రాజీవ్ స్వగృహ ప్లాట్లు
-
90ఎకరాల్లో ఖాళీ స్థలాల్లోనే ప్లాట్లు
-
7344 దరఖాస్తులు.. 402 ప్లాట్లు
-
ఒక్కో ప్లాటు 200 గజాలు
-
దరఖాస్తుదారులకే అవకాశం
తిమ్మాపూర్ : మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2007లో ప్రవేశపెట్టిన పథకం రాజీవ్ స్వగృహ. ఇందులో భాగంగా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో అంగారిక పేరుతో గృహ నిర్మాణాలు చేపట్టగా అర్ధాంతరంగా ఆగిపోయాయి. ప్రస్తుతం ఈ స్థలంలో ప్లాట్లు చేసి విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంగారిక ప్రాజెక్టులో గేటెడ్ కమ్యూనిటీతో అన్ని హంగులతో ఇండిపెండెంట్ ఇల్లు, ప్లాట్లు తక్కువ ధరలకే అందిస్తామని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ప్రకటించింది. 2007లో దరఖాస్తులు ఆహ్వానించగా 7344 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల నుంచి రూ.5వేల చొప్పున డిపాజిట్ స్వీకరించారు. కాంట్రాక్టర్ పనులు ఇళ్ల నిర్మాణ పనులు మెుదలు పెట్టారు. వైఎస్సార్ మరణం తర్వాత సకాలంలో బిల్లులు రాకపోవడంతో పనులను పునాదుల్లోనే నిలిపేశారు. దీంతో దాదాపు ఆరేళ్ల నుంచి ఈ ప్రాజెక్టు పెండింగ్‌లో పడింది. దరఖాస్తుదారుల సొమ్ము సుమారు రూ.4కోట్లు స్వగృహ కార్పొరేషన్ వద్దనే ఉంది. తర్వాత 2014 ఫిబ్రవరిలో 90ఎకరాల స్థలంలో ప్లాట్లు చేసి విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కో ప్లాటు ధరను నిర్ణయించి అందులో 25శాతం డిపాజిట్ ఫిబ్రవరి 14లోగా చెల్లించాలని కోరారు. దీంతో దరఖాస్తుదారులు తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. తమకు నమ్మకం కలిగించకుంటే డిపాజిట్ ఎలా చెల్లిస్తామని ప్రశ్నించారు. సుమారు వంద మంది దరఖాస్తుదారులు తమ రూ.5వేల డిపాజిట్ సొమ్మును వాపస్ తీసుకున్నారు. మిగిలిన వారు తమకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు.
స్థలం చదును పనులు షురూ...
తాజాగా రాజీవ్ స్వగృహ స్థలంలో ప్లాట్లు చేసి దరఖాస్తుదారులకే విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు స్థలం చదును చేసే పననులు చేపట్టారు. 90 ఎకరాల స్థలంలో కోర్టులో ఉన్న 24 ఎకరాలు, నిర్మాణాలు చేపట్టిన స్థలాలు కాకుండా ఖాళీగా ఉన్న స్థలాల్లో 402 ప్లాట్లు చేయాలని నిర్ణయించారు. గజానికి రూ.3వేల ధరను నిర్ణయించి 200 గజాల కొలతలతో రూ.6లక్షలకు ఒక ప్లాట్‌ని విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. 7344 దరఖాస్తులను డ్రా తీసి 402 మందిని ఎంపిక చేస్తామని, అదనంగా 200 మందికి డ్రా తీసి వారిని రిజర్వులో ఉంచుతామని పేర్కొంటున్నారు. 402 మందిలో ఎవరు వద్దన్నా మిగతా 200 మంది నుంచి అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించి వదిలేసిన వాటికి మరో ధర నిర్ణయించి విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వీటిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుని తుది ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. కాగా కోర్టు కేసులో ఉన్న స్థలంపై తీర్పు వచ్చేదాకా ప్లాట్ల పనులను అడ్డుకుంటామని బాధితుల్లో కొందరు హెచ్చరిస్తున్నారు.