రాజధాని రైతుకు టోపీ !
-
ప్లాట్ల పంపిణీపై మాట తప్పిన ప్రభుత్వం
-
పచ్చతమ్ముళ్లకు కోరుకున్న చోట ..
-
చిన్న, సన్న కారు కర్షకులకు వేరే చోట
-
నేడు శాఖమూరు రైతులకు ప్లాట్లు పంపిణీ
-
లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్న సీఆర్‌డీఏ
-
తుళ్లూరు కార్యాలయం వద్ద భారీ ఏర్పాట్లు
సాక్షి, అమరావతి బ్యూరో : వడ్డించేవాడు మనవాడైతే... కడ బంతిలో కూర్చున్నా పంచభక్ష పరమాన్నాలు అందుతాయన్న నానుడికి శాఖమూరులో ప్లాట్ల పంపిణీ నిదర్శనం కానుంది. రాజధాని నిర్మాణం కోసం భూములు వదులుకున్న రైతులకు పరిహారం కింద ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏ గ్రామంలో అయితే భూములు తీసుకు న్నారో... అదే ఊరు పొలిమేరల్లో ప్లాట్లు ఇస్తామని పాలకులు హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాటను తుంగలో తొక్కి స్థానిక రైతులు కొందరికి ఇతర గ్రామాల సరిహద్దుల్లో ప్లాట్లు ఇవ్వనున్నారు. అందులో తుళ్లూరు మండలం శాఖమూరు గ్రామం ఒకటి.
రాజధాని నిర్మాణం కోసం శాఖమూరు గ్రామానికి చెందిన 1572 మంది రైతులు సుమారు 1500 ఎకరాలను వదులుకున్నారు. వీరందరికి నివాసయోగ్యమైనవి 1841, వాణిజ్య పరమైనవి 1208 ప్లాట్లు బుధవారం తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద లాటరీ పద్ధతిలో పంపిణీ చేస్తున్నారు. పాలకులు ఆదేశాల మేరకు, వారు సూచించిన విధంగా ప్లాట్ల పంపిణీ నిర్వహిస్తున్నట్లు ఓ అధికారి స్పష్టం చేశారు. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, ఇంకా సర్కారుకు అనుకూలంగా ఉన్న మోతుబరి రైతులు సుమారు 30 మందికి పైగా శాఖమూరు పొలిమేరల్లోనే ప్లాట్లు కేటాయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక శాఖమూరులో మిగిలిన చిన్న, సన్న కారు రైతులకు నెక్కల్లు, పెదపరిమి గ్రామాల పొలిమేరల్లో ప్లాట్లు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. శాఖమూరు పొలిమేరల్లో ఇస్తున్న ప్లాట్లు విలువైనవని, నెక్కల్లు, పెదపరిమి గ్రామ సరిహద్దుల్లో కేటాయిస్తున్న ప్లాట్లకు పెద్దగా విలువ ఉండదని రైతులే చెబుతున్నారు.
రైతుల వేదన అరణ్యరోదనేనా?
బంగారంలాంటి పంట పొలాలను వదులుకున్న రైతులకు న్యాయం చేస్తామన్న ప్రభుత్వ పెద్దల మాటలు నీటి మూటలేనని కొన్ని గంటల్లో తేలిపోనుంది. భూములు వదులుకున్న రైతులకు ఇచ్చే ప్లాట్లకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే చెప్పండి, పరిష్కరిస్తామని చెపుతూ సీఆర్‌డీఏ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు పర్యాయాలు చేపట్టిన అవగాహన సదస్సులు రసాభాసగా మారాయి. కొందరికి నెక్కల్లు, మరికొందరికి పెదపరిమి గ్రామంలో ప్లాట్లు కేటాయిస్తుండడంపై మండిపడుతున్నారు. అంతకు ముందు రైతులు పలుమార్లు అధికారులను కలిసి విన్నవించారు. ఇవేమీ పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు వారు అనుకున్నట్లు ప్లాట్ల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం
చేశారు.
ఇక రైతుల్లో వ్యతిరేకతను దష్టిలో ఉంచుకుని మంగళవారం రాత్రి ముసాయిదాలో కొద్దిగా మార్పులు చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ప్లాట్లన్నీ తుళ్లూరు రెవెన్యూ పరిధిలోనే ఇస్తున్నామని చెప్పుకోవడానికి ఈ మార్పు చేసినట్టు తెలుస్తోంది. అయితే అవి ఆ గ్రామాల్లో కాకుండా సరిహద్దుల్లో ఇస్తుండడం గమనార్హం. వాణిజ్య ప్లాట్లు కొన్ని ఉప్పలపాడు చెరువులో, మరికొన్ని తుళ్లూరు–నేలపాడు మధ్య, ఎక్కువగా పెదపరిమి మార్గంలో కేటాయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్లాట్ల పంపిణీ కార్యక్రమం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎవ్వరూ ఎదురు తిరిగి మాట్లాడకుండా ఉండాలని రైతులకు రాత్రంతా కౌన్సెలింగ్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ కార్యక్రమంలో ఎవరైనా నోరెత్తితే వారిపై అక్రమ కేసులు బనాయించాలని కూడా పెద్దల నుంచి పోలీసులకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ప్లాట్లు తీసుకోకుంటే మీకే నష్టమని పాలకులు కొందరు మంగళవారం రాత్రికే రైతులకు సంకేతాలు పంపారు. తీసుకోనివారికి ప్లాటు విలువ కట్టి ఆ మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాలో జమచేయడానికి సిద్ధంకావటం గమనార్హం.