటే డిపాజిట్ ఎలా చెల్లిస్తామని ప్రశ్నించారు. సుమారు వంద మంది దరఖాస్తుదారులు తమ రూ.5వేల డిపాజిట్ సొమ్మును వాపస్ తీసుకున్నారు. మిగిలిన వారు తమకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. స్థలం చదును పనులు షురూ... తాజాగా రాజీవ్ స్వగృహ స్థలంలో ప్లాట్లు చేసి దరఖాస్తుదారులకే విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు స్థలం చదును చేసే పననులు చేపట్టారు. 90 ఎకరాల స్థలంలో కోర్టులో ఉన్న 24 ఎకరాలు, నిర్మాణాలు చేపట్టిన స్థలాలు కాకుండా ఖాళీగా ఉన్న స్థలాల్లో 402 ప్లాట్లు చేయాలని నిర్ణయించారు. గజానికి రూ.3వేల ధరను నిర్ణయించి 200 గజాల కొలతలతో రూ.6లక్షలకు ఒక ప్లాట్‌ని విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. 7344 దరఖాస్తులను డ్రా తీసి 402 మందిని ఎంపిక చేస్తామని, అదనంగా 200 మందికి డ్రా తీసి వారిని రిజర్వులో ఉంచుతామని పేర్కొంటున్నారు. 402 మందిలో ఎవరు వద్దన్నా మిగతా 200 మంది నుంచి అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించి వదిలేసిన వాటికి మరో ధర నిర్ణయించి విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వీటిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుని తుది ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. కాగా కోర్టు కేసులో ఉన్న స్థలంపై తీర్పు వచ్చేదాకా ప్లాట్ల పనులను అడ్డుకుంటామని బాధితుల్లో కొందరు హెచ్చరిస్తున్నారు. -
రాజీవ్ స్వగృహతో పేదలకు మేలు
హైదరాబాద్: రాజీవ్ స్వగృహతో పేదలకు మేలు జరుగుతుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాక ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల కోసం రాజీవ్ స్వగృహను ప్రవేశపెట్టారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. నిర్ణీత ప్లాన్ ప్రకారమే ఇళ్ల నిర్మాణం జరగాలని సూచించారు. రాజీవ్ స్వగృహ ఇళ్లు నిర్మించిన ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించాలని కోరారు.