హరిత తెలంగాణను సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.
గజ్వేల్: హరిత తెలంగాణను సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. గురువారం గజ్వేల్‌లో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హౌసింగ్ బోర్డు కాలనీ, కస్తుర్బా, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఆవరణల్లో మొక్కలు నాటడమే కాకుండా పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఏటా 40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు వెల్లడించారు. చెట్ల నరికివేత వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ దుస్థితికి అడ్డుకట్ట వేసి ఆకుపచ్చని తెలంగాణను సాధించుకునేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. ఈ ప్రక్రియ ఉద్యమంలా జరగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయని వెల్లడించారు. త్వరలోనే పలు యూనివర్సిటీలు, రీసెర్చ్ సెంటర్లు తరలిరానున్నాయని చెప్పారు.
ఈ నియోజకవర్గం.. దేశంలోనే ఆదర్శంగా మారటం ఖాయమన్నారు. ఇదిలావుంటే మొక్కల నాటే కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీష్‌రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, పట్టణవాసులచే మొక్కలను పెంచుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఆ తర్వాత ముట్రాజ్‌పల్లిలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీని సందర్శించారు. కస్తుర్బా పాఠశాలను సందర్శించి విద్యార్థినుల ఇబ్బందులను తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఓఎస్‌డీ హన్మంతరావు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ దుంబాల అరుణ, టీఆర్‌ఎస్ నాయకులు దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మడుపు భూంరెడ్డి, టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు మద్దిరాజిరెడ్డి, యాదగిరి, మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, దేవీ రవీందర్, మధు, ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు.