ఊరటా? పన్నుపోటా?
గజ్వేల్ : గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీని ఆస్తిపన్ను హడలెత్తిస్తోంది. వివాదస్పదంగా మారిన పన్నుపెంపు వ్యవహారంపై మరో పది రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. పెంపును వ్యతిరేకిస్తూ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసి.. తీర్మానం ప్రతిని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌కు పంపింది. దీనిపై ముఖ్యమంత్రి తీసుకోనున్న తుది నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
మరీ ఇంత దారుణంగానా?
2012 జనవరిలో గజ్వేల్.. మేజర్ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయింది. నగర పంచాయతీలో ప్రజ్ఞాపూర్‌తో పాటు ముట్రాజ్‌పల్లి, క్యాసారం గ్రామ పంచాయతీలు విలీనమయ్యాయి. ఫలితంగా పరిధి పెరిగింది. జనాభా 40 వేలకుపైగా చేరుకుంది. నగర పంచాయతీ పరిధిలో ఇళ్ల సంఖ్య 9 వేలకు పెరిగింది. నగర పంచాయతీగా మారాక పన్నుల భారం పెరుగుతుందని అందరూ ఊహించారు కానీ.. మరీ ఇంతలా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందనుకోలేదు. పన్ను పెంపు సరాసరిన 200 నుంచి వెయ్యి శాతం వరకు ఉంది. దీంతో పట్టణ ప్రజలు పన్ను బాధను తలుచుకుని బెంబేలెత్తుతున్నారు. ఆస్తిపన్ను పెంపును వ్యతిరేకిస్తూ ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.
ఎందుకిలా..
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో నెల క్రితం వరకు మేజర్ పంచాయతీగా ఉన్న కాలం నాటి ‘క్యాపిటల్ వాల్యూ మెథడ్’ పన్నుల విధానమే అమలైంది. దీని ప్రకారం ఆస్తి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ విలువపై 5 నుంచి 10 శాతం పన్నులు వసూలు చేసేవారు. దీంతో భారం తక్కువుండేది. తాజాగా ‘మంత్లీ రెంటల్’ విధానంలో పన్నుల వసూలు జరగనున్నది. దీని ప్రకారం ఓ భవనంలో గదుల సంఖ్య, వాటి వైశాల్యం, ఆ గదికి వచ్చే నెలసరి అద్దె ఆధారంగా పన్ను వడ్డిస్తారు.
ఇక, వాణిజ్య సముదాయాలపై పన్ను పెంపు గతంతో పోలిస్తే వెయ్యి శాతానికిపైగా ఉండబోతున్నది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన 25 నగర పంచాయతీలు మేజర్ నుంచి నగర పంచాయతీలుగా అప్‌గ్రేడైన కారణంగా.. వాటిల్లో కొత్త పన్నుల విధానం ఉండాలనే ఆలోచనతో ఈ పెంపు నిర్ణయం అమల్లోకి రానున్నది. అయితే, రాష్ట్రంలోని 43 మున్సిపాలిటీల్లో మాత్రం 2002 నాటి పన్నుల విధానమే అమల్లో ఉంది.
కొత్త విధానంలో వడ్డింపులిలా..
కొత్త పన్ను విధానంలో నగర పంచాయతీని 4 జోన్లుగా విభజించి.. ఆస్తుల విలువను బట్టి పన్నులు నిర్ధారించారు. ఉదాహరణకు మొదటి జోన్‌లో ఇంటికి సెల్లార్, జీ ప్లస్-1, రెండు, మూడు ఫ్లోర్లకు ఒక చదరపు మీటర్‌కు గతంలో రూ.2-రూ.4 చొప్పున పన్ను వసూలు చేస్తే ప్రస్తుతం అది రూ.10కి చేరుకుంది. అంటే పెరుగుదల 200 శాతం పైమాటే. దుకాణాలు, ఆఫీసులు, బ్యాంకులు, హోటళ్లు, నర్సింగ్‌హోంలు, గోదాములు, సినిమా థియేటర్లు, విద్యాసంస్థలు, లాడ్జిలు, రెస్టారెంట్లు, కమ్యునిటీ హాల్‌లు, ఆడిటోరియం, పెట్రోల్‌బంక్, సెల్‌టవర్స్ వంటి వ్యాపార, వాణిజ్య భవనాలపై వెయ్యి శాతానికిపైగా పెంపు ఉండనుంది.
కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసి మున్సిపల్ పరిపాలన కమిషనరేట్‌కు పంపింది. ఈ ఫైల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లనుంది. దీనిపై సీఎం తీసుకునే నిర్ణయాన్ని బట్టి పెంపా? తగ్గింపా? అనేది తేలనుంది.